సీఎం జగన్ ఫోటోకు మొక్కిన స్పీకర్.. ఇంత దారుణమా?
posted on Oct 9, 2021 @ 5:47PM
భారత రాజ్యాంగం చాలా పవర్ ఫుల్, మన రాజ్యాంగంలో ప్రజా ప్రతిధులు, వాళ్ల పదవులు, హోదాలకు సంబంధించి సమగ్రంగా పొందు పరిచింది. అయితే రాజ్యాంగ బద్ధ పదవులకు వన్నె తెచ్చేలా వ్యవహరించాల్సిన మన నేతలు,, ఆ పదవులకు ఉన్న గౌరవాన్ని మంటగలుపుతున్నారు. ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం కూడా ఇప్పుడు అదే పనిచేశారు. సభాధ్యక్షుడి స్థానంలో ఉండి.. ఆ పదవికి కళంకం తెచ్చేలా వ్యవహరించారు.
ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఫొటోకు కొందరు మహిళలు పాలాభిషేకం చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి హాజరైన తమ్మినేని తనలోని స్వామి భక్తిని దాచుకోలేకపోయారు. సీఎం జగన్ ఫొటోకు మొక్కారు. జగన్ ఫొటోకు మహిళలు పాలాభిషేకం చేస్తుండగా.. ఆ పక్కనే నిలుచున్న తమ్మినేని.. రెండు చేతులు జోడించారు. ఇలా చేతులు జోడించడంలోనూ తమ్మినేని తనదైన మార్కును చూపారు. మొక్కడమంటే.. రెండు చేతులు గాల్లోకి ఎత్తి మొక్కడం కాకుండా.. హరతి తీసుకుంటున్న సందర్భంగా చేతులు జోడించినట్టుగా, లేదంటే.. కొందరు పెద్దల పాదాలను తాకినట్లుగా తమ్మినేని కూడా తన రెండు చేతులను జగన్ బొమ్మపై పెట్టారు. ఈ ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.ఈ చర్య ద్వారా స్పీకర్ స్థానంలో ఉన్న తమ్మినేని.. సీఎం జగన్‌కు భక్తుడిగా మారిపోయారన్న వాదనలు వినిపిస్తున్నాయి.
ఈ ఘటన శ్రీకాకుళం జిల్లాలోని తమ్మినేని సొంత నియోజకవర్గం ఆముదాలవలసలో చోటుచేసుకుంది. స్వయం శక్తి సంఘాల మహిళలకు ఆసరా రెండో విడత చెక్కుల పంపిణీ కార్యక్రమంలో తమ్మినేని పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహిళలు సీఎం ఫొటోకు పాలాభిషేకం చేయగా.. తమ్మినేని ఆ ఫొటో ముందు చేతులు జోడించి నిలబడ్డారు.
శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస ఎమ్మెల్యేగా ఎన్నికైన తమ్మినేని సీతారాంను స్పీకర్‌గా తాము ప్రతిపాదిస్తే.. సభలో విపక్ష నేతగా ఉన్న టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు ఆయనకు స్వాగతం పలకలేదని అప్పుడు వైసీపీ నానా రచ్చ చేసింది. ఇప్పుడు స్పీకర్ స్థానంలో కూర్చున్న తమ్మినేని తాను కూర్చున్న పదవి గౌరవ మర్యాదలను మంటగలిపేలా వ్యవహరించారు.