వైసీపీలో ముదిరిన వర్గపోరు.. మంత్రి పెద్దిరెడ్డికి రోజా ఫిర్యాదు..
posted on Sep 26, 2021 @ 4:25PM
మగాడివైతే రిజైన్ చెయ్.. రాజీనామా చేసి మళ్లీ గెలవాలంటూ శనివారం వైసీపీ నేతపై చిందులు తొక్కిన ఎమ్మెల్యే రోజా ఆదివారం మరింత జోరు పెంచారు. చిత్తూరు జిల్లా నిండ్ర ఎంపీపీ ఎన్నికల్లో విప్‌ను ఉల్లంఘించిన ఎంపీటీసీ సభ్యులను అనర్హులుగా ప్రకటించాలని.. వారిని వైసీపీ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఆ మేరకు పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని కలిసి వినతిపత్రం ఇవ్వడం సంచలనంగా మారింది.
నిండ్ర ఎంపీపీ ఎన్నికను అడ్డుకోవడంతో పార్టీకి వ్యతిరేకంగా ధర్నాలు చేసిన చక్రపాణిరెడ్డి, ఆయన సొదరుడిపై చర్యలు తీసుకోవాలని మంత్రి పెద్దిరెడ్డికి ఎమ్మెల్యే రోజా వినతిపత్రం అందజేశారు. ప్రజలకు అందుబాటులో ఉన్న వ్యక్తులకు పదవులను కేటాయిస్తూ పార్టీ తీసుకున్న నిర్ణయాన్ని వారు వ్యతిరేకించారని రోజా మంత్రికి ఫిర్యాదు చేశారు.
శనివారం చిత్తూరు జిల్లా వైసీపీలో వర్గ పోరు భగ్గుమంది. ఫైర్ బ్రాండ్ లీడర్ రోజా ప్రాతినిధ్యం వహిస్తున్న నగరి నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో వైసీపీ రెండుగా చీలిపోయింది. నిండ్ర మండలం ఎంపీపీ ఎన్నిక తీవ్ర ఉద్రిక్తతంగా మారింది. ఓ వర్గం ఎమ్మెల్యే రోజా బలపరిచిన దీపను ఎంపిపి చేయాలని ప్రయత్నించగా.. రోజా ప్రత్యర్థి వర్గం తనకే ఎంపీపీ పదవి ఇవ్వాలని డిమాండ్ చేసింది. శుక్రవారం జరగాల్సిన ఎంపీపీ ఎన్నిక కోరం లేక వాయిదా పడగా.. శనివారం సమావేశంలో రెండు వర్గాల మధ్య తీవ్ర ఘర్షణ జరిగింది.
నిండ్ర మండలంలో వైసీపీకి 8 మంది ఎంపీటీసీలు ఉన్నారు. ఇందులో ముగ్గురు ఎమ్మెల్యే రోజా వర్గంలో ఉండగా.. మిగితా ఐదుగురు రోజాకు వ్యతిరేకంగా భాస్కర్ రెడ్డికి సపోర్టుగా నిలిచారు. దీంతో అధికారులపై, సొంత పార్టీ ప్రత్యర్థి వర్గం పైన ఎమ్మెలేయే రోజా చిందులు వేశారు. నిబంధనల ప్రకారం తాము బలపరిచిన అభ్యర్థిని ఎంపీపీగా ప్రకటించాలంటూ అధికారులతో వాదనకు దిగారు రోజా. టిడిపి కార్యకర్తలు అంటూ సొంత పార్టీ కార్యకర్తలతో గొడవ పడ్డారు. మగాడివైతే ఎంపీటీసీ పదవికి రాజీనామా చేసి మళ్లీ గెలవాలంటూ భాస్కర్ రెడ్డిని సవాల్ చేశారు ఎమ్మెల్యే రోజా. ఇద్దరి మధ్య వాగ్వాదంతో ఎంపీడీవో కార్యాలయంతో తీవ్ర ఉద్రిక్తత తలెత్తింది.
ఆ గొడవకు కంటిన్యూగా ఆదివారం విషయాన్ని మంత్రి పెద్దిరెడ్డి దృష్టికి తీసుకెళ్లారు రోజా. పార్టీ లైన్‌కు వ్యతిరేకంగా పని చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆసక్తికర విషయం ఏంటంటే.. మంత్రి పెద్దిరెడ్డికి, ఎమ్మెల్యే రోజాకు మధ్య ఏళ్లుగా కోల్డ్‌వార్ నడుస్తోంది. రోజా వర్గీయులను పెద్దిరెడ్డి వర్గం అణగదొక్కుతున్నారంటూ గతంలో రోజా కన్నీటి పర్యంతమయ్యారు. తాజాగా, చక్రపాణిరెడ్డి సోదరులకు వ్యతిరేకంగా మంత్రి పెద్దిరెడ్డి ఇంటికి వెళ్లి మరీ ఎమ్మెల్యే రోజా కలవడం సంచలనంగా మారింది. ఓ ప్రత్యర్థికి వ్యతిరేకంగా మరో ప్రత్యర్థి ఇంటికి వెళ్లడం పార్టీలో చర్చనీయాంశమైంది.