కాంగ్రెస్ వర్కింగ్ స్టైల్ మారిందా? పంజాబ్, తెలంగాణలో అదే జరుగుతోందా?
posted on Sep 26, 2021 @ 2:20PM
పంజాబ్‌లో అసెంబ్లీ ఎన్నికలకు నాలుగు నెలల ముందు కాంగ్రెస్ పార్టీ తీసుకున్న ‘ముఖ్యమంత్రి మార్పు’ నిర్ణయం, ఒక విధంగా ఎంతో సాహసోపేతమైన నిర్ణయం. నిజమే, ఒకప్పుడు ఇందిరాగాంధీ, ఆ తర్వాత రాజీవ్ గాంధీ, ఇలాంటి సాహసోపేతమైన నిర్ణయాలను తీసుకున్న సందర్భాలు ఉన్నాయి. అలాగే, కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏ అధికారంలో ఉన్న రోజులల్లో సోనియా గాంధీ కూడా అలాంటి నిర్ణయాలు కొన్ని తీసుకున్నారు. అయితే, ఇందిరా, రాజీవ్ నాటి పరిస్థితికి నేటి పరిస్థితికి పొంతన లేదు. పోలిక కుదరదు. అప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఎదురు లేదు. కేంద్రంలోనే కాదు మెజారిటీ రాష్ట్రాలలోనూ అధికారంలో ఉంది. కానీ ఇప్పుడు కేంద్రంలో అధికారం కాదు, కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేదు. దేశం మొత్తంలో మూడంటే మూడు రాష్ట్రాలలో మాత్రమే కాంగ్రెస్ పార్టీ అధికారంలో వుంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఇందిరా, రాజీవ్’ల కాలం కాంగ్రెస్ పార్టీకి స్వర్ణ యుగం.. ఇది... ఏ యుగమో వేరే చెప్పనక్కరలేదు.
అలాగే, ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ హయంలో ఎదురు దెబ్బలు తగిలినా, సంక్షోభాలు ఎదురైనా, నాయకత్వ సంక్షోభం అనేది ఏ నాడు లేదు. అత్యవసర పరిస్థితి అనంతరం 1977లో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో స్వయంగా ఇందిరా గాంధీ ఓడిపోయారు. సంజయ్ గాంధీ ఓడి పోయారు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన జనతా ప్రభుత్వం కక్షకట్టి కేసులు పెట్టి, ఇందిరా గాంధీని జైలుకు పంపింది, ముప్పతిప్పలు పెట్టింది. సొంత పార్టీలో చీలిక వచ్చింది. బ్రహ్మానంద రెడ్డి ఇందిరా గాంధీ నాయకత్వాన్ని ఎదిరించారు. రెడ్డి కాంగ్రెస్ పేరిట సొంత పార్టీ పెట్టారు. ఇలా ఇందిరా గాంధీపై ముప్పేట దాడి జరిగింది. అయినా ఆమె వెనక్కి తగ్గలేదు. కాడి వదిలేసి పారిపోలేదు. పోరాడారు. పదకొండు నెలలు తిరక్కుండానే మళ్ళీ అధికారంలోకి వచ్చారు. ఇక ఇప్పుడు పరిస్థితి ఏమిటో వేరే చెప్ప నక్కర లేదు. 2019 ఓటమి తర్వాత రాహుల్ గాంధీ పార్టీ అధ్యక్ష పదవి నుంచి తప్పుకున్నారు. అప్పటి నుంచి ఇప్పటివరకు పార్టీకి అధ్యక్షడు లేరు. సోనియా గాంధీ తాత్కాలిక అధ్యక్షురాలిగా కొనసాగుతున్నారు. రాహుల్ గాంధీ డీఫ్యాక్టో’ అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు. ఇలాంటి పరిస్థితిలో సుదీర్ఘ రాజకీయ అనుభవం, తొమ్మిదేళ్ళకు పైగా ముఖ్యమంత్రిగా పనిచేసిన అనుభవం ఉన్న పంజాబ్’లో ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్’ను గడ్డిపోచను తీసినట్లు తీసిపారేయడం నిజంగా, రాహుల్ గాంధీ, ప్రియాంక తీసుకున్న సాహసోపేత నిర్ణయం. అందులో సందేహం లేదు.
అదలా ఉంటే, పంజాబ్ నిర్ణయం వెనక వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ ఉన్నారో మరొకరు ఉన్నారో, కానీ, భవిష్యత్తు కాంగ్రెస్ పార్టీ సాగించే నడకకు, నడతకు ఇదొక స్పష్టమైన సంకేతంగా నిలుస్తుంది. కాంగ్రెస్ పార్టీ భవిష్యత్ ముఖ చిత్రాన్ని పంజాబ్ పరిణామాలు ఆవిష్కరించాయి. మరోవంక కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాజస్థాన్, చత్తీస్‌గఢ్’లలో కూడా, ‘వృద్ధులకు ఉద్వాసన’ ఫార్ములానే అనుసరించే సంకేతాలు స్పష్టమవుతున్నాయి. పార్టీ ఎమ్మెల్యేలు అధిష్ఠానానికి విధేయులు తప్ప ముఖ్యమంత్రి కాదని పంజాబ్ పరిణామాలు స్పష్టం చేశాయి. కెప్టెన్ స్థానంలో నూతన ముఖ్యమంత్రిని ఎన్నికునేందుకు ఏర్పాటు చేసిన కాంగ్రెస్ శాసన సభ పక్ష సమావేశానికి, కెప్టెన్ సహా ఇద్దరు తప్ప, మిగిలిన ఎమ్మెల్యేలు అందరూ హాజరయ్యారు. రాహుల్ గాంధీ ఎంపిక చేసిన చరణ్‌జిత్ సింగ్ చన్నిని ఏకగ్రీవంగా శాసన సభా పక్ష నేతగా ఎన్నుకున్నారు. చన్నీ మీద ‘మీ టూ’ వంటి కేసులున్నా, రాహుల్ సెలెక్ట్ చేసారు కాబట్టి మేము ఎలెక్ట్ చేసామన్న విధంగా, విధేయంగా ఎమ్మెల్యేలు ఆయన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అంతవరకేందుకు, తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మీద ఒంటి కాలుపై లేచిన, ఎమ్మెల్యే జగ్గారెడ్డి 24 గంటలు తిరగకుండానే బేషరుతుగా క్షమాపణ చెప్పారు. సోనియా, రాహుల్ చెప్పిందే వేదం అని చెంపలు వేసుకున్నారు. సో.. ఈ రెండు ఉదంతాలను గమించినా, రాజస్థాన్’లో మొదలైన నాయకత్వ మార్పు ప్రక్రియను గమనించినా .. కాంగ్రెస్ పార్టీలో ఇక రాహుల్ అండ్ కో దే హవా .. రాహుల్ చెప్పిందే వేదం ప్రియాంక గీసిందే గీత.