రాహుల్ చేతికి కాంగ్రెస్ పగ్గాలు? పీకే డైరెక్షన్ లో కొత్త వ్యూహాలు..
posted on Oct 10, 2021 @ 10:39AM
కాంగ్రెస్ పార్టీ చరిత్రలో మరో కొత్త అధ్యాయం మొదలు కానుందా? ఎంతో కాలంగా పార్టీ సీనియర్ నాయకులు కోరుతున్న విధంగా సంస్థాగత మార్పులకు పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ శ్రీకారం చుడుతున్నారా? లేక, పాత పద్దతిలోనే మరో మారు, పదవుల కుండమార్పిడితో సరిపుచ్చుతారా అంటే అదైనా ఇదైనా ఏదైనా జరగవచ్చని అంటున్నారు పార్టీ నాయకులు. పలుమార్లు వాయిదా పడుతూ వచ్చిన కాంగ్రెస్ పార్టీ సర్వోన్నత విధాన నిర్ణయ కమిటీ, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) ఈ నెల 16న సమావేశంలో ఎదో ఒకటి తేలిపోతుందని అంటున్నారు.
ఇటీవల కాలంలో కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న పరిణామాలను ముఖ్యంగా పంజాబ్ సంక్షోభ పరిష్కారం మొదలు అనేక కీలక నిర్ణయాల్లో రాహుల్ గాంధీ స్వతంత్ర నిర్ణయాలు తీసుకుంటున్న తీరును గమనిస్తే ఆయన పార్టీ బాధ్యతలను స్వీకరించేందుకు సిద్దమయినట్లు కనిపిస్తోంది. అయితే, ఆయన నాయకత్వాన్ని, ఇటు పార్టీ, ముఖ్యంగా పార్టీలో సమ్మతి కుంపటి రాజేసిన జీ23 సీనియర్ నాయకులు అంగీకరిస్తారా? అనే ప్రశ్నలు ఉన్నాయి. అయినా చివరాఖరుకు రాహుల్ గాంధీ, పార్టీ అధ్యక్ష బాధ్యతలు చేపట్ట్టే, అవకాశం ఉందని అంటున్నారు. అదే జరిగితే, పార్టీ సీనియర్ నాయకుల రియాక్షన్ ఎలా ఉంటుంది అనేది చూడవలసి ఉందని పరిశీలకులు అంటున్నారు. అయితే, అదే సమయంలో అధ్యక్ష పదవిలో సోనియా గాంధీ కొనసాగుతూ, రాహుల్ గాంధీని వర్కింగ్ ప్రెసిడెంట్ చేసే ఆలోచన కూడా ఉన్నట్లు తెలుస్తోంది. అదైనా, ఇదైనా ఏదైనా పార్టీ భవిష్యత్ ప్రస్థానానికి సంబందించి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో స్పష్టత వచ్చే, అవకాశం ఉందని తెలుస్తోంది.
పంజాబ్ సంక్షోభం, ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ రాజీనామా నేపధ్యంగా చోటు చేసుకున్న పరిణామాలు, ముఖ్యంగా ఇందుకు సంబదించి పార్టీ సీనియర్ నాయకుడు కపిల్ సిబల్, “అధ్యక్షుడు లేని పార్టీలో కీలక నిర్ణయాలు ఎవరు తీసుకుంటున్నారో” అంటూ చేసిన వ్యాఖ్యలు.. అదే సమయంలో అయన జీ 23 అంటే జీ హుజూర్ 23 కాదని అంటించిన చురకలు పార్టీలో తీవ్ర దుమారన్నే రేపాయి. కాంగ్రెస్ కార్యకర్తలు , కపిల్ సిబల్ ఇంటిపై కోడి గుడ్లు, టమోటాలతో దాడి చేశారు.దీంతో గాంధీలు ( సోనియా, రాహుల్, ప్రియాంక) జీ 23 మధ్య దూరం మరింతగా పెరిగిపోయింది. ఈ నేపథ్యంలో సీడబ్ల్యూసీ భేటీ తేదీని ప్రకటించడం, అందులో పార్టీ సంస్థాగత ఎన్నికలపై చర్చించబోతున్నట్లు స్పష్టం చేయడంతో కాంగ్రెస్‌కు పూర్తి స్థాయిలో కొత్త అధ్యక్షుడిని ఎన్నుకునే అవకాశం ఉందన్న వార్తలు ఢిల్లీ కాంగ్రెస్ వర్గాల్లో వినిపిస్తున్నాయి.
వచ్చే ఏడాదిలో యూపీ, పంజాబ్ సహా ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పోల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిశోర్ కాగ్రెస్ పార్టీలో చేరుతారన్న వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో ఆయన కాంగ్రెస్ పార్టీలో చాలా లోతైన సమస్యలు ఉన్నాయని, వాటిని ఒక్కసారిగా పరిష్కరించడం సాధ్యం కాదంటూ ట్వీట్ చేయడం కూడా ప్రాముఖ్యం సంతరించుకుంది. ఒక్కొక్కటిగా సమస్యల పరిష్కారం దిశగా అడుగులు పడుతున్నట్లు కనిపిస్తోంది. అయితే కాంగ్రెస్ పార్టీలో ఏర్పడిన సంక్షోభానికి ఇప్పట్లో పరిష్కారం లభించడం అయితే అయ్యే పని కాదని, ముఖ్యంగా నాయకత్వ సమస్య ఇప్పట్లో పరిష్కారం అయ్యేసూచనలు కనిపించడం లేదని పరిశీలకులు భావిస్తున్నారు.