TOP NEWS @ 1pm
posted on Sep 27, 2021 @ 12:59PM
1. తుపాను కారణంగా మరణించిన వారి కుటుంబాలకు రూ.5 లక్షల తక్షణ పరిహారం ప్రకటించారు సీఎం జగన్. గులాబ్ తుఫాన్ ప్రభావిత ప్రాంతాలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఇళ్లలోకి నీరు చేరిన కుటుంబాలకు రూ.వెయ్యి చొప్పున, సహాయక శిబిరాల నుంచి బాధితులు వెళ్లేటప్పుడు కుటుంబానికి రూ.వెయ్యి ఆర్థిక సాయం చేయాలని ఆదేశించారు. పంట నష్టం అంచనా వేసి రైతులను ఆదుకోవాలని అధికారులకు సీఎం జగన్ సూచించారు.
2. దేశంలో నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయని, పెట్రోల్, డీజిల్ ధరలు సామాన్యుల నడ్డి విరుస్తున్నాయని సీఎల్సీ నేత భట్టి విక్రమార్క విమర్శించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా గాంధీభవన్ నుంచి అసెంబ్లీకి గుర్రపు బండ్ల మీద వచ్చి పలువురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నిరసన తెలిపారు.
3. సేవ్ ఏపీ ఫ్రం వైసీపీ అంటూ ట్విటర్ వేదికగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ జగన్ సర్కారుపై పోరుబాట పట్టారు. ప్రజల మీద పనులు రుద్ది, మద్యం ఆదాయం తాకట్టుతో అప్పులు చేస్తే అది సుపరిపాలన కాదు, సంక్షేమం అస్సలే కాదన్నారు. నేటి ‘నవ రత్నాలు’ భావితరాలకు ‘నవ కష్టాలు’ అని పవన్ ట్వీట్ చేశారు.
4. రాజధాని దళిత రైతు పులి చిన్నా హైకోర్టును ఆశ్రయించారు. బాధితుడైన తనపైనే పోలీసులు అక్రమ కేసులు బనాయించారంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దళిత రైతు పులి చిన్నాపై ఎంపీ నదిగం సురేష్ అనుచరులు దాడికి పాల్పడ్డారు. పోలీసులకు ఫిర్యాదు చేయగా.. బాధితుడి ఫిర్యాదు పరిగణలోకి తీసుకోకుండా తనపైనే అక్రమ కేసులు బనాయించారని పిటిషన్‌లో పులి చిన్నా ఆరోపించారు.
5. ఏపీ, తెలంగాణలో భారత్‌బంద్ విజయవంతమైంది. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా సంయుక్త కిసాన్ మోర్చా పిలుపుతో దేశవ్యాప్తంగా భారత్ బంద్ కొనసాగింది. వివిధ పార్టీల నాయకులు బంద్‌ను పర్యవేక్షించారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతికేరంగా నినాదాల చేస్తూ ర్యాలీలు నిర్వహించాయి.
6. దిశ కమిషన్ విచారణకు ఐపీఎస్ అధికారి సజ్జనార్ హాజరు కానున్నారు. ఈ మేరకు త్రిసభ్య కమిటీ సమన్లు జారీ చేసింది. కమిటీ మంగళవారం లేదా బుధవారం సజ్జనార్‌ను విచారించే అవకాశం ఉంది. సజ్జనార్‌ను విచారించిన తర్వాత త్రిసభ్య కమిటీ మరోసారి సిట్ చీఫ్ మహేశ్ భగవత్‌ను విచారించనుంది.
7. డ్రైనేజీలో పడి గల్లంతైన మణికొండ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ కోసం సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. నాలా వెంబడి డ్రోన్లతో గాలిస్తున్నారు. 60 మందితో డీఆర్ఎన్‌డీఆర్ఎఫ్ సిబ్బంది గాలింపు చేస్తున్నారు. 40 గంటలు దాటినా సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఆచూకీ లభించపోవడం కలకలం రేపుతోంది.
8. కడప జిల్లా ప్రొద్దుటూరు పరిధిలో ఎర్రచందనం అక్రమ రవాణా చేస్తున్న ముగ్గురు స్మగ్లర్లను పోలీసులు అరెస్ట్ చేశారు. స్మగ్లర్ల నుంచి 10 ఎర్రచందనం దుంగలు, 6 వేట కొడవళ్లు, మూడు కార్లను స్వాధీనం చేసుకున్నారు. వీరిపై గతంలో కడప, చిత్తూరు, కర్నూలు జిల్లాల్లో పలు ఎర్రచందనం అక్రమ రవాణా కేసుల నమోదు అయ్యాయి.
9. గోవాలో అరెస్టైన డ్రగ్స్ వ్యాపారి హైదరాబాద్‌కు చెందిన సిద్ధిఖ్‌గా గుర్తించారు. ముంబై, బెంగళూరు, హైదరాబాద్‌లలో ఎల్ఎస్‌డీ డ్రగ్స్‌ను సిద్దిఖ్ సప్లై చేస్తున్నాడు. హైదరాబాద్, గోవాలలో పలు ఈవెంట్లకు సిద్దిఖ్ డ్రగ్స్ సరఫరా చేసినట్టు దర్యాప్తులో తేలింది. ఆ డ్రగ్స్‌ను హైదరాబాద్‌లోనే తయారు చేయడం పోలీసులను షాక్‌కు గురి చేసింది.
10. కేంద్ర ప్రభుత్వ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్‌ను ప్రధాని మోదీ వీడియా కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. దేశవ్యాప్తంగా ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు ‘ప్రధానమంత్రి డిజిటల్ హెల్త్ మిషన్’ పేరుతో ఈ కార్యక్రమం చేపట్టనున్నారు. ప్రస్తుతానికి ప్రయోగాత్మకంగా ఆరు కేంద్రపాలిత ప్రాంతాల్లో మాత్రమే ఈ ప్రోగ్రామ్‌ను అమలు చేయనున్నారు.