గుర్రపు బండెక్కి వస్తనప్పా.. అసెంబ్లీకి చల్ చలోరే చల్..
posted on Sep 27, 2021 @ 1:18PM
డుగ్గు డుగ్గు మంటూ బుల్లెట్ బండెక్కి వద్దామనుకున్నారు. కానీ, పెట్రోల్‌పై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భారీగా పన్నులు బాదేసి ధరలు పెంచేయడంతో స్ట్రాటజీ మార్చేశారు. బుల్లెట్ బండికి బదులు గుర్రపు బండెక్కి అసెంబ్లీకి వచ్చి నిరసన తెలిపారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గుర్రపు బండ్లపై అసెంబ్లీకి వచ్చి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలపై విరుచుకుపడటం ఆసక్తికరంగా మారింది. పలువురు కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు వినూత్నంగా తెలిపిన నిరసన సంచలనంగా నిలిచింది.
కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కార్లు వదిలేసి.. తెలంగాణ అసెంబ్లీకి గుర్రపుబండ్లపై వచ్చారు. భట్టి విక్రమార్క, శ్రీధర్‌బాబు, సీతక్క, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి గుర్రపుబండ్లపై రావడంతో వారిని గేటు దగ్గరే పోలీసులు అడ్డుకున్నారు. గుర్రపుబండ్లను అనుమతించాలని కాంగ్రెస్ సభ్యులు ఆందోళనకు దిగారు. పోలీసులు అనుమతికి నిరాకరించడంతో వారు అసెంబ్లీ గేటు దగ్గరే బైఠాయించి నిరసన తెలిపారు. దీంతో పోలీసులు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను అక్కడి నుంచి తరలించారు.
‘‘దేశంలో నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయి. పెట్రోల్ ధరలు పెంచి సామాన్యుల నడ్డి విరుస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలతో ప్రజలపై భారం పడుతోంది’’ అంటూ సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మండిపడ్డారు.
కేంద్రం తీసుకువచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తుంటే.. టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రధాని మోదీతో లోపాయకారి ఒప్పందాలు చేసుకుందని ఎమ్మెల్యే సీతక్క విమర్శించారు. టీఆర్ఎస్ ప్రభుత్వానికి చిత్తశుద్ది ఉంటే అసెంబ్లీలో కేంద్రం తెచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా తీర్మానం ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటుపరం చేస్తున్నాయని మండిపడ్డారు. వ్యవసాయ రంగాన్ని ప్రైవేట్ వ్యక్తుల చేతిలో పెట్టే కుట్ర కేంద్రం చేస్తుంటే.. దాన్ని సీఎం కేసీఆర్ సమర్ధిస్తున్నారని సీతక్క విమర్శించారు.