తెలుగు రాష్ట్రాల్లో భారత్ బంద్.. సకలం క్లోజ్..
posted on Sep 27, 2021 @ 12:00PM
ఏపీ, తెలంగాణలో భారత్‌బంద్ విజయవంతమైంది. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా సంయుక్త కిసాన్ మోర్చా పిలుపుతో దేశవ్యాప్తంగా భారత్ బంద్ కొనసాగింది. రెండు తెలుగు రాష్ట్రాల్లోని వివిధ రాజకీయ పక్షాలు, ప్రజా సంఘాలు బంద్‌కు మద్దతు ఇవ్వడంతో బంద్ ప్రశాంతంగా జరిగింది. వివిధ పార్టీల నాయకులు బంద్‌ను పర్యవేక్షించారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతికేరంగా నినాదాల చేస్తూ ర్యాలీలు నిర్వహించాయి. స్వచ్ఛందంగా షాపులు, స్కూళ్లు మూసేశారు. ఏపీలో మధ్యాహ్నం వరకు బస్సు సర్వీసులను ప్రభుత్వమే నిలిపివేయడంతో ప్రజలు ఇబ్బందిపడ్డారు.
భారత్‌బంద్ సందర్భంగా బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. అఖిలపక్ష పార్టీల ఆధ్వర్యంలో బస్టాండ్స్ దగ్గర నిరసన తెలిపారు. ఆందోళకారులు వాహనాలను ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. తిరుపతిలో బంద్ కొద్దిపాటి ఉద్రిక్తతకు దారి తీసింది. వామపక్షాలు, కార్మిక సంఘాల నాయకులు రైల్వేస్టేషన్‌లోకి వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. అమరావతిలో వర్షం పడుతున్నా సీపీఐ, సీపీఎం నాయకులు బంద్‌లో పాల్గొన్నారు.
తెలంగాణలోని పలు బస్సు డిపోల ముందు వామపక్షాలు ఆందోళనకు దిగాయి. హైదరాబాద్‌లో బంద్ పాక్షికంగా కొనసాగింది. ఉప్పల్, కూకట్‌పల్లి డిపోల ముందు పలువురు నాయకులు ఆందోళన చేపట్టారు. నల్గొండలో వామపక్షాలు ధర్నా చేపట్టాయి. ఏపీ, తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ఉదయం నుంచి వర్షం పడటంతో.. ఇటు వర్షం, అటు బంద్ ప్రభావం స్పష్టంగా కనిపించింది. ప్రజలు ఇంటికే పరిమితమయ్యారు.