శహభాష్ సజ్జనార్.. పండుగ ప్రత్యేక బస్సులకు పాత చార్జీలే!
posted on Oct 11, 2021 @ 1:19PM
ఐపీఎస్ అధికారిగా విధి నిర్వహణలో ప్రజల ప్రశంసలు పొందిన వీసీ సజ్జనార్.. ఆర్టీసీ ఎండీగాను తన మార్క్ చూపిస్తున్నారు. ఇటీవలే టీఎస్ ఆర్టీసీ ఎండీగా బాధ్యతలు చేపట్టిన సజ్జనార్.. అప్పుల్లో కూరుకుపోయిన సంస్థను గాడిలో పెట్టడంతో ఉద్యోగుల సంక్షేమంపైనా ఫోకస్ చేశారు. అదే సమయంలో ప్రజలపై భారం మోపకుండా చర్యలు తీసుకుంటున్నారు. తాజాగా ఆయన తీసుకున్న నిర్ణయం అందరిని సంతోష పరుస్తోంది.
తెలంగాణలో అతిపెద్ద పండుగ దసరా. ఈ పండుగ కోసం లక్షలాది మంది జనాలు పట్టణాల నుంచి సొంత గ్రామాలకు వెళుతుంటారు. ఇక గ్రామాల్లోనూ రాకపోకలు ఎక్కువగా ఉంటాయి. ఇదే అదనుగా ప్రతి ఏటా దసరా కోసం ప్రత్యేక బస్సులు నడుపుతుంది ఆర్టీసీ, అయితే సాధారణ చార్జీలు కాకుండా అదనపు చార్జీలు వసూల్ చేసేది. పాత టికెట్ కన్నా 50 శాతం.. ఒక్కసారి డబుల్ రేట్లు కూడా వసూల్ చేసిన సందర్భాలున్నాయి. ప్రయాణికుల నుంచి వ్యతిరేకత వచ్చినా... పండుగ సమయంలో ప్రత్యేక బాదుడు ఆపలేదు ఆర్టీసీ అధికారులు. కాని ప్రస్తుతం ఎండీగా ఉన్న సజ్జనార్ మాత్రం సంచలన నిర్ణయం తీసుకున్నారు.
దసరా పండుగ సందర్భంగా నడిపే బస్సులకు ఎటువంటి అదనపు ఛార్జీలు వసూలు చేయడం లేదని వీసీ సజ్జనార్ తెలిపారు. అంతేకాదు.. ఇక ముందు తెలంగాణ రాష్ట్రంలో అదనపు ఛార్జీలు ఉండవని తెల్చి చెప్పారు. గడిచిన ఐదు రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా 1.30 కోట్ల మంది ప్రయాణికులను TSRTC సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చిందన్నారు. ఎలాంటి అదనపు ఛార్జీలు లేకుండా ప్రయాణికుల సౌకర్యం భధ్రతే ధ్యేయంగా ఈ పండుగ సమయంలో తాము ఆర్టీసీ సేవలు అందిస్తున్నామని తెలిపారు సజ్జనార్. ఆర్టీసీలో ప్రయాణిస్తూ ప్రయాణీకులు చూపించే ఆదరాభిమానాలే సంస్థ పురోభివృద్ధికి ఎంతగానో తోడ్పాటునందిస్తాయని తాము ఆకాంక్షిస్తున్నామన్నారు. అందరు ప్రతి ప్రయాణాన్ని ఆర్టీసీ బస్సులో చేసి.. సురక్షితంగా గ్యమస్థానాలకు చేరుకోవాలని సజ్జనార్ కోరారు.
దసరా పండగకు నడిపే ప్రత్యేక బస్సులో అదనపు చార్జీలు ఉండవంటూ సజ్జనార్ చేసిన ప్రకటనపై అన్ని వర్గాల నుంచి సంతోషం వ్యక్తమవుతోంది. గతంలో తమకు వేల రూపాయల భారం పడేదని, చార్జీలు పెంచకపోవడం వల్ల తమకు ఊరట లభించిందని ప్రయాణికులు చెబుతున్నారు. ఇక ఎండీగా బాధ్యతలు తీసుకోగానే కార్మికుల సమస్యలపై ఫోకస్ చేసిన సజ్జనార్.. అక్టోబర్ నెలలో ఒకటో తారీఖునే వేతనం అందేలా చర్యలు తీసుకున్నారు. గత నాలుగేండ్లుగా ఆర్టీసీ ఉద్యోగులకు వేతనాలు సకాలంలో అందడం లేదు. 15వ తారీఖు వరకు జీతాలు జమకాని రోజులు కూడా ఉన్నాయి. అయితే సజ్జనార్ మాత్రం బ్యాంకర్లతో మాట్లాడి ఫస్ట్ రోజే వేతనాలు వచ్చేలా ఏర్పాట్లు చేశారు.
ఆర్టీసీ ఎండీగా వీసీ సజ్జనార్ తీసుకుంటున్న నిర్ణయాలపై సంస్థ ఉద్యోగుల నుంచి హర్షం వ్యక్తమవుతోంది. ప్రయాణికులు కూడా హ్యాపీగా ఉన్నారు. మొత్తంగా ఐపీఎస్ ఆఫీసర్ గా తనదైన మార్క్ చూపించిన సజ్జనార్.. ఆర్టీసీ ఎండీగాను అద్భుతంగా పని చేస్తున్నారనే చర్చ ప్రభుత్వ వర్గాల్లో ప్రజల్లో సాగుతోంది.