‘మా’లో ముందంజ.. కడప బాంబు విసిరిన చంద్రబాబు.. టాప్ న్యూస్ @ 7pm
posted on Oct 10, 2021 @ 7:08PM
1. ‘మా’ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఉత్కంఠగా సాగుతోంది. పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో మంచు విష్ణు ప్యానెల్ ముందంజలో ఉంది. పోలైన ఓట్లలో 50 చెల్లనివిగా ఈసీ నిర్ధారించారు. ఈసారి రికార్డు స్థాయిలో 75శాతం పోలింగ్ జరిగింది. మురళీ మోహన్, మోహన్ బాబు సమక్షంలో కౌంటింగ్ సాగుతోంది. గెలుపుపై ప్రకాశ్‌రాజ్, మంచు విష్ణు ప్యానెళ్లు ఎవరికివారు ధీమాగా ఉన్నారు. ప్రస్తుతానికి ప్రకాశ్‌రాజ్ ప్యానెల్ సభ్యులు ముందున్నారు.
2. మా ఎన్నికల సందర్భంగా శివబాలాజీ చేతిని హేమ కొరికారు. చికిత్స కోసం శివబాలాజీ నిమ్స్ ఆస్పత్రిలో చేరారు. టీటీ ఇంజెక్షన్ తీసుకున్నట్లు శివబాలాజీ తెలిపారు. హేమ తన చేతికి ఎందుకు కొరికిందో తనకు తెలీదన్నారు. శివబాలాజీ ఒకరిని కొట్టబోతుంటే తాను ఆపడానికి వెళ్లానని.. ఆయన తనను అడ్డుకోవడంతో కొరికినట్లు చెప్పారు. ఏదో చేయకపోతే ఊరికే కొరుకుతారా? అని హేమ అన్నారు.
3. ‘‘రాజకీయ లబ్ధి కోసం నటీనటులను వాడుకుంటున్నారు. ప్రకాష్ రాజ్ గెలిచినా, మంచు విష్ణు గెలిచినా ఈ విషయంపై దృష్టి పెట్టాలి. రాజకీయాల కోసం ఆర్టిస్టులను సతాయించడం మానేయాలి అని కోరుతున్నా.’’ అని నటి పూనమ్ కౌర్ అన్నారు. పవన్ కల్యాణ్ వర్సెస్ పోసాని ఎపిసోడ్‌లో ఇటీవల వార్తల్లో నిలిచిన పూనమ్‌కౌర్ ఇలాంటి కామెంట్ చేయడం ఆసక్తికరంగా మారింది.
4. కడప నుంచి ఇతర ప్రాంతాలకు విమాన సర్వీసులను పునరుద్ధరించాలంటూ సీఎం జగన్‌కు టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ రాశారు. ప్రాథమిక, పారిశ్రామిక సేవా రంగాల అభివృద్ధికి రవాణా సౌకర్యాలు అత్యంత కీలకమని అన్నారు. తన హయాంలో హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, విజయవాడ, తిరుపతి నుంచి కడపకు నేరుగా విమాన సర్వీసులు ఏర్పాటు చేసిన విషయం గుర్తు చేశారు.
5. సీఎం జగన్‌కి పవర్ ఇస్తే ప్రజలకు కరెంట్ లేకుండా చేశారని టీడీపీ నేత పట్టాభి దుయ్యబట్టారు. జగన్ రివర్స్ గేర్ పాలనలో త్వరలోనే ప్రజలు లాంతర్లు పట్టుకొని తిరగడం ఖాయమన్నారు. విద్యుత్ శాఖలో ఏం జరుగుతోందో ఆ శాఖా మంత్రి బాలినేనికి కూడా తెలియదని ఎద్దేవా చేశారు. బొగ్గునిల్వలు లేవని కేంద్రానికి కుంటిసాకులు చెబుతారా? రాష్ట్రంలో బొగ్గు నిల్వలు లేకపోవటానికి సీఎం కారణం కాదా? అని పట్టాభి ప్రశ్నించారు.
