జగన్ జాబితాలో కొత్త మంత్రులు వీళ్లే..! జిల్లాల వారీగా పేర్లు ఇవే..!
posted on Sep 27, 2021 @ 11:35AM
ఏపీ కేబినెట్ మొత్తం మారి పోతోంది. మంత్రివర్గాన్ని పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేయనున్నారు సీఎం జగన్. సీనియర్లు, జూనియర్లు అనే తేడా లేకుండా అందరినీ కేబినెట్ నుంచి తొలగించనున్నారు. పలువురు మంత్రుల పనితీరు ఏమాత్రం బాగా లేకపోవడం, మిగతా వారికీ అవకాశం ఇవ్వాలనే ఉద్దేశ్యం, రెండున్నరేళ్ల తర్వాత మంత్రిమండలిని మారుస్తాననే ప్రకటన.. ఇలా అన్నీ కలిసి కేబినెట్ మార్పుకు జగన్ కసరత్తు పూర్తి చేశారని తెలుస్తోంది. జగన్ ఆదేశాల మేరకే మంత్రి బాలినేని ఇప్పటికే ఆ మేరకు లీకులు ఇచ్చారట. మరోవైపు జిల్లాల వారీగా జాబితా సిద్ధమై పోయిందని చెబుతున్నారు. కేబినెట్ కూర్పుతో 2024 ఎలక్షన్ టీమ్‌ను రెడీ చేస్తున్నారు. ఇంటలిజెన్స్ వర్గాల నుంచి సమాచారం సేకరించిన సీఎం.. కేబినెట్ కూర్పుపై క్లారిటీకి వచ్చేశారని అంటున్నారు. అన్నీ కుదిరితే.. ఈ దసరాకే కొత్త మంత్రిమండలి కొలువుదీరడం ఖాయమంటున్నారు.
ఎప్పటిలానే ప్రాంతీయ, సామాజిక సమీకరణాలే కీలకం కానున్నాయి. జిల్లాల వారీగా ఆశావహుల పేర్లపై లీకులు వస్తున్నాయి. శ్రీకాకుళం జిల్లా నుంచి ఒక్క లాస్ట్ ఛాన్స్ కోసం ఎదురుచూస్తున్న ప్రస్తుత స్పీకర్ తమ్మినేని సీతారాంకు ఈసారి మంత్రి పదవి ఖాయమంటున్నారు. ధర్మాన క్రిష్ణదాస్ స్థానంలో ఆయన సోదరుడు ధర్మాన ప్రసాదరావుకు అవకాశం దక్కుతుందని భావిస్తున్నారు.
విజయనగరం జిల్లాలో కొత్తగా కోలగట్ల వీరభద్రస్వామి, పీడిక రాజన్నదొర రేసులో ఉన్నారు. ఎస్టీ మహిళకు అవకాశం ఇవ్వాలని భావిస్తే రాజన్న దొరకు ఛాన్స్ కష్టమే అంటున్నారు.
విశాఖ జిల్లాలో కాంపిటీషన్ టఫ్‌గా ఉంది. గుడివాడ అమర్‌నాథ్, కరణం ధర్మశ్రీ, పెట్ల ఉమా శంకరగణేష్ మంత్రి పదవి ఆశిస్తున్నారు. ముత్యాల నాయుడు పేరు కూడా వినిపిస్తోంది. వీరిలో అమర్‌నాథ్‌కు ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయంటున్నారు. ఇక, గిరిజన కోటాలో ఫాల్గుణ, కె.భాగ్యలక్ష్మి కూడా మంత్రి పదవిని కోరుకుంటున్నారు.
తూర్పు గోదావరి జిల్లాలో ఇప్పుడున్న ముగ్గురు స్థానంలో కొత్తగా మరో ముగ్గురిని తీసుకుంటారని తెలుస్తోంది. యనమల సోదరుడిని రెండు సార్లు ఓడించటంతో పాటుగా తొలి నుంచి జగన్ విధేయుడిగా ఉన్న దాడిశెట్టి రాజా రేసులో ముందున్నారు. కన్నబాబు స్థానం ఆయనతో భర్తీ చేసే అవకాశం ఉంది. ముమ్మడివరం ఎమ్మెల్యే సతీష్‌తో పాటు గిరిజన కోటాలో నాగులాపల్లి ధనలక్ష్మి పోటీలో ఉన్నారు.
రాజకీయంగా పశ్చిమ గోదావరి జిల్లా కీలకం కావటంతో ఈ జిల్లా నుంచి ఎస్సీ-క్షత్రియ-కాపు వర్గానికి అవకాశం దక్కనుంది. క్షత్రియ కోటాలో ముదునూరి ప్రసాద రాజు, కాపు వర్గం నుంచి కొట్టు సత్యానారాయణ లేదా గ్రంధి శ్రీనివాస్ పేర్లు వినిపిస్తున్నాయి. ఎస్సీ వర్గం నుంచి తలారి లేదా ఓ ఎమ్మెల్సీకి అవకాశం దక్కే ఛాన్స్ ఉంది. పశ్చిమ గోదావరి జిల్లా నుంచి కమ్మ కోటాలో అబ్బయ్య చౌదరి పేరు కూడా వినిపిస్తున్నా అవకాశం తక్కువే అంటున్నారు.
