Top News @ 1pm
posted on Sep 26, 2021 @ 1:30PM
1. మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత చంద్రబాబు ఇంటి చుట్టూ చీకట్లు అలుముకున్నాయి. చంద్రబాబు ఇంటి సమీపంలో నాలుగు రోజులుగా ఒక్క స్ట్రీట్ లైటూ వెలగడం లేదు. భద్రత సిబ్బంది సైతం చీకట్లోనే విధులు నిర్వర్తిస్తున్నారు. జడ్ ప్లస్ భద్రత ఉన్న నాయకుడి ఇంటి దగ్గర పరిస్థితి ఇలా ఉండటం చర్చనీయాంశంగా మారింది.
2. పవన్ కళ్యాణ్ నటించినా, సంపూర్ణేష్ బాబు నటించినా కష్టం ఒకటే. పారదర్శకత కోసమే ఆన్‌లైన్ పోర్టల్. అందరికీ టికెట్ ధర ఒకేలా ఉండాలనేదే మా ఉద్దేశం.. అంటూ జనసేనాని వ్యాఖ్యలపై ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కౌంటర్ ఇవ్వడం కలకలం రేపుతోంది.
3. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మార్చాల్సింది మంత్రులను కాదని.. ముఖ్యమంత్రిని మార్చాలని ఏపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి అన్నారు. జగన్ పాలనలో మంత్రులు ఉత్సవ విగ్రహాలని, ఆరవ వేలుతో సమానమని విమర్శించారు. వారు మంత్రులుగా ఉన్నా ఒకటే.. ఊడినా ఒకటేనన్నారు. ప్రస్తుతం ఏపీలో సమస్య ముఖ్యమంత్రి జగనేనన్నారు తులసీరెడ్డి
4. తెలంగాణలో బీసీ బంధును అమలు చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ సీఎం కేసీఆర్‌కు లేఖ రాశారు. అర్హులైన ప్రతి బీసీ కుంటుంబానికి రూ. 10 లక్షలు ఆర్ధిక సహాయం అందించాలన్నారు. క్యాబినెట్‌లో ముగ్గురు కాదు.. 8మంది బీసీలకు స్థానం కల్పించాలని డిమాండ్ చేశారు.
5. ఏపీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై బీజేపీ నేత లంకా దినకర్ సంచలన కామెంట్స్ చేశారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 4 నెలల్లోనే ఏడాది బడ్జెట్ అంచనా అప్పులు దాదాపు 100 శాతం పూర్తి అయ్యాయన్నారు. 2020-21 ఆర్థిక సంవత్సరంకు బడ్జెట్ అంచనా ప్రకారం మొత్తం అప్పులు రూ. 37,029.79 కోట్లు అయితే, జూలై నాటికి ప్రభుత్వం 36,171.61 కోట్ల రూపాయలు అప్పులు చేసిందన్నారు.
6. మణికొండలో రాత్రి డ్రైనేజీ పైపు లైన్ల కోసం తవ్విన గుంతలో పడి ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి గల్లంతు కాగా అతని కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. నీటి ప్రవాహం ఎక్కువ ఉండటంతో నాలాలో కొట్టుకొనిపోయి ఉంటాడని అధికారులు భావిస్తున్నారు. మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యం కారణంగానే వ్యక్తి గల్లంతయ్యాడని స్థానికుల ఆరోపిస్తున్నారు.
7. నెల్లూరు జిల్లా వింజమూరు మండలం కిస్తీపురంలో అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం పట్టుబడ్డాయి. లారీలో రవాణా చేస్తున్న 8 టన్నుల రేషన్ బియ్యంను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అక్రమంగా రేషన్ బియ్యం తరలిస్తున్న నిందితులను పోలీసులు ఆరెస్టు చేశారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
8. ఖాదీ ఉత్పత్తులను కొని, స్థానిక వృత్తి పనివారికి అండగా నిలవాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. నదులను కాపాడుకోవాలని, పరిశుభ్రంగా ఉంటూ, కొవిడ్-19 వ్యాప్తి నిరోధక చర్యలు పాటించాలని కోరారు. 81వ మన్ కీ బాత్ రేడియో కార్యక్రమంలో ఆదివారం మోదీ మాట్లాడారు.
9. ఉత్తరాంధ్ర తీరం వైపు గులాబ్ తుఫాన్ దూసుకొస్తుంది. ఇది క్రమంగా బలపడి పశ్చిమ దిశగా కదులుతూ శ్రీకాకుళం కళింగపట్నం సమీపంలో సాయంత్రం తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. తీరం వెంబడి బలమైన గాలులు వీస్తాయని.. తుఫాన్ ప్రభావంతో ఉత్తరాంధ్రలో అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు పడుతాయని హెచ్చరించింది.
10. నాగార్జున సాగర్ ప్రాజెక్ట్‌కు వరద ప్రవాహం కొనసాగుతోంది. అధికారులు 2 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. అటు, సోమశిల ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది.