మా ఎన్నికల్లో ఫైటింగ్.. అమరావతి రైతుల మహాయాత్ర...టాప్ న్యూస్@ 1PM
posted on Oct 10, 2021 @ 12:55PM
ఏపీ రాజధాని అమరావతి కోసం 'రైతు' మహా పాదయాత్ర ప్రారంభమైంది. 50 రోజులపాటు 400 కిలోమీటర్లు మేర నిర్విరామంగా పాదయాత్ర సాగనుంది. తుళ్ళూరు న్యాయస్థానం నుంచి తిరుమల శ్రీవారి దేవస్థానం వరకు రైతుల పాదయాత్ర జరుగుతుంది.డిసెంబర్ 17కి సీఎం జగన్ మూడు రాజధానుల ప్రకటన చేసి రెండేళ్లు అవుతుంది. అదే రోజు రైతులు తిరుపతి చేరుకుని భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు.
-------
విద్యుత్ చార్జీల పెంపును వ్యతిరేకిస్తూ వినుకొండ మాజీ ఎమ్మెల్యే జి.వి.ఆంజనేయులు వినూత్న నిరసన చేపట్టారు. శావల్యాపురం మండలం శానంపూడి ఎస్సీ కాలనీలో పర్యటిస్తున్న జీవీ... విద్యుత్ చార్జీల పెంపుపై ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ క్రమంలో ఒక లైట్, ఒక ఫ్యాన్ ఉన్న గుడెసెకు రూ.49 వేలు బిల్లు వచ్చిందని బాధితురాలు వాపోయింది. కరెంట్ బిల్లులు చెల్లింపు కోసం జగన్ రెడ్డి బ్యాంకులో లోన్లు ఇవ్వాలని జీవీ ఆంజనేయులు నినాదాలు చేశారు.
-----
విశాఖలో అన్ని ఆస్తులు అమ్మేస్తున్నారని...శ్మశానంలో పరిపాలన రాజధాని పెడతారా? అని సీపీఐ రామకృష్ణ ప్రశ్నించారు. పరిపాలన రాజధాని పేరుతో విశాఖను దగా చేస్తున్నారని మండిపడ్డారు. ఆర్ధిక మంత్రిని...అప్పుల మంత్రిగా మార్చేశారన్నారు. టీడీపీ, వైసీపీ అప్పులపై శ్వేతపత్రం ప్రకటించాలని డిమాండ్ చేశారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వద్దని ఎంపీలు ఒక్కసారి అయిన పీఎం దగ్గరకు వెళ్లారా? అని నిలదీశారు.
-------
జాతీయ దర్యాప్తు సంస్థ అధికారులు విజయవాడలోని ఆషీ ట్రేడింగ్ కంపెనీ ఉన్న నివాసంలో సోదాలు చేసింది. గుజరాత్‌లోని ముంద్రాపోర్టులో ఇటీవల పెద్ద ఎత్తున పట్టుబడిన హెరాయిన్‌తో విజయవాడకు సంబంధాలు ఉన్నట్టు అధికారులు ఇప్పటికే గుర్తించారు. ఈ నేపథ్యంలోనే చెన్నై, కోయంబత్తూరులోనూ తనిఖీలు నిర్వహించారు. ఆఫ్ఘనిస్థాన్ నుంచి విజయవాడలోని ఆషీ ట్రేడింగ్ కంపెనీ చిరునామాతో వచ్చిన కంటెయినర్లను ముంద్రా పోర్టులో పట్టుకున్నారు.
---
జనసేన అధినేత పవన్‌పై సీపీఐ రామకృష్ణ కీలక వ్యాఖ్యలు చేశారు. స్టీల్ ప్లాంటు ఉద్యమానికి పవన్ మద్దతు ఇవ్వడమంటే.. బ్లఫ్ చేయడమే అని అన్నారు. ప్రైవేటీకరణ చేయవద్దని మిత్ర పక్షమైన బీజేపీని పవన్ గట్టిగా అడగాలన్నారు. స్టీల్ ప్రైవేటీకరణను మోదీ మాత్రమే అపగలరని...జగన్ చేతిలో ఏమీలేదని వ్యాఖ్యానించారు. ఏపీకి బీజేపీ పక్కా నష్టం కలిగిస్తోందన్నారు. రైతులు చంపిన పార్టీ బీజేపీ అని మండిపడ్డారు.
