బెదిరించారా.. బండ బూతులు తిట్టారా? సజ్జల ఫోన్ తో జేఏసీ నేతలకు చెమటలు అందుకేనా?
posted on Oct 10, 2021 @ 11:17AM
ఏపీ ఉద్యోగ సంఘాల నేతలను ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి బెదిరించారనే ఆరోపణలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. ఏపీ జేఏసీ, ఏపీ జేఏసీ అమరావతి సంఘాలు ఉమ్మడి ప్రెస్ మీట్ నిర్వహిస్తుండగా.. ఉద్యోగ సంఘాల నేతలకు సజ్జల నుంచి ఫోన్ వచ్చిందని.. ఆ వెంటనే ఆ నేతలు గజగజ వణికిపోయారని, ముఖాలకు చెమటలు పట్టాయని, ప్రెస్ మీట్ ను అర్ధాంతరంగా ముగించారని తెలుస్తోంది. మీడియా సమావేశాన్ని కవర్ చేసిన జర్నలిస్టులు కూడా ఇదే చెబుతున్నారు. ఇదే ఇప్పుడు రచ్చగా మారింది. సజ్జల ఫోన్ రాగానే ఉద్యోగ సంఘాల నేతలకు ఎందుకు చెమటలు పట్టాయి? మీడియా సమావేశాన్ని ఎందుకు ముగించారు? సజ్జల బెదిరించడం వల్లే వాళ్లు వణికిపోయారా? అన్న చర్చ సాగుతోంది.
బండి శ్రీనివాస్ అధ్యక్షుడిగా ఉన్న ఏపీజేఏసీ, బొప్పరాజు వెంకటేశ్వర్లు అధ్యక్షుడిగా ఉన్న ఏపీజేఏసీ అమరావతి సంఘాలు నాలుగు రోజుల క్రితం ఉమ్మడిగా మీడియా సమావేశం ఏర్పాటు చేశాయి. ఇకపై రెండు సంఘాలు కలిసికట్టుగానే పనిచేస్తాయని, ప్రభుత్వంపై మరింత ఒత్తిడి పెంచేస్తామన్న విషయాన్ని చెప్పేందుకే ఈ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లుగా సమాచారం. సరైన సమయానికి వేతనాలు ఇవ్వలేని జగన్ సర్కారుపై నిరసన గళం వినిపించేందుకు మీడియా ముందుకు వచ్చినట్లు చెబుతున్నారు. అయితే ఈ సమాచారం సజ్జలకు ఎలా తెలిసిందో గానీ.. బండి, బొప్పరాజుల్లో ఒకరికి ఫోన్ చేశారట. దాంతో వారిద్దరూ మాట మార్చేసి అప్పటికి మీడియా సమావేశం ముగిసినట్టుగా చెప్పుకుని వెళ్లిపోయారట.
సజ్జల బెదిరింపుల వల్లే ఉద్యోగ సంఘాల నేతలు వెనక్కు తగ్గారా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కంట్రోల్ లో ఉండమని సజ్జల ఫోన్ లో బెదిరించడం వల్లే ఉద్యోగాల సంఘాలు నేతలు భయపడి పోయారని అంటున్నారు. ఫోన్ రాగానే చెమటలు వచ్చాయంటే దారుణంగా తిట్టి ఉంటారనే టాక్ కూడా వస్తోంది. సజ్జల ఫోన్ కాల్ అంశం వివాదం కావడంతో శనివారం మళ్లీ మీడియా ముందుకు వచ్చారు ఉద్యోగ సంఘాల నేతలు. రెండు JAC లు కలిసి పోయాయని చెప్పడానికే మూడు రోజుల క్రితం ప్రెస్ మీట్ పెట్టామని చెప్పారు. తాము ప్రెస్ మీట్ లో ఉండగా సజ్జల ఫోన్ చేసిన మాట వాస్తవమే అన్నారు బండి శ్రీనివాస్. అయితే కంట్రోల్ లో ఉండమని చెప్పడం అవాస్తవమన్నారు. తమకు శుభాకాంక్షలు తెలియ జేయడానికే సజ్జల ఫోన్ చేశారని కవరింగ్ ఇచ్చారు.
