వర్షాలు కురుస్తున్నా కోతలెందుకు? కమీషన్ల కోసమే విద్యుత్ సంక్షోభం!
posted on Oct 9, 2021 @ 8:39PM
ఏపీలో విస్తారంగా వర్షాలు కురిశాయి. రిజర్వాయర్లు నిండుగా కళకళ్లాడుతున్నాయి. అయినా, రాష్ట్రవ్యాప్తంగా విద్యుత్ కోతలు ప్రజల జీవితాల్లో చీకట్లు నింపుతున్నాయి. ఏపీలో ఈ స్థాయిలో కరెంట్ కష్టాలకు కారణమేంటో తెలుసా? చైనా, యూరప్‌లేనట. ఈ మాట అంటున్నది మరెవరో కాదు.. స్వయానా ముఖ్యమంత్రే ఈ విధంగా సెలవిచ్చారు. అది కూడా ప్రధాని మోదీకి లేఖ రాసి మరీ ఏపీ విద్యుత్ ఇబ్బందులను విదేశాలతో ముడిపెట్టారు. అందుకే, ప్రధాన ప్రతిపక్షం టీడీపీకి చిర్రెత్తుకొచ్చింది. ఏ విషయాన్నైనా లోతుగా విశ్లేషించి.. సమగ్ర సమాచారం అందించే.. టీడీపీ సీనియర్ నేత, పీఏసీ ఛైర్మన్ పయ్యావుల కేశవ్ రంగంలోకి దిగారు. ఏపీలో విద్యుత్ సంక్షోభానికి సీఎం జగనే కారణమని విరుచుకుపడ్డారు. ఇంతకీ పయ్యావుల ఏమన్నారంటే...
‘‘విద్యుత్ సంక్షోభంపై సీఎం జగన్ ప్రధానికి రాసిన లేఖలో చైనా, యూరప్‌తో ఏపీని పోలుస్తారా? విద్యుత్ విషయంలో పొరుగున ఉన్న తెలంగాణతో పోల్చుకోలేదు. తెలంగాణలో విద్యుత్ వ్యవస్థ మెరుగ్గా ఉంటే చైనా సమస్య జగన్‌కు ఎందుకు? విభజన నాటికి ఏపీ మిగులులో ఉంటే.. తెలంగాణ లోటులో ఉంది. విద్యుత్ విషయంలో ఇప్పుడు తెలంగాణ మెరుగ్గా ఉంది. వర్షాకాలంలో.. రిజర్వాయర్లు నిండిన సమయంలో విద్యుత్ కోతలా? ఆర్థిక రంగాన్ని సంక్షోభంలోకి నెట్టినట్లే విద్యుత్ వ్యవస్థను కుదేలు చేశారు. విద్యుత్ సంస్థల దివాళాకు కారణం ప్రభుత్వ కక్ష సాధింపే. ప్రధానికి లేఖ రాసి బాధ్యత నుంచి తప్పుకోవడం సరికాదు’’. అంటూ మండిపడ్డారు పయ్యావుల కేశవ్.
‘‘ రాష్ట్రంలో విద్యు దుత్పత్తికి అవసరమైన బొగ్గు నిల్వలు లేవని.. ఆర్టీపీపీ, విజయవాడ థర్మల్ పవర్ స్టేషన్ వంటివి పనిచేసే స్థితుల్లో లేవని లేఖలో రాసి, ప్రధానిని కాపాడమంటున్నారు. ప్రభుత్వ చేతగానితనం, ముందుచూపులేని తనానికి ప్రధాని ఎలా స్పందిస్తారు? రాష్ట్రంలోని థర్మల్ విద్యుదుత్పత్తి కేంద్రాల్ని మూసివేత దిశగా తీసుకెళ్లి, ప్రైవేట్ సంస్థల నుంచి విద్యుత్ కొనాలనే దుర్మార్గపు ఆలోచనలో ప్రభుత్వం ఉంది. రాష్ట్రంలో బొగ్గు సరఫరా ఎందుకు లేకుండా పోయింది? ముందుచూపు లేకుండా బొగ్గు ఉత్పత్తి సంస్థలకు డబ్బు చెల్లించనందునే రాష్ట్రానికి ఈ దుస్థితి వచ్చిందనేది నిజం కాదా? హిందూజాలు, కృష్ణపట్నం పవర్ ధర్మల్ ప్లాంట్లు 6 నెలలు గా విద్యుదుత్పత్తి నిలిపేయడానికి కారణం ఈ ప్రభుత్వం కాదా? ఆయా సంస్థల నుంచి విద్యుత్ కొనకుండా, కమీషన్ల కోసం ప్రైవేట్ సంస్థల నుంచి అధిక ధరకు విద్యుత్ కొంటున్నారు. రాష్ట్ర అవసరాల కోసం, రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టిన విద్యుదుత్పత్తి సంస్థలను నీరుగార్చేలా ప్రభుత్వ చర్యలున్నాయి’’. అని ప్రభుత్వ తీరుపై పయ్యావుల ఫైర్ అయ్యారు.
‘‘ట్రు అప్ పేరుతో ఛార్జీల భారాన్ని ప్రజలు భరించాలా? ప్రజలపై రూ.50 వేల కోట్ల అదనపు భారం ఎందుకు మోపుతున్నారు’’ అని పయ్యావుల ప్రశ్నించారు. డిస్ట్రిబ్యూషన్ కంపెనీలకు ప్రభుత్వం చెల్లించాల్సిన రూ.12వేల కోట్లు చెల్లించనందున దాదాపు రూ.20వేల కోట్ల వరకు ప్రభుత్వం బకాయి ఉంది. ప్రభుత్వం తన అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికి ఆ భారాన్ని కూడా ట్రూ అప్ ఛార్జీల పేరుతోప్రజలపైనే వేసింది’’ అంటూ జగన్‌రెడ్డి సర్కారును తన పరిజ్ఞానంతో, పూర్తి సమాచారంతో ఏకిపారేశారు పయ్యావుల కేశవ్.