6. సీఎం పీఠం ఎక్కేవరకూ ఒకమాట.. ఆ తర్వాత మరోకలా సామాన్యులకు ఎటువంటి ఉపయోగం లేకుండా పరిపాలన సాగిస్తున్నారని సీఎం జగన్‌ను జనసేన నాయకులు నాదేండ్ల మనోహర్ విమర్శించారు. మంత్రులు, ఎమ్మెల్యేలు కనీవినీ ఎరుగని రీతిలో ఆస్తులు సంపాదించుకున్నారని ఆరోపించారు. ఏపీలో జరుగుతున్న అవినీతి.. వ్యాపారవేత్తలను బెదిరించి వసూళ్లు చేయటం.. వారు రాష్ట్రం విడిచి వెళ్లిపోయేలా చేస్తున్న తీరు గురించి.. దారుణమన్నారు. రేషన్ కార్డులు, ఇళ్ల పట్టాల విషయంలో ఎవరిని ప్రశ్నించాలన్నా ప్రభుత్వ యంత్రాంగమే దాడి చేస్తుందని భయపడాల్సిన పరిస్ధితి ఏర్పడిందని నాదేండ్ల మండిపడ్డారు.
7. దేశంలోనే అత్యంత ఖరీదైన ఎన్నికలు హుజురాబాద్ ఎన్నికలే అన్నారు ఎమ్మెల్యే సీతక్క. అధికారంలోకి రాబోయేది కాంగ్రెస్ పార్టీనేనని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం మిగులు బడ్జెట్‌తో అభివృద్ధి, వసతులు కల్పించిన పార్టీ అని.. ఇప్పుడు అప్పుల పాలు, నష్టాల్లో ఉన్న రాష్ట్రం మనదని దుయ్యబట్టారు. హుజురాబాద్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఒక్క ఛాన్స్ ఇవ్వాలని సీతక్క కోరారు.
8. రాష్ట్రంలో ప్రతి ఉద్యోగి కూడా అసంతృప్తితో ఉన్నాడని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నేతలు అన్నారు. పీఆర్సీ, డీఏ కాదు కదా కనీసం, దహన సంస్కారాల ఖర్చులు కూడా ఇవ్వడం లేదని విమర్శించారు. పదవీ విరమణ చేసిన వారు బెనిఫిట్స్ కూడా ఇవ్వడం లేదన్నారు. సమస్యలపైన ఎవరిని కలిసినా ప్రయోజనం ఉండటం లేదన్నారు. ప్రభుత్వ౦ సమస్యలు పరిష్కరించకపోతే జనవరి నుండి పోరాటానికి సిద్ధమవుతామని హెచ్చరించారు.
9. టీటీడీ అధికారులపై రమణదీక్షితులు విమర్శలు చేశారు. పద్మావతి ఆలయంలో వంశపారంపర్య అర్చకులను నియమించారు కానీ ఏప్రిల్ నుంచి సంభావనలను ఇవ్వడం లేదన్నారు. శ్రీవారి గర్భాలయంలోకి ప్రవేశించలేక.. పూజా కైంకర్యాలు నిర్వహించలేకపోతున్నామని చెప్పారు. సమస్యల నుంచి వెంటనే అర్చకులకు ఉపశమనం కలిగించాలని సూచించారు.
10. ఇంద్రకీలాద్రిపై భక్తులు రద్దీ భారీగా ఉంది. దుర్గగుడిలో రాజకీయ నాయకులు, వారి బంధువుల సేవలో ఆలయ అధికారులు, పోలీసులు తరిస్తున్నారు. సామాన్యులకు అమ్మదర్శనం కష్టంగా మారింది. దొంగపాస్‌లతో వీఐపీ దర్శనం చెయ్యిస్తున్నట్లు భక్తులు ఆరోపిస్తున్నారు. క్యూ లైన్‌లో శానిటైజేషన్ కూడా చేయడం లేదని మండిపడుతున్నారు.