దీక్షలో బండి సంజయ్.. ఈటల ఆగమేనా? కమలంలో కిరికిరి నడుస్తోందా?
posted on Oct 10, 2021 @ 3:32PM
శరన్నవరాత్రి సందర్భంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ అమ్మవారి దీక్ష చేస్తున్నారు. తొమ్మిది రోజుల పాటు సాగే దీక్షతో పూర్తిగా దుర్గామాత సేవలో ఉండనున్నారు. మామూలుగానైతే ఇదేమంత ప్రత్యేకమైన విషయం కాదు కానీ.. ఈ నెలాఖరున హుజురాబాద్ ఉప ఎన్నిక ఉన్న నేపథ్యంలో బండి చేస్తున్న దీక్ష రాజకీయంగా ఆసక్తికరంగా మారింది. ఆయనేమీ ఈటల గెలవాలని ఈ దీక్ష చేయడం లేదు. కీలకమైన హుజురాబాద్ ఎన్నికల సమయంలో.. ఏకంగా తొమ్మిది రోజుల పాటు దీక్షలో ఉండటం.. హుజురాబాద్ ప్రచారానికి దూరమవడం.. రాజకీయంగా కలంకలం రేపుతోంది. ఓవైపు అధికార టీఆర్ఎస్ ప్రచారంతో హోరెత్తిస్తుంటే.. బీజేపీ అధ్యక్షులే హుజురాబాద్‌కు వెళ్లకుండా.. అమ్మవారి దీక్ష చేపట్టడం ఈటల రాజేందర్‌కు ఇబ్బందిగా మారిందంటున్నారు. పార్టీలో ఈటల ఒంటరిగా మిగిలారని చెబుతున్నారు. బీజేపీ బడా నాయకులెవరూ ఆయనకు అంతగా సహకరించడం లేదంటున్నారు. ఈటలను బీజేపీలోకి తీసుకు రావడానికి తీవ్ర ప్రయత్నాలు చేసిన వివేక్ వెంకటస్వామి సహా అగ్రనేతలంతా అంటీముట్టనట్టుగానే ఉంటున్నారు.
నామినేషన్ రోజున బండి సంజయ్, కిషన్ రెడ్డి మాత్రం హాజరయ్యారు. లేదంటే అధిష్టానం దగ్గర వారికే ఇబ్బంది. ఇక అంతే. ఆ తర్వాత పెద్ద స్థాయి నేతలెవరూ అటువైపు వెళ్లడం లేదు. నామినేషన్ల పర్వం ముగిసినా.. ఈటలకు మద్దతుగా కమలనాథులు క్యూ కట్టడం లేదు. అసలే, కొవిడ్ కారణంగా బహిరంగసభలు, ర్యాలీలను ఈసీ నిషేధించింది. దీంతో అమిత్‌షా, నడ్డాలాంటి జాతీయ స్థాయి నేతలు వస్తారో రారో అనే డౌట్. వాళ్లు వచ్చినా రాకపోయినా.. ఈ ఇరవై రోజులైనా బండి సంజయ్, కిషన్‌రెడ్డి, వివేక్, డీకే అరుణ లాంటి లీడర్లు హుజురాబాద్‌లో మకాం వేసి.. ఈటలకు మద్దతుగా గట్టి ప్రచారం చేస్తే అభ్యర్థికి ప్రయోజనం. కానీ, అధ్యక్షలు బండి సంజయ్ ఇలా దీక్ష పేరుతో దూరమవడం.. మిగతా నేతలూ హుజురాబాద్‌ను పెద్దగా పట్టించుకోకపోవడం అనుమానాస్పదం అవుతోంది.
కేసీఆర్ ఢిల్లీ టూర్ తర్వాత బీజేపీలో మార్పు కనిపిస్తోందని అంటున్నారు. హుజురాబాద్ ఎన్నికకు జాతీయ నాయకత్వం పెద్దగా ప్రాధాన్యం ఇవ్వటం లేదని తెలుస్తోంది. ఢిల్లీ మనసెరిగిన రాష్ట్రస్థాయి నేతలు ఆ మేరకు దూకుడు తగ్గించారని అనుమానిస్తున్నారు. మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఈటల రాజేందర్ ఆగమయ్యారని అంటున్నారు.
పోలింగ్ కేంద్రాల వారీగా సీనియర్ నాయకులను ఇన్‌చార్జ్‌లుగా నియమించాలని బీజేపీ భావిస్తోంది. ఆ ఇంఛార్జిలను నియమించాల్సిన బండి సంజయ్ దీక్ష పేరుతో.. దసరా తర్వాత హుజురాబాద్ విషయం చూద్దామని అంటున్నట్టు తెలుస్తోంది. అందుకే, ఈటల పూర్తిగా తన సొంత బలం మీదనే ఆధారపడుతున్నారు. బీజేపీని కాకుండా తనను తానే నమ్ముకుంటున్నారు. తన అనుచరులతోనే ప్రచారం చేస్తున్నారు. అన్నిరకాలుగా ఇబ్బంది పెడుతున్న అధికార పార్టీ దూకుడును, హరీష్‌రావు వ్యూహాలను ఎప్పటికప్పుడు కాచుకుంటూ.. హుజురాబాద్ బరిలో ఒంటరి పోరాటం చేస్తున్నారు ఈటల రాజేందర్. ఈ ధర్మయుద్ధంలో గెలుపు తనదేనని ధీమాగా చెబుతున్నారు.