కేబినెట్ మొత్తం క్లీన్‌స్వీప్.. మంత్రులు ఉన్నా ఒకటే, ఊడినా ఒకటేనా?
posted on Sep 27, 2021 @ 9:56AM
ఏపీ సీఎం జగన్మోహన్‌రెడ్డి మంత్రివర్గ ప్రక్షాళన కసరత్తుకు శ్రీకారం చుట్టారు. ప్రస్తుత మంత్రులలో కొద్ది మంది మినహా మిగిలిన అందరికీ ఉద్వాసన తధ్యమని చాలాకాలంగా పార్టీ వర్గాలలో చర్చ జరుగుతోంది. అలాగే, తొలి మంత్రివర్గ ప్రమాణ స్వీకార సమయంలోనే మంత్రివర్గాన్ని రెండున్నరేళ్ల తరువాత మారుస్తానని చాలా స్పష్టంగా చెప్పారు. ఇప్పుడు ఆ గడువు కూడా సమీపిస్తోంది. జగన్‌రెడ్డి 2019 మే 30న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ లెక్కన నవంబర్ 30, 2021తో రెండున్నరేళ్ళ గడువు ముగుస్తుంది. ఈ నేపధ్యంలో ఫస్ట్ బ్యాచ్‌లో బెర్త్ మిస్సయిన సీనియర్లతో పాటుగా ఇతరత్రా ఈక్వేషన్స్’లో బెర్త్ ఆశిస్తున్న ఎమ్మెల్యేలు ఈసారి తమకు తప్పక అవకాశం దక్కుతుందని ఆశగా ఉన్నారు. మరోవంక ప్రస్తుత మంత్రుల్లో ఎవరు ఉంటారో, ఎవరు బయటకు వెళతారో అనే ఆందోళన నెలకొంది. తొలగించిన మంత్రులను పార్టీ నిర్మాణం కోసం వినియోగించుకుంటామని జగన్ గతంలోనే చెప్పారు.
అదలా ఉంటే, మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఒక్కసారిగా, ‘మంత్రివర్గంలో అందరినీ మార్చేస్తారు. వందశాతం మార్పు ఖాయం’ అంతా కొత్త వారినే తీసుకుంటారు అంటూ బాంబు పేల్చారు. మిగిలేది ముఖ్యమంత్రి ఒక్కరే, మిగిలిన అందరికీ ఉద్వాసన తథ్యం అంటున్నారు. స్వయంగా ముఖ్యమంత్రే తనకు ఈ విషయం చెప్పారని బాలినేని ముక్తాయింపు నివ్వడం మరింత సంచలనంగా మారింది. దీంతో ఇంత వరకూ తమ కుర్చీకి డోకా లేదని ధీమాగా ఉన్న సీనియర్లు, ముఖ్యమంత్రి దగ్గర మంచి మార్కులు కొట్టేశామని కొందరు జూనియర్లు కూడా, ఇప్పడు మంత్రి బాలినేని స్టేట్మెంట్’తో కంగారు పడుతున్నట్లు సమాచారం. నిజానికి, కొద్ది రోజుల క్రితం వరకు కూడా కనీసం ఒక అరడజను మంది వరకు ‘సేవ్’ అవుతారని అనుకున్నారు. కానీ, బహుశా గుజరాత్’లో బీజేపీ అధినాయకత్వం ముఖ్యమంత్రితో సహా మొత్తం మంత్రివర్గానికి ఒకేసారి ఉద్వాసన పలికిన నేపథ్యంలో జగన్‌రెడ్డి కూడా మనసు మర్చుకున్నారో ఏమో, అనే మాట పార్టీలో వినవస్తోంది. మరోవంక మంత్రి బాలినేని మొత్తానికి మొత్తం మంత్రులు అందరికీ ఒకేసారి ఉద్వాసన పలికే నిర్ణయం నూటికి నూరు శాతం చక్కని, సముచిత నిర్ణయమని ప్రకటించారు.
అయితే, మంత్రులను మార్చి ప్రయోజనం లేదని, ముఖ్యంత్రిని మారిస్తేనే కానీ, రాష్ట్రానికి మేలు జరగదని విపక్షాలు ఎద్దేవా చేస్తున్నాయి. సర్వ అనర్ధాలకు మూలమైన ముఖ్యమంత్రిని వదిలేసి మంత్రులను తొలిగించినా, తొలిగించక పోయినా ఒకటేనని విపక్షాలు అంటున్నాయి. “ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మార్చాల్సింది మంత్రులను కాదు, ముఖ్యమంత్రిని మార్చాలి” అని కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి అన్నారు. జగన్ పాలనలో మంత్రులు ఉత్సవ విగ్రహాలని, ఆరవ వేలుతో సమానమని విమర్శించారు. వారు మంత్రులుగా ఉన్నా ఒకటే.. ఊడినా ఒకటేనన్నారు. ప్రస్తుతం ఏపీలో సమస్య ముఖ్యమంత్రి జగనేనన్నారు. రాష్ట్రం అప్పులు, అరాచకం, అవినీతి, అసమర్ధత, ఆటవిక ఆంధ్రప్రదేశ్‌గా మారిందని, వీటన్నిటికీ మూలకారకుడు ముఖ్యమంత్రి అని తులసీరెడ్డి అన్నారు. జగన్‌ని మారుస్తే తప్ప ఆంధ్రప్రదేశ్ సమస్యలు పరిష్కారం కావని ఆయన కుండబద్దలు కొట్టారు.
ముఖ్యమంత్రిగా జగన్ రెడ్డిని మార్చకుండా మంత్రులను మార్చడం అంటే... చేతగాని వైద్యడు పంటినొప్పికి తుంటి మీద తన్నినట్లేనని తులసిరెడ్డి తమదైన స్టైల్లో వ్యగ్య బాణాలు వేశారు. నిజానికి, ఏపీలో మంత్రులు పేరుకు మంత్రులే కానీ, వారికి ఉన్న అధికారాలు అంతంత మాత్రమే. సో రాష్ట్రం ఎదుర్కొంటున్న సమస్యలకు ముఖ్యమంత్రి మార్పు ఒక్కటే పరిష్కారం అనేది సరైన ఆలోచనే అవుతుందని విశ్లేషకులు సైతం అంటున్నారు.