ఏపీలో అరాచక పాలన.. మీకు పట్టదా మోడీజీ!
ఆంధ్రప్రదేశ్ లో పరిస్థితి ఏమిటో అందరికీ తెలిసిందే. రాష్ట్రంలో అరాచక పాలన సాగుతున్నా, అక్రమాలు జరుగుతున్న కేంద్ర ప్రభుత్వం ఎందుకు జోక్యం చేసుకోదు? రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రసాదించిన జీవించే హక్కు సహా ప్రాధమిక హక్కులు అన్నింటికీ భంగం వాటిల్లుతున్నా, ప్రభుత్వమే ప్రాధమిక హక్కులను కాలరాస్తున్నా కేంద్ర ప్రభుత్వం ఎందుకు కలగజేసుకోదు? పత్రికలపై దాడులు, ప్రసార మాధ్యమాల పై అధికార, అనధికార ఆంక్షలు, పాత్రికేయులపైనా భౌతిక దాడులు జరుగుతున్నా, కేంద్రం ఎందుకు నోరు తెరవదు? ఇదేమిటని ప్రశ్నించదు?
ప్రతిపక్ష తెలుగు దేశం పార్టీ కార్యాలయాలు, ప్రతిపక్ష నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సహా పార్టీ నాయకుల ఇళ్ళపై దాడులు జరుగుతున్నా? రాష్ట్రం డ్రగ్స్, గంజాయి, మాదక ద్రవ్యాలకు అంతర్జాతీయ అడ్డాగా మారుతున్నా?ప్రభుత్వమే ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ, అరాచక పాలన సాగిస్తున్నా, కేంద్రం ఎందుకు జోక్యంచేసుకోదు,ఎందుకు రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించిదు? ఎందుకు ఉలకదు,ఎందుకు పలకదు? ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్ ప్రజలు ప్రతి ఒక్కరినీ వేదిస్తున్న ప్రశ్నలు ఇవి.
నిజమే కావచ్చును, శాంతి భద్రతలు స్టేట్ సబ్జెక్టు అయితే కావచ్చును. కానీ, పరిస్థితి విషమించి, ప్రజల మాన ప్రాణాలకు రక్షణ లేని దుర్మార్గ పరిస్థితులు తలెత్తిన సమయంలోనూ, కేంద్రం కళ్ళు తెరవను అంటే, ఇక పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికి, సమాఖ్య స్ఫూర్తికి, కేంద్ర రాష్ట్ర సంబందాలకు, కేంద్ర విధులు, విశేష అధికారాలకు అర్థమేముంటుంది?ఇదీ రాష్ట్ర ప్రజలను వేదిస్తున్న సందేహం.
రాష్ట్రంలో పరిస్థితి ఎంత అద్వాన్నంగా వుందో అందరికీ తెలిసినా నాలుగు పదుల విశేష రాజకీయ, పరిపాలనా అనుభవం ఉన్న, ప్రతిపక్ష నేత నార చంద్రబాబు నాయుడు పరిస్థితిని ఎప్పటికప్పుడు, కేంద్రం దృష్టికి తీసుకువెళ్ళే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. అందులో భాగంగానే, ఇటీవల రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం సాగుతున్న దాడులను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తెచ్చేందుకే, 73 ఏళ్ల వయసులోనూ, మధుమేహం వంటి ఆరోగ్య సమస్యలు ఉన్నప్పటికీ వాటిని లెక్కచేయకుండా, 36 గంటల నిరాహరదీక్ష చేశారు. అంతకు ముందే, తెలుగు దేశం పార్టీ కార్యాలయాలపైన, నాయకుల ఇళ్లపైనా జరిగిన దాడులకు సంబందించిన సమాచారం మొత్తం ప్రధానికి, కేంద్ర హోమ్ మంత్రికి లేఖల ద్వారా ఫోన్ ద్వారా తెలియ చేశారు. అయినా ఆశించిన రీతిలో కేంద్ర నుంచి స్పందన లేదు.
రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించిన నేపధ్యంలో ఆర్టికల్ 356 ప్రయోగించ వలసిన అవసరాన్నివివరిస్తూ లేఖలు రాశారు. రాష్ట్రపతి పాలన విధించాలని కోరారు. అందుకూ అటు కేంద్రం నుంచి స్పందన లేదు. చివరి ప్రయత్నంగా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో తెలుగు దేశం పార్టీ ప్రతినిధి బృదం రాష్ట్ర పతి రామనాథ్ కోవింద్ ను కలిసి వినతి పత్రం సమర్పించింది. ఆంధ్రప్రదేశ్‌లో జగన్ ప్రభుత్వం ప్రేరేపిస్తున్న ఉగ్రవాదాన్ని అంతమొందించేందుకు రాష్ట్రపతి పాలన విధించాలని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు కోరారు.
రాష్ట్రంలో నెలకొన్న దారుణ పరిస్థితుల గురించి దాదాపు అరగంటకుపైగా ఆయనకు వివరించారు. ముఖ్యంగా నెల 19న రాజధాని అమరావతిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా పార్టీ కార్యాలయాలు, నేతలపై వరుసగా జరిగిన క్రూరమైన దాడుల విషయంలోనూ సీబీఐ దర్యాప్తు జరిపించాలని కోరారు. రాష్ట్రం మాదకద్రవ్యాలకు కేంద్రంగా మారిపోయిందని, ఈ ముఠాలకు సంబంధించిన క్రిమినల్ నెట్‌వర్క్‌ను వెలికిలాగేందుకు విచారణకు ఆదేశించాలని విజ్ఞప్తి చేశారు. అధికార వైసీపీతో ఉద్దేశపూర్వకంగా కుమ్మక్కై.. రాజ్యాంగపరమైన విధులను, బాధ్యతలను విస్మరిస్తున్న రాష్ట్ర డీజీపీని రీకాల్ చేయాల్సిందిగా కేంద్రాన్ని ఆదేశించాలని కోరారు. వీటితోపాటు పలు ఇతర అంశాలతో రాష్ట్రపతికి వినతిపత్రం సమర్పించారు.
గత రెండున్నరేళ్లలో జగన్ ప్రభుత్వ అరాచకాలను ప్రస్తావిస్తూ ‘స్టేట్ స్పాన్సర్డ్ టెర్రర్ ఇన్ ఏపీ’ పేరిట టీడీపీ రూపొందించిన పుస్తకాన్ని కూడా కోవింద్‌కు అందజేశారు. ఇదలా ఉంటే,రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచే రాష్ట్రంలో అరాచక పాలన మొదలైంది.జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తొలి రోజు కక్ష సాధింపు రాజకీయాలకు శ్రీకారం చుట్టారు. అప్పటినుంచే తెలుగు దేశం పార్టీ, చంద్రబాబు నాయుడు ఎప్పటికప్పుడు పరిస్థితిని కేంద్రానికి తెలియజేస్తూనే ఉన్నారు, అయినా, కేంద్రం పట్టించుకోలేదు. ఫలితంగా పరిస్థితి దినదిన ప్రవర్తమానంగా దిగజారి, ఈ స్థితికి చేరింది. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరిచే చంద్రబాబు నాయుడు అనుభవంతో చేసిన సూచనను పాటించి రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని ప్రజలు కోరుకుంటున్నారు. కేంద్రం పట్టించుకుంటుందా? ప్రజాగ్రహానికి గురవుతుందా ? బంతి కేంద్రం కోర్టులో ఉంది.