జగన్ సర్కారుకు బ్యాంకులు బిగ్‌షాక్.. ఓవర్ డ్రాఫ్టులకు చెక్.. ఇక డబ్బులెలా?
posted on Sep 26, 2021 @ 1:56PM
పైసా కనిపిస్తే చాలు ఊడ్చేస్తోంది జగన్‌రెడ్డి సర్కారు. ఓ వైపు అప్పుల మీద అప్పులు.. ఇంకోవైపు పీడీ అకౌంట్లతో నిధుల మళ్లింపు.. మరోవైపు ఓవర్ డ్రాఫ్టులతో గట్టెక్కే తిప్పలు.. ఇలా రాష్ట్రానికి దమ్మిడి ఆదాయం లేక, కేవలం కేంద్రం నిధులు, అప్పులతోనే పాలన నెట్టుకొస్తోంది ఏపీ ప్రభుత్వం. ఇక కేంద్రం వివిధ పథకాల కోసం కేటాయించే నిధులను దారి మళ్లించి.. తామే ఇస్తున్నట్టు గొప్పలు చెప్పుకుంటోంది. సొమ్ములేమో కేంద్రానివి.. సోకులేమో రాష్ట్రానివి అన్నట్టు ఉంది వ్యవహారం. ఎక్కడా కేంద్ర ప్రభుత్వానికి పేరు రాకుండా.. అంతా జగనన్నే చేస్తున్నారంటూ బిల్డప్ కొడుతున్న ఏపీ సర్కారుకు తాజాగా కేంద్రం చెక్ పెట్టింది. బ్యాంకుల తరఫున నరుక్కొచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం బ్యాంకుల నుంచి ఇష్టారీతిని సొమ్ములు డ్రా చేసుకోకుండా కొర్రీలు పెట్టింది. దీంతో.. కేంద్రం పీఠముడితో బ్యాంకులు వైసీపీ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పడేశాయి. దీంతో.. కుయ్యోమొర్రో అంటూ ఏపీ ప్రభుత్వం ఇప్పుడు ఏం చేయాలో తెలీక తలలు పట్టుకుంటోంది. ఇంతకీ ఏం జరిగిందంటే...
కేంద్ర ప్రాయోజిత పథకాల విషయంలో రాష్ట్రాలకు కేంద్రం కఠిన నిబంధనలు విధించడంతో, ఆ మొత్తాన్ని బ్యాంకుల నుంచి ఓవర్ డ్రాఫ్టు రూపంలో వినియోగించుకునేందుకు ఏపీ ప్రభుత్వం చేసిన ప్రయత్నం ఫలించలేదు. రాష్ట్ర ప్రభుత్వం అడిగిన రూ.6,500 కోట్ల ఓవర్‌డ్రాఫ్ట్ ఇవ్వడం సాధ్యం కాదని ఆ పథకాలకు సింగిల్ నోడల్ ఏజన్సీగా ఉన్న స్టేట్‌బ్యాంకు ఆఫ్ ఇండియా-ఎస్బీఐ తేల్చి చెప్పింది. ఈ మేరకు రాష్ట్ర ఆర్థికశాఖ ప్రత్యేక కార్యదర్శికి ఎస్‌బీఐ తాజాగా లేఖ రాసింది.
‘కేంద్ర ప్రాయోజిత పథకాల సింగిల్ నోడల్ ఖాతాలు మీ బ్యాంకులో తెరుస్తాం, ఈ పథకాలకు అవసరమైన మూలధన పెట్టుబడి రూ.6,500 కోట్లు ఓవర్ డ్రాఫ్ట్ రూపంలో కల్పించాలి. ఈ పథకాల అమలుకు ఏర్పాటుచేసిన అయిదు ఏజన్సీలకు ఆ నిధులు ఓడీగా వినియోగించుకునే అవకాశం ఇవ్వాలి. ఆ ఖాతాల్లో వినియోగించుకోగా మిగిలిన నిధులను సెక్యూరిటీగా భావిస్తూ ఈ మేరకు ఓవర్ డ్రాఫ్ట్ సౌకర్యం కల్పించాలి’ అంటూ రాష్ట్ర ఆర్థికశాఖ ప్రత్యేక కార్యదర్శి సెప్టెంబరు 2న ఎస్‌బీఐ ఉన్నతాధికారులకు లేఖ రాశారు. వారు ఆ లేఖను పరిశీలించి, అలా ఇవ్వడం సాధ్యం కాదని తేల్చారు. బ్యాంకు నిబంధనలు ఇందుకు అనుమతించబోవని తెలియజేశారు. రాష్ట్ర ప్రభుత్వం సొంతంగా ఏర్పాటు చేసిన కార్పొరేషన్లకు ఇలా ఓడీ సౌకర్యం కల్పించే అవకాశం లేదన్నారు.
కేంద్ర ప్రాయోజిత పథకాలకు కేంద్రం ఈ ఆర్థిక సంవత్సరం నుంచి నిబంధనలు మార్చింది. ఇన్నాళ్లూ కేంద్ర ప్రాయోజిత పథకాల నిధులను కొన్ని రాష్ట్రాలు తమ ఇతర అవసరాలకు వినియోగించుకోవడంతో ఈ ఏడాది నుంచి అలాంటి వాటికి చెక్ పెట్టింది. కేంద్ర ప్రాయోజిత పథకాల నిధులూ పీడీ ఖాతాలకు మళ్లించకూడదని నిబంధన విధించింది.
కేంద్రప్రభుత్వం కేంద్ర ప్రాయోజిత పథకాలకు తన వాటా నిధులను రాష్ట్ర ప్రభుత్వాలకు విడుదల చేస్తుంది. కేంద్రం తన వాటా విడుదల చేసిన 40 రోజుల్లోగా రాష్ట్రం తన వాటా నిధులను ఆ ఖాతాల్లో వేయాలి. ఒక పథకం నిధులన్నీ ఒకే బ్యాంకులో ఉండాలని, వాటి వినియోగం, ఖర్చుపై మ్యాపింగ్ చేయాలని కేంద్రం నిర్దేశించింది. నిర్దిష్ట సమయంలో కేంద్ర, రాష్ట్ర వాటాల నిధులు కలిపి ఖర్చుచేస్తేనే తదుపరి విడత నిధులు విడుదలయ్యేలా విధానాలు మార్చేసింది. రాష్ట్ర వాటా నిధులు భరించేందుకు ఇప్పుడు ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గాలు చూసే క్రమంలోనే రూ.6,500 కోట్ల ఓడీ సౌకర్యం కావాలని ఎస్‌బీఐకి లేఖ రాసింది. అందుకు ఎస్బీఐ తిరష్కరించడంతో ఇప్పుడు ఎలా ముందుకు వెళ్లాలనే విషయంలో ఏపీ ఆర్థిక శాఖ అధికారులు ఆందోళన చెందుతున్నారు. కేంద్ర నిధులను వాడుకోవాలంటే.. రాష్ట్ర ప్రభుత్వం తన వాటా సొమ్మును వేయడం తప్పనిసరి చేయడంతో.. కనీసం ఆ డబ్బులు కూడా లేకపోవడం ఏపీ ఆర్థిక దుస్థితికి నిదర్శనం. తన వంతు వాటా కోసం ఎస్బీఐని ఓవర్ డ్రాఫ్టు అడగడం.. అందుకు ఆ బ్యాంక్ నో చెప్పడంతో రాష్ట్ర ప్రభుత్వం సందిగ్థంలో పడింది. ఈ కష్టం నుంచి గట్టెక్కేందుకు మరో మార్గం చూసుకోవాలిక...