వరంగల్ దళిత దండోరా సభకు రాహుల్.. కేసీఆర్ ను వణికించేలా రేవంత్ ప్లాన్
posted on Aug 19, 2021 @ 5:32PM
తెలంగాణ పీసీసీ చీఫ్ గా తనదైన మార్క్ చూపిస్తున్న రేవంత్ రెడ్డి.. వరుస కార్యక్రమాలతో దూసుకుపోతున్నారు. ఒక రకంగా అధికార పక్షాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. పీసీసీ చీఫ్ కాగానే చలో రాజ్ భవన్ పిలుపుతో సర్కార్ కు చుక్కలు చూపించారు రేవంత్ రెడ్డి. తర్వాత దళిత గిరిజన దండోరా సభలతో గర్జిస్తున్నారు. మొదట ఇంద్రవెల్లిలో నిర్విహంచిన దండోరా సక్సెస్ కావడంతో అదే ఊపుతో రావిర్యాల సభను గ్రాండ్ సక్సెస్ చేశారు. దండోరా సభలకు జనాలు పోటెత్తడం.. సభల్లో రేవంత్ రెడ్డి ప్రసంగాలు అనూహ్య స్పందన వస్తుండటంతో కాంగ్రెస్ లో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. అదే జోష్ తో వరుస కార్యక్రమాలకు ప్లాన్ చేస్తున్నారు రేవంత్ రెడ్డి.
కాంగ్రెస్ యువనేత రాహుల్ గాంధీ త్వరలో తెలంగాణకు వస్తున్నారని తెలుస్తోంది. సెప్టెంబర్ 17న వరంగల్ లో భారీ బహిరంగ సభకు ప్లాన్ చేస్తున్న రేవంత్ రెడ్డి.. ఆ సభకు రాహుల్ గాంధీ వచ్చేలా స్కెచ్ వేస్తున్నారు. వరంగల్ సభకు రాహుల్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని అంటున్నారు. అంతలోపే వారానికొకటి చొప్పున మరో నాలుగు దళిత దండోగా గిరిజన సభలు నిర్వహించబోతున్నారట. చివరి సభగా తెలంగాణ విమోచన దినోత్సవం అయిన సెప్టెంబర్ 17న రాహుల్ గాంధీని రప్పించి .. దాదాపు ఐదు లక్షల మంది భారీ సభకు రేవంత్ రెడ్డి ప్లాన్ చేశారని చెబుతున్నారు. పీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి చాలా వ్యూహాత్మకంగా ముందుకెళుతున్నారు. అసంతృప్తిని చల్లార్చి సీనియర్లను మచ్చిక చేసుకొని.. అందరికీ ఒక్కతాటిపైకి తీసుకొచ్చి చాలా పకడ్బందీగా ముందుకెళుతున్నారు. పార్టీ బలోపతంపై స్పష్టమైన లక్ష్యంతో రేవంత్ ముందుకెళుతున్నారు.
బహిరంగ సభలతో పాటు నియోజక వర్గాల వారీగా నివేదికలు తయారు చేయడానికి రేవంత్ రెడ్డి ప్లాన్ చేసినట్లు తెలిసింది. బాగా పనిచేసిన వారిని పార్టీ గుర్తిస్తుందని స్పష్టమైన సంకేతాలు పంపాడట.. ఈ క్రమంలోనే 119 నియోజక వర్గాలకు ఇంచార్జి ఎలా పని చేశారో వారి పనితీరుకు ఇదో కొలబద్దగా తీసుకోవాలని డిసైడ్ అయ్యాడట.. క్షేత్ర స్థాయిలో పని చేసిన వారి పనితీరుతోనే పార్టీ బాగు పడుతుందని ఈ క్రమంలోనే 17 పార్లమెంట్ లలో ప్రత్యేక నివేదికలు తయారు చేయాలని నిర్ణయించారు. ఏ స్థాయిలో పనిచేస్తున్న నాయకులు అయినా నియోజక వర్గంలో వారి పనితీరు పైన నివేదిక ఇవ్వాలని తన టీంకు పురమాయించాడట.పార్టీ నిర్మాణం, ప్రజా సమస్యలపై పోరాటం విషయంలో నాయకులు చురుగ్గా ఉండాలని సూచించారు.నియోజకవర్గంలో ఉన్న నాయకులకు సమన్వయ కర్తలు ఖచ్చితంగా సమాచారం ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు.
దళిత, గిరిజనులే టార్గెట్ గా రేవంత్ రెడ్డి పక్కా ప్రణాళికలతో ముందుకు వెళుతున్నట్లు కనిపిస్తోంది. ఈ వర్గాలకు గతంలో కాంగ్రెస్ అమలు చేసిన పథకాలను గుర్తు చేస్తూనే.. ప్రస్తుత కేసీఆర్ సర్కార్ ఎలా మోసం చేస్తుందో చెప్పేలా కాంగ్రెస్ వ్యూహరచన చేస్తోందని తెలుస్తోంది. ఫీజ్ రీయింబర్స్మెంట్ ఇవ్వడం లేదని, ఆరోగ్య శ్రీని ఆపేశారని. అంశాలను ఏజెండాలో చేర్చాలని రేవంత్ నిర్ణయించుకున్నారట. బ్యాక్ లాగ్ ఉద్యోగాలు అమలు చేసి ఉంటే వేలాది దళిత, గిరిజన కుటుంబాలు ఆత్మ గౌరవంతో బతికేవని ఉద్యోగాల అంశాన్ని నెత్తిన ఎత్తుకోవాలని రేవంత్ నిర్ణయించారు.గ్రేటర్ హైదరాబాద్ లో వరదల్లో కుటుంబానికి 10 వేల రూపాయలు ఇస్తా అని ఎగ్గొట్టాడని..హైదరాబాద్ లో 10 వేలు ఇవ్వలేని కేసీఆర్ రాష్ట్రంలో ఉన్న 30 లక్షల దళిత, గిరిజన కుటుంబాలకు ఎలా ఇస్తారన్న అంశాన్ని హైలెట్ చేయాలని రేవంత్ ప్లాన్ సిద్ధం చేశారని అంటున్నారు.ఇందులో భాగంగా ఆగస్టు 9 క్విట్ ఇండియా దినం నుంచి తెలంగాణ విలీన దినం సెప్టెంబర్ 17 వరకు 40 రోజుల పాటు ఈ ఆత్మగౌరవ దండోరా కార్యక్రమం చేపట్టాలని రేవంత్ రెడ్డి ప్లాన్ చేశారని అంటున్నారు.