జగన్ సర్కారుపై విశాఖ శారదాపీఠం ఆగ్రహం.. స్వామీజీ సంచలనం..
posted on Sep 26, 2021 @ 5:02PM
తెలుసుగా. వైసీపీ ప్రభుత్వం, విశాఖ శారదాపీఠం ఎంత క్లోజో అందరికీ తెలుసుగా. విశాఖ శారదాపీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతికి సీఎం జగన్ అంటే వల్లమానిన ప్రేమ. ఈ విషయం ఆయనే ఓ సందర్భంలో బహిరంగంగానే చెప్పారు. రాగధ్వేషాలకు అతీతంగా ఉండాల్సిన స్వామీజీ ఇలా ఒక రాజకీయ నాయకుడిపై ప్రత్యేకమైన ప్రేమ ప్రదర్శించడం ఆ పీఠాధిపతికే తెలియాలి. ఏపీలో ఆలయాలపై దాడులు, మతమార్పిడిలు, టీటీడీలో అన్యమత ప్రచారం తదితర అంశాల్లో విశాఖ శారదాపీఠం వ్యూహాత్మక మౌనం పాటిస్తోందనే విమర్శలు ఉన్నాయి. అది వేరే విషయం. ఇప్పుడు మేటర్ ఏంటంటే.. తాజాగా జగన్ సర్కారు తీసుకున్న ఓ నిర్ణయం విశాఖ శారదాపీఠానికి ఆగ్రహం తెప్పించింది. మనవాడే కదాని మురిసిపోతుంటే.. ఇలాంటి చర్యలు తీసుకుంటున్నాడేంటి అని శారదాపీఠమే మండిపడుతోంది. ఆ ఆగ్రహాన్ని మనసులో పెట్టుకోకుండా బయటకు వెల్లగక్కింది. అందుకే ఆ అంశం ఇప్పుడు ఏపీలో హాట్ టాపిక్‌గా మారింది.
వైఎస్ జగన్మోహన్‌రెడ్డి సర్కారుపై విశాఖ శారదాపీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి నిరసన గళం వినిపించారు. బ్రాహ్మణ కార్పొరేషన్‌ను వెనుకబడిన సంక్షేమ శాఖలో కలపాలన్న ప్రభుత్వ నిర్ణయం సరైంది కాదని స్వరూపానందేంద్ర సరస్వతి భావిస్తున్నట్లు శారదాపీఠం ఓ ప్రకటనలో తెలిపింది. ఈ విషయంపై ముఖ్యమంత్రి కార్యాలయంతో సంప్రదింపులు జరుపుతున్నట్లు శారదాపీఠం వెల్లడించింది.
అగ్ర వర్ణాలన్నింటినీ ఈబీసీ జాబితాలోకి చేర్చాలని శారదాపీఠం ప్రతిపాదిస్తోంది. దీనిపై త్వరలోనే సానుకూల నిర్ణయం వెలువడుతుందని ఆశిస్తున్నామని, బ్రాహ్మణులను బీసీ జాబితాలోకి కలపాలని చూస్తే పోరాటం చేస్తామని విశాఖ శారదాపీఠం హెచ్చరిస్తోంది. తమకు ఎంతో ఇష్టమైన జగన్ ప్రభుత్వంపై స్వరూపానందేంద్ర సరస్వతి ఇలాంటి కఠిన ధోరణి ప్రదర్శించడం ఇటీవల కాలంలో ఇదే తొలిసారి. అందుకే దీనిపై అంతటి ఆసక్తి. బ్రాహ్మణ కార్పొరేషన్‌ను వెనకబడిన సంక్షేమ శాఖలో కలపాలన్న వైసీపీ ప్రభుత్వ నిర్ణయంపై.. స్వతహాగా తనకు కమ్యూనిస్టు భావాలున్నాయని చెప్పుకునే విశాఖ శారదాపీఠాధిపతి స్వామి స్వరూపానందేంద్ర సరస్వతి వారు ఇలా రెబెల్ జెండా ఎగరేయడం సంచలనంగా మారింది. ఇలానే మిగతా మత విషయాల్లోనూ ఎప్పటికప్పుడు శారదాపీఠం స్పందిస్తే బాగుండేదని అంటున్నారు. ఇక, తమకు ఇష్టమైన స్వామీజీకే జగన్ సర్కారు కోపం తెప్పించిందంటే ప్రభుత్వం ఎంత అడ్డగోలు నిర్ణయాలు తీసుకుంటుందో అర్థం అవుతోందని అంటున్నారు.