Top News @ 8pm
posted on Sep 26, 2021 @ 8:05PM
1. సినీ ఇండస్ట్రీని ఏపీ ప్రభుత్వం ఏ విధంగా ఇబ్బందిపెట్టిందో పవన్ కల్యాణ్ చెప్పాలని మంత్రి పేర్ని నాని నిలదీశారు. కోడికత్తి కేసును ఎన్ఐఏ విచారిస్తోందని, వివరాలు అమిత్‌షాను అడిగి తెలుసుకోండని సూచించారు. రెండు చోట్లా ఓడిపోయినవాడు సన్నాసి కాదా? తాను సన్నాసి అయితే.. పవన్ సన్నాసిన్నర అని మండిపడ్డారు. ప్రభుత్వంపై పవన్ అవాకులు, చవాకులు పేలితే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు మంత్రి పేర్నినాని.
2. చిత్తూరు జిల్లా నిండ్ర ఎంపీపీ ఎన్నిక వివాదం వైసీపీలో మరింత ముదురుతోంది. మంత్రి పెద్దిరెడ్డిని కలిసిన ఎమ్మెల్యే రోజా.. చక్రపాణిరెడ్డి వర్గంపై ఫిర్యాదు చేశారు. చక్రపాణి రెడ్డితో సహా ఆయన వర్గానికి చెందిన ఎంపీటీసీలను, ఇతర నాయకులను సస్పెండ్ చేయాలని కోరారు.
3. ముఖ్యమంత్రి కేసీఆర్ కాళ్లు మొక్కైనా హుజూరాబాద్ నియోజకవర్గానికి ఐదు వేల డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు తీసుకు వస్తామని మంత్రి హరీష్‌రావు హామీ ఇచ్చారు. జమ్మికుంటలో కుమ్మరి కులస్థుల ఆశీర్వాద సభలో పాల్గొన్నారు. టీఆర్‌ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌ను గెలిపించుకుంటే నియోజకవర్గం అన్ని విధాలా అభివృద్ధి చెందుతుందన్నారు.
4. సీఎం జగన్ అక్రమాస్తుల కేసుపై సీబీఐ, ఈడీ కోర్టులో విచారణ జరిగింది. దాల్మియా కేసులో హాజరుకానందున ఐఏఎస్ శ్రీలక్ష్మికి ఇప్పటికే నాన్‌బెయిలబుల్ వారెంట్ జారీ కాగా.. తాజాగా పెన్నా కేసులో సీబీఐ కోర్టుకు జి.వెంకట్రామిరెడ్డి హాజరయ్యారు. జగన్, విజయసాయిరెడ్డి పిటిషన్లపై కౌంటర్లకు సీబీఐ, ఈడీ గడువు కోరింది.
5. జగన్ సర్కారుపై విశాఖ శారదాపీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి ఆగ్రహం వ్యక్తం చేశారు. బ్రాహ్మణ కార్పొరేషన్‌ను బీసీ సంక్షేమ శాఖలో కలపాలన్న ప్రభుత్వ నిర్ణయం సరైంది కాదని స్వరూపానందేంద్ర సరస్వతి భావిస్తున్నట్లు శారదాపీఠం ఓ ప్రకటనలో తెలిపింది. అటు, వైసీపీ ప్రభుత్వం బ్రాహ్మణులపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని రాష్ట్ర బ్రాహ్మణ కార్పొరేషన్ మాజీ చైర్మన్ వేమూరి ఆనందసూర్య మండిపడ్డారు. జీవో 103 ద్వారా బ్రాహ్మణులకు ద్రోహం చేయమటమే కాక బీసీలకు బ్రాహ్మణులకు మధ్య గొడవలు సృష్టించేలా వైసీపీ ప్రభుత్వం వ్యవహరిస్తోందన్నారు.
6. బీసీలకు రిజర్వేషన్ల ప్రక్రియ కొనసాగుతోందని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. బీసీల రిజర్వేషన్లపై నిర్ణయాధికారం రాష్ట్ర ప్రభుత్వాలదేనని స్పష్టం చేశారు. బీసీ కమిషన్‌కు చట్టబద్ధత కల్పించాలనే బీసీ సంఘాల డిమాండ్‌ను గౌరవించిన వ్యక్తి ప్రధాని మోదీ అని కొనియాడారు.
7. 50 శాతం రిజర్వేషన్లు మహిళల హక్కు అని సీజేఐ ఎన్వీ రమణ స్పష్టం చేశారు. మహిళలకు సంబంధించిన న్యాయపరమైన డిమాండ్లకు తన మద్దతు ఉంటుందని ఆయన ప్రకటించారు. ప్రస్తుతం న్యాయవ్యవస్థలో 30 శాతం కంటే తక్కువ మహిళా జడ్జిలున్నారని చెప్పారు.
8. వాయువ్య, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో గులాబ్ తుఫాన్ కొనసాగుతుంది. అర్ధరాత్రి కళింగపట్నం-గోపాలపూర్ మధ్య తీరం దాటే అవకాశం ఉంది. ఉత్తరాంధ్రలో పలుచోట్ల విస్తారంగా వర్షాలు పడే అవకాశం ఉందని వాతావారణ శాఖ అధికారులు వెల్లడించారు. శ్రీకాకుళం జిల్లాలో 75 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు.
9. శ్రీకాకుళం జిల్లా పలాస నియోజకవర్గం మంచినీళ్ళపేటకు చెందిన ఆరుగురు మత్స్యకారులు గల్లంతయ్యారు. తుఫాన్ తీవ్రతరం కావడంతో సముద్రంలో అలజడుల తాటికి బోటుపై నుంచి మత్స్యకారులు బోల్తాపడ్డారు. సముద్రంలో గల్లంతైన వారి కోసం అధికారులు గాలింపు చర్యలు ముమ్మరంగా చేస్తున్నారు.
10. ఏపీ సీఎం జగన్‌కు ప్రధాని మోదీ ఫోన్ చేశారు. ‘గులాబ్’ తుఫాన్ పరిస్థితులపై ప్రధాని మోదీ ఆరా తీశారు. కేంద్రం నుంచి కావాల్సిన సహకారం అందిస్తామని జగన్‌కు ప్రధాని హామీ ఇచ్చారు. ప్రజలంతా క్షేమంగా ఉండాలని మోదీ ఆకాంక్షించారు.