అంతేకాదు ప్రభుత్వానికి వ్యతిరేకం గా మేము ప్రెస్ మీట్ పెట్టలేదు అని సజ్జలకు చెప్పాము.. ఫ్యాన్ లు తీయడం వల్ల నాడు చెమటలు పట్టాయి.. ప్రభుత్వ పెద్దలకు భయపడి కాదు. ఏ రాజకీయ పార్టీలకు తొత్తులుగా ఉండం. ఇప్పటికి జీతాలు రాని వారు ఉన్నారు. 10 తేదీ అయ్యింది.. సమాధానం చెప్పే వారు లేరు. మంత్రి బుగ్గన, రావత్ తో సహా ఒక్కరు సచివాలయం లో కనిపించడం లేదు. రిటైర్డ్ ఉద్యోగులకు బెనిఫిట్స్ ఇప్పటికి అందడం లేదు. మంత్రుల ఇళ్లలో కుక్కలకు వేసే బిస్కట్ల కు కూడా ఉద్యోగుల జీతాల నుంచే బడ్జెట్’’ అని బండి శ్రీనివాస్ చెప్పుకొచ్చారు. ఏపీజేఏసీ అమరావతి అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు వాదన కూడా అచ్చం అలానే ఉంది. ‘‘మా సమస్యలపై స్పందించేది సజ్జల ఒక్కరే. మమ్మల్ని సజ్జల బెదిరించలేదు. మేమిద్దరం ఒకే వేదిక మీదకు వచ్చే సరికి సజ్జల ఫోన్ చేశారు. మేము ఉద్యోగులం. ప్రభుత్వానికి లోబడి ఉంటాము. ఉద్యోగుల సమస్యలపై రాజీ పడే అవకాశమే లేదు. ఆర్థికేతర సమస్యల పై సీఎం స్పందించాలి. CPS రద్దు చేస్తారని సీఎం పై నమ్మకం ఉంది. 11 వ PRC దసరా నాటికి ఇవ్వాలని కోరాం..ఆర్ధిక మంత్రి మాకు దొరకడం లేదు. ఏమి చెయ్యాలో తెలియడం లేదు’’ అని బొప్పరాజు చెప్పుకొచ్చారు.
ఉద్యోగ సంఘాల వివరణ తర్వాత మరిన్ని అనుమానాలు వస్తున్నాయి. ఉద్యోగ సంఘాల నేతలు చెబుతున్నట్లు శుభాకాంక్షలు చెప్పడానికే సజ్జల ఫోన్ చేస్తే.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా తాము మాట్లాడటం లేదని సజ్జలకు వాళ్లు చెప్పాల్సిన అవసరం ఏముందనే ప్రశ్న వస్తోంది. మాకు చెమటలు పట్టిన మాట వాస్తవమే గానీ.. అది సజ్జల బెదిరింపుల వల్ల కాదు అంటూ వివరణలు ఇచ్చాక.. వారిద్దరికీ సజ్జల నుంచి బెదిరింపులు నిజంగానే వచ్చి ఉంటాయని సామాన్య జనం కూడా భావిస్తున్నారు. అసలు ఉద్యోగ సంఘాల నేతలు ప్రెస్ మీట్ పెట్టగానే సజ్జల ఫోన్ చేయాల్సిన అవసరం ఏంటీ? శుభాకాంక్షలు చెబితే నేతలకు చెమటలు ఎందుకు వచ్చాయి? అన్నది తేలడం లేదు. ఉద్యోగ సంఘాల నేతల అంతర్గత సమాచారం ప్రకారం ప్రెస్ మీట్ పెట్టిన నేతలను సజ్జల తీవ్ర పదజాలంతో తిట్టారని అంటున్నారు. ప్రెస్ మీట్ ఆపకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని కూడా హెచ్చరించారట. అందుకే బండి శ్రీనివాస్, బొప్పరాజు భయంతో వణికిపోయారని, అందుకే వాళ్లకు చెమటలు వచ్చాయని చెబుతున్నారు.