'అంధ'ప్రదేశ్.. 'అదానీ'ప్రదేశ్.. జగన్ చీకటి పాలన..
posted on Oct 11, 2021 @ 12:30PM
ఒకప్పుడు సన్‌రైజ్ స్టేట్. ఇప్పుడు డార్క్ స్టేట్. నవ్యాంధ్రప్రదేశ్ అంధకారం దిశగా దూసుకుపోతోంది. రాష్ట్రాన్ని తీవ్ర విద్యుత్ కొరత వేధిస్తోంది. బొగ్గు నిల్వలు నిండుకోవడమే ఇందుకు కారణమని ప్రభుత్వం చెబుతోంది. సీఎం జగన్ కమిషన్ల కక్కుర్తి వల్లే ఈ దుస్థితి అని ప్రతిపక్షం మండిపడుతోంది. ఎవరి వాదన ఎలా ఉన్నా.. అతిత్వరలోనే ఆంధ్రప్రదేశ్‌లో చీకట్లు కమ్ముకోనున్నాయని అంటున్నారు. ఇప్పటికే సాయంత్రం వేళలో ఏసీలు వాడొద్దంటూ విద్యుత్‌శాఖ అధికారులు ఇప్పటికే సూచించారు. పవర్ సిస్టమ్ మొత్తం కుప్పకూలనుందనే న్యూస్ ఏపీని షేక్ చేస్తోంది.
విద్యుత్ సమస్యలపై తాజాగా మాజీ కేంద్ర మంత్రి చింతా మోహన్ వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఆంధ్రప్రదేశ్ అంధకారంలోకి వెళ్లిందని.. అంధప్రదేశ్‌గా మారిందని అన్నారు, వచ్చే నెలలో అసలు ఏపీలో కరెంట్ కూడా ఉండదన్నారు. ఆంధ్రప్రదేశ్ అదానీప్రదేశ్‌గా మారిందని విమర్శించారు. ప్రతి ఆదివారం అదానీ తాడేపల్లి వచ్చి వెళ్తుంటారని చింతా మోహన్ ఆరోపించారు.
రాష్ట్రంలో విద్యు దుత్పత్తికి అవసరమైన బొగ్గు నిల్వలు లేవని.. ఆర్టీపీపీ, విజయవాడ థర్మల్ పవర్ స్టేషన్ వంటివి పనిచేసే స్థితుల్లో లేవంటూ ఇటీవల సీఎం జగన్ ప్రధాని మోదీకి రాసిన లేఖపై విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. ఏపీలోని థర్మల్ విద్యుదుత్పత్తి కేంద్రాల్ని మూసివేత దిశగా తీసుకెళ్లి, ప్రైవేట్ సంస్థల నుంచి విద్యుత్ కొనాలనే దుర్మార్గపు ఆలోచనలో ప్రభుత్వం ఉందని ఆరోపిస్తున్నాయి.
ఏపీలో బొగ్గు సరఫరా ఎందుకు లేకుండా పోయింది? ముందుచూపు లేకుండా బొగ్గు ఉత్పత్తి సంస్థలకు డబ్బు చెల్లించనందునే రాష్ట్రానికి ఈ దుస్థితి వచ్చిందనేది విపక్షం వాదన. హిందూజాలు, కృష్ణపట్నం పవర్ ధర్మల్ ప్లాంట్లు 6 నెలలుగా విద్యుదుత్పత్తి నిలిపేయడానికి కారణం ఈ ప్రభుత్వం కాదా? ఆయా సంస్థల నుంచి విద్యుత్ కొనకుండా, కమీషన్ల కోసం ప్రైవేట్ సంస్థల నుంచి అధిక ధరకు విద్యుత్ కొంటున్నారని ఇటీవల పీఏసీ ఛైర్మన్ పయ్యావుల కేశవ్ ఆరోపించారు. తాజాగా, కాంగ్రెస్ సీనియర్ నేత చింతా మోహన్ సైతం ఆంధ్రప్రదేశ్.. అంధప్రదేశ్, అదానీప్రదేశ్‌గా మారిందంటూ విమర్శించడం కలకలం రేపుతోంది.