ఇక, సీనియర్ల కోటాలో కృష్ణాజిల్లాలో కొలుసు పార్థసారధికి మంత్రి పదవి ఖాయమని తెలుస్తోంది. క్రిష్ణా జిల్లా నుంచి సామినేని ఉదయభాను, మల్లాది విష్ణు, జోగి రమేష్, మేకా వెంకట ప్రతాప అప్పారావులు మంత్రి పదవి రేసులో ఉన్నారు. వీరిలో ఇటీవల బాగా యాక్షన్ చేసిన జగన్ అభిమానం చూరగొన్న జోగి రమేశ్‌కు మినిస్టర్ పోస్ట్ పక్కా అని అంచనా వేస్తున్నారు.
కమ్మ వర్గానికి ప్రాధాన్యత ఇవ్వాలని భావిస్తే గుంటూరు జిల్లా నుంచి మర్రి రాజశేఖర్ మంత్రి పదవి దక్కవచ్చు. మంగళగిరి ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి ఈసారి మంత్రి పదవి ఆశిస్తున్నారు. డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, విడదల రజని, ముస్లిం మైనార్టీ నుండి మహ్మద్ ముస్తఫా.. ఇలా ఈ జిల్లా నుంచి చాలామందే రేసులో ఉన్నారు. ఇక, కాపు కోటాలో అంబటి రాంబాబుకు మంత్రిపదవి ఖాయమే అంటున్నారు.
ప్రకాశం జిల్లా నుంచి మహీధర్‌రెడ్డి, అన్నా రాంబాబుల పేర్లు వినిపిస్తున్నాయి.
నెల్లూరు జిల్లా నుంచి నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డికి కేబినెట్ బెర్త్ దక్కే ఛాన్సెస్ ఎక్కువే. ఆనం రామ నారాయణరెడ్డి, ఎస్‌సి కోటాలో కిలివేటి సంజీవయ్య రేసులో ఉన్నారు.
చిత్తూరు జిల్లా నుంచి చిరకాలంగా మంత్రి పదవి ఆశిస్తున్న రోజా పేరు ప్రముఖంగా వినిపిస్తున్నా.. పెద్దిరెడ్డిని కాదని రోజాను కేబినెట్‌లో చేర్చుకునే సాహసం జగన్ చేస్తారా? లేదా? అనేది ఆసక్తికరం. అయితే, గత కేబినెట్‌లోనే రోజాకు మంత్రి పదవి వస్తుందని ప్రచారం జరిగినా అది కుదరకపోవడంతో కొన్ని రోజులు అలకమూని అజ్ఞాతంలోకి వెళ్లిపోయింది రోజమ్మ. అప్పుడు నెక్ట్స్ టైమ్ తప్పకుండా మంత్రిని చేస్తానంటూ రోజాకు జగన్ హామీ ఇచ్చారని అన్నారు. ఆ హామీని ఇప్పుడు నెరవేర్చుకునే అవకాశం ఉందని అంటున్నారు. రోజాతో పాటు చెవిరెడ్డి భాస్కరరెడ్డి సైతం కేబినెట్ రేసులో ఉన్నారు.
కడప నుండి కొరుముట్ల శ్రీనివాసులు, శ్రీకాంత్ రెడ్డి, సి.రామచంద్రయ్యలు మంత్రి పదవిని ఆశిస్తున్నారు.
అనంతపురం జిల్లాలో అనంత వెంకట్రామిరెడ్డి, తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి ఉండగా... మహిళా కోటాలో ఉషశ్రీచరణ్, జనులగడ్డ పద్మావతి, ఎస్‌సి కోటాలో తిప్పేస్వామి పోటీ పడుతున్నారు.
కర్నూలు జిల్లా నుంచి శిల్పా చక్రపాణిరెడ్డికి కేబినెట్ పోస్ట్ ఖాయమని ప్రచారం జరుగుతోంది. ఆర్థిక మంత్రి బుగ్గనను సైతం తప్పిస్తుండటంతో రెడ్డి వర్గంతో పాటుగా బీసీ వర్గానికి ఈ జిల్లా నుంచి అవకాశం దక్కనుంది.
ఇలా, జిల్లాల వారీగా సామాజిక సమీకరణాల సమతూకంతో ఏర్చికూర్చి మంత్రిమండలి కూర్పు కోసం తీవ్ర కసరత్తు చేస్తున్నారు సీఎం జగన్. జిల్లాల వారీగా బలాబలాలు, వచ్చే ఎన్నికలు, ప్రతిపక్షాలను ఎదుర్కొనే సామర్థ్యం ఇలా అన్ని అంశాలను పరిగణలోకి తీసుకొని సీఎం జగన్ తన ఎన్నికల కేబినెట్‌ను రెడీ చేస్తున్నారు. మరి, ఈ కొత్త కేబినెట్ పార్టీలో అలకలు, అవమానాలకు దారి తీస్తుందా? ఎన్నికలకు ముందు అసంతృప్తులు తలెత్తితే ఏంటి పరిస్థితి? ఇప్పటికే జగన్ ప్రభుత్వంపై తీవ్ర ప్రజావ్యతిరేకత ఉండగా.. ఇక మంత్రి పదవి దక్కని బలమైన నేతలు జగన్ నిర్ణయంపై ఎర్రజెండా ఎగరేసే ప్రమాదం లేకపోలేదని అంటున్నారు. అందుకే, ఈ కేబినెట్ ప్రక్షాళణ సీఎం జగన్‌కు కత్తి మీద సామే...