సీఐడీ చీఫ్ సునీల్‌కుమార్‌పై వేటు తప్పదా? కేంద్రం ఫైనల్ వార్నింగ్..
posted on Oct 10, 2021 @ 2:45PM
ఎంపీ రఘురామతో పెట్టుకున్నోళ్లు ఎవరూ ప్రశాంతంగా ఉండేలా లేరు. కస్టడీ పేరుతో థర్డ్ డిగ్రీ ప్రయోగించిన పాపమో.. రఘురామ రివేంజో.. కారణం ఏదోకానీ.. ఏపీ సీఐడీ చీఫ్ సునీల్‌కుమార్‌కు కేంద్రం తరఫున ఉచ్చు గట్టిగానే బిగిసుకుంది. ఆ మెడకు చుట్టుకున్న ఉచ్చు నుంచి ఎంతగా తప్పించుకోవాలని చూస్తున్నా.. సునీల్‌కు జగనన్న రక్ష, దీవన ఎంతగా ఉన్నా.. కేంద్ర హోంశాఖ మాత్రం ఆయన్ను అంత ఈజీగా వదిలిపెట్టడం లేదు. సీఐడీ బాస్ సునీల్‌కుమార్‌పై ఎలాంటి చర్యలు తీసుకున్నారంటూ మరోసారి కేంద్ర హోంశాఖ ఏపీ ప్రభుత్వాన్ని నిలదీసింది. ఆ మేరకు మరోసారి లేఖ రాసింది.
సునీల్ కుమార్ సతీమణి అరుణ తెలంగాణ సీఐడీ విభాగానికి చేసిన ఫిర్యాదు, అక్కడ నమోదైన ఎఫ్‌ఐఆర్‌కు సంబంధించి ఏం చర్యలు తీసుకున్నారో తెలియజేయాలంటూ నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు కేంద్ర హోంశాఖకు ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన కేంద్ర హోంశాఖ ఏపీ ప్రభుత్వానికి లేఖ రాసింది. కేంద్ర హోంశాఖ కార్యదర్శి నుంచి వచ్చిన లేఖను రాష్ట్ర సాధారణ పరిపాలన శాఖ కార్యదర్శి రేవు ముత్యాలరాజు.. డీజీపీ గౌతమ్ సవాంగ్‌కు పంపించారు. ఈ వ్యవహారంలో నిబంధనల మేరకు తగిన చర్యలు తీసుకోవాలంటూ సాధారణ పరిపాలన శాఖ కార్యదర్శి డీజీపీకి సూచించారు.
గతంలో కేంద్ర హోంశాఖ నుంచి వచ్చిన లేఖలు.. వాటికి జత చేస్తూ వచ్చిన ఫిర్యాదు లేఖలపై ఇప్పటి వరకూ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. కేంద్ర హోంశాఖ నుంచి ఒత్తిడి వస్తుండటంతో.. ప్రభుత్వం ఫైల్‌ను ముందుకు కదిలించక తప్పని పరిస్థితి వచ్చింది. సునీల్‌కుమార్ ఎంతగా తమకు కావలసిన అధికారి అయినప్పటికినీ.. కేంద్రం కన్నెర్ర చేయడంతో తదుపరి చర్యలు తప్పవంటున్నారు. అందుకే, సునీల్‌పై చర్యల విషయంలో వెంటనే నిర్ణయం తీసుకోవాలంటూ ఫైల్‌ను డీజీపీకి పంపించారు.
ఆరోపణలు ఎదుర్కొంటున్న సునీల్‌కుమార్ కీలకమైన సీఐడీ చీఫ్ బాధ్యతల్లో ఉండటానికి వీల్లేదంటున్నారు. కేసు దర్యాప్తు పూర్తయి.. సచ్చీలుడుగా నిరూపించబడితేనే.. కీలక పోస్టులో ఉండటానికి అర్హుడు. అయితే, ఆయనకు ప్రభుత్వ పెద్దల ఆశీస్సులు పుష్కలంగా ఉండటంతో సీఐడీ చీఫ్ హోదాలో జగన్‌కు నమ్మిన బంటుగా ఉన్నారు. ముఖ్యమంత్రిని ఇంప్రెస్ చేయడానికే.. రఘురామ అరెస్ట్, కస్టడీ విషయంలో విపరీతంగా స్పందించారని అంటారు. రఘురామ ఆరోపిస్తున్నట్టు.. ఆయనపై థర్డ్ డిగ్రీ ప్రయోగించినందుకు పాలకులు సునీల్‌కుమార్‌పై మరింత ప్రేమ ఒలకబోస్తున్నారు. అందుకే కాబోలు, కేంద్ర హోంశాఖకు ఫిర్యాదులు వెల్లువెత్తినా.. కేంద్రం సైతం సునీల్‌కుమార్‌పై తగు చర్యలు తీసుకోవాలని సూచించినా.. ఆయన్ను సీఐడీ చీఫ్ పోస్ట్ నుంచి కదపడం లేదు. సీఐడీ చీఫ్‌గా.. ప్రతిపక్షంపై కుట్రలు, కేసులు, ఆఖరికి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టే వారిపైనా వేధింపులకు పాల్పడుతూ.. విధి నిర్వహణలో అనేక ఆరోపణలు ఎదుర్కొంటున్న సునీల్‌కుమార్‌కు సర్కారు కొమ్ముకాస్తోందనే ఆరోపణలు ఉన్నాయి. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే.. డీజీపీ కంటే కూడా సీఐడీ చీఫే ఏపీలో ఎక్కువ పవర్‌ఫుల్ అనే విమర్శ కూడా ఉంది. ఇప్పుడు కేంద్రం ఒత్తిడి చేయడంతో.. సునీల్‌కుమార్‌పై చర్యలు తీసుకునే బాధ్యతను ప్రభుత్వం డీజీపీకి కట్టబెట్టడం ఆసక్తికరంగా మారింది. మరి, పోలీస్ బాస్.. సూపర్ బాస్‌గా చెలామని అవుతున్న సీఐడీ చీఫ్‌పై ఎలాంటి యాక్షన్ తీసుకుంటారో చూడాలి..