--
ఇంద్రకీలాద్రిపై 300 రూపాయల టికెట్‌ను ఆన్‌లైన్‌లో కొనుగోలు చేసిన భక్తులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఫ్రీ దర్శనంతో సమానంగా 300 రూపాయల దర్శనం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. నడవలేని వారి కోసం తీసుకునే 300 రూపాయల టికెట్టుకు కూడా ఫ్రీ దర్శనంతో సమానంగా దర్శనం కల్పిస్తున్నారని ఆరోపించారు. వీఐపీలకు పెద్దపీట వేస్తూ, సామాన్య భక్తులను అధికారులు పట్టించుకోవడం లేదంటూ భక్తులు ఆవేదన చెందుతున్నారు
--
దసరా పండుగలకు వెళ్తున్న ప్రయాణికులకు టీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పింది. దసరా సందర్భంగా టీఎస్ఆర్టీసీలో పెంచిన అదనపు చార్జీలను ఎత్తివేసినట్లు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు. ఇప్పుడు ఉన్న సాధారణ ఛార్జీలే వసూలు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ప్రయాణికులపై అదనపు భారం వద్దని, ఇప్పటి వరకు తీసుకున్న రిజర్వేషన్ల టికెట్లు, అదనపు చార్జీలను వెనక్కి తీసుకోవాలని సజ్జనార్ ఆదేశించారు.
--
జోగులాంబ గద్వాల: జిల్లాలోని అయిజ మండలంలోని కొత్తపల్లి గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. ఆదివారం తెల్లవారుజామున వర్షానికి నివాస గుడిసె కూలింది. ఈ ప్రమాదంలో గుడిసెలో నిద్రిస్తున్న ఏడుగురు వ్యక్తుల్లో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. తల్లిదండ్రులతో పాటు ముగ్గురు అక్కడికక్కడే సజీవ సమాధి కాగా, మరో ఇద్దరు గాయాలతో బయటపడ్డారు.
-----
దేశ రాజధాని ఢిల్లీలో హై ఆలర్ట్ ప్రకటించారు. దసరా, దీపావళి పండగల సంధర్భంగా రాజధానిలో తీవ్రవాదుల దాడులు చేయవచ్చునని ఢిల్లీ పోలీసులకు ఇంటలిజెన్స్ వర్గాలు సమాచారమిచ్చాయి. దీంతో ఢిల్లీ పోలీసులు అప్రమత్తమయ్యారు. పోలీస్ కమిషనర్ రాకేష్ ఆస్తానా పోలీసు ఉన్నతాధికారులతో కీలక సమావేశం నిర్వహించారు. తీవ్రవాదుల దాడులకు స్థానిక క్రిమినల్స్, గ్యాంగ్‌స్టర్ల సహకారం తీసుకునే అవకాశం ఉందంటూ అప్రమత్తం చేశారు.
---
‘మా’ ఎన్నికల్లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ప్రకాష్ రాజ్ ప్యానెల్ తీరుపై విష్ణు ప్యానెల్ అభ్యంతరం వ్యక్తం చేయడంతో రెండు ప్యానెళ్ల మధ్య వాగ్వాదం జరిగింది. నమూనా బ్యాలెట్ ఇస్తున్నారంటూ శివారెడ్డిని శివబాలాజీ అడ్డుకున్నారు. అలాగే పోలింగ్ కేంద్రంలో ప్రచారం చేస్తున్నారంటూ అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రకాష్ రాజ్ వర్గంపై విష్ణు వర్గం దూసుకెళ్లింది. ప్రకాష్ రాజ్ ప్యానెల్‌పై ఆగ్రహం వ్యక్తం చేసిన మోహన్ బాబు.. బెనర్జీని చంపేస్తానని బెదిరించారు.