#SaveAPfromYSRCP ..జగన్‌పై జనసేనాని ట్విటర్ వార్
posted on Sep 27, 2021 @ 10:24AM
జనసేనాని పట్టుకుంటే వదిలే రకం కాదు. బీజేపీ విషయంలో మాటతప్పి, మడమ తిప్పినా.. వైసీపీ మేటర్‌లో మాత్రం అసలే మాత్రం కాంప్రమైజ్ కావట్లేదు. అటు, వైసీపీ ప్రభుత్వమూ పవన్ కల్యాణ్‌ను టార్గెట్ చేయడంతో వారి మధ్య వైరం బాగా ముదిరింది. రిపబ్లిక్ ప్రీరిలీజ్ వేడుకలో పీకే చేసిన హాట్ హాట్ కామెంట్స్ మరింత కాక రేపాయి. సినిమా ఇండస్ట్రీ జోలికొస్తే కాలిపోతారంటూ ఖతర్నాక్ వార్నింగ్ ఇచ్చారు. సన్నాసులు, దద్దమ్మలంటూ దుమ్ము రేపారు. తనపై కోపం ఉంటే తన సినిమాలను ఆపేయండి కానీ, మిగతా వారిని ఇబ్బంది పెట్టొద్దంటూ చాలా చాలా స్ట్రాంగ్‌గా చెప్పారు. అయితే, పవన్ కామెంట్స్‌కు అదే రేంజ్‌లో కౌంటర్లు ఇచ్చారు ఏపీ మంత్రులు. తమకు పవన్‌కల్యాణ్ అయినా, సంపూర్ణేష్‌బాబు అయినా ఒక్కటేనంటూ పీకేను తక్కువ చేసి చూపించే ప్రయత్నం చేశారు. సినిమా టికెట్లను ఆన్‌లైన్ చేయాలనే ప్రపోజల్ ఇండస్ట్రీ నుంచే వచ్చిందని.. పవన్ నోరు జారితే బాగుండదంటూ హెచ్చరించారు. ఇలా, పవన్ కల్యాణ్ వర్సెస్ ప్రభుత్వం ఎపిసోడ్‌పై ఏపీలో రచ్చ రచ్చ జరుగుతోంది.
ఆ వార్‌ను కంటిన్యూ చేస్తూ.. ట్విటర్‌లో పెద్ద ఎత్తున క్యాంపెయిన్ స్టార్ట్ చేశారు పవన్ కల్యాణ్. సేవ్ ఏపీ ఫ్రం వైసీపీ అంటూ.. హ్యాష్‌ట్యాగ్‌తో ట్రెండింగ్ చేస్తున్నారు. ప్రజల మీద పన్నులు రుద్ది, మద్యం ఆదాయం తాకట్టుతో అప్పులు చేస్తే అది సుపరిపాలన కాదు, సంక్షేమం అస్సలే కాదన్నారు. నేటి ‘నవ రత్నాలు’ భావితరాలకు ‘నవ కష్టాలు’ అంటూ ప్రభుత్వం సంక్షేమ పథకాల పేరుతో చేస్తున్న మోసాన్ని ట్విటర్ వేదికగా చీల్చి చెండాడారు జనసేనాని పవన్ కల్యాణ్.
పనిలో పనిగా.. ఇప్పటి వరకూ వైసీపీ చేసిన వాగ్దానాలు.. ప్రస్తుతం వాటి అమలు పరిస్థితిని చార్ట్ రూపంలో తేటతెల్లం చేశారు. అధికార పార్టీ హామీలైతే ఘనంగా ఉన్నాయి కానీ, వాటి అమలును మాత్రం అటకెక్కించేశారు అనే చేదు నిజం ప్రజలందరికీ తెలిసేలా ఆసక్తికర చార్ట్‌తో ట్వీట్ చేశారు పవన్ కల్యాణ్. ఆ పోస్ట్‌కు కూడా సేవ్ ఏపీ ఫ్రం వైసీపీ.. అంటూ హాష్‌ట్యాగ్ యాడ్ చేసి ట్రెండింగ్ చేస్తున్నారు జనసైనికులు.