పాక్ తో భారత్ ఓటమికి కారణాలు ఇవే..!
posted on Oct 26, 2021 @ 3:30PM
టీట్వంటీ వరల్డ్ కప్ లో దాయాది పాకిస్తాన్ చేతిలో చిత్తుగా ఓడిపోయింది టీమిండియా. టెస్ట్ క్రికెట్ చాంపియన్ గా , అద్భుతమైన ఆటగాళ్లతో ఉన్న కోహ్లీసేన పూర్తి విశ్వాసంతోనే బరిలోకి దిగింది. అందరి అంచనాలు కూడా భారత్ వైపే ఉంది. వరల్డ్ కప్ లో గత రికార్డులు కూడా టీమిండియాకు అనుకూలంగా ఉన్నాయి. అయినా వరల్డ్ కప్ మ్యాచ్ లో ఊహించని ఫలితం వచ్చింది. పాకిస్తాన్ చేతిలో ఘోరపరాజయం పాలైంది భారత జట్టు.
కోహ్లీ సేన ఓటమితో యావత్ భారతావని నిర్ధాంతపోయింది. అది కూడా దారుణంగా ఓడిపోవడంతో అంతా షాకయ్యారు. ఆటలో గెలుపోటములు సహజమే అయినా మరీ ఇంత దారుణంగా 10 వికెట్ల తేడాతో ఓడిపోవడమే అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. మ్యాచ్ పై పెద్ద ఎత్తున పోస్ట్ మార్టమ్ జరుగుతోంది. పాకిస్థాన్ చేతిలో టీమ్‌ఇండియా ఓటమికి రకరకాల కారణాలు వినిపిస్తున్నాయి. ఇండియా మాజీ కెప్టెన్, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్ ఈ మ్యాచ్‌పై తన విశ్లేషణను పంచుకున్నాడు. ఫేస్‌బుక్‌లో ఓ వీడియో పోస్టు చేసిన సచిన్.. భారత్ ఓటమికి కారణాలు చెప్పుకొచ్చారు.
ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్ పూర్తి ఆధిపత్యం చెలాయించిందని చెప్పారు మాస్టర్. పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉన్నా భారత్ ఇంచుమించు 20-25 పరుగులు తక్కువ స్కోర్ సాధించిందని అభిప్రాయపడ్డాడు. ముఖ్యంగా షహీన్ అఫ్రిది విసిరిన అప్‌ఫ్రంట్ బంతులను ఎదుర్కొనే సమయంలో భారత ఓపెనర్లు రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ సరైన ఫుటవర్క్‌తో కనిపించలేదన్నాడు. పాక్ పేసర్ గంటకు 140కిమీ వేగంతో బంతులు విసురుతుంటే.. మన బ్యాట్స్‌మెన్ అందుకు తగ్గట్టు క్రీజులో లేరని చెప్పారు మాస్టర్. పాక్ జట్టు మాత్రం తమ బౌలర్లను కచ్చితమైన ప్రణాళికతో సమర్థవంతంగా వినియోగించుకుందని, ఒకరి తర్వాత ఒకరిని అవసరాలకు తగ్గట్టు బౌలింగ్ చేయించిందని సచిన్ వివరించాడు.
టీమిండియా చాలా రోజులుగా పాకిస్థాన్‌తో మ్యాచ్‌లు ఆడలేదని, దీంతో ఆ జట్టును అర్థం చేసుకోవడానికి కాస్త సమయం పడుతుందని సచిన్ చెప్పుకొచ్చాడు. ఈ క్రమంలోనే ఆదిలోనే మూడు వికెట్లు కోల్పోయిందని తెలిపారు. సూర్యకుమార్ రెండు షాట్లు బాగా ఆడినా ఎక్కువసేపు క్రీజులో నిలవలేకపోయాడన్నారు. అనంతరం కోహ్లీ, పంత్ భాగస్వామ్యం నిర్మించాలని చూసినా అవసరమైనంత ధాటిగా ఆడలేదని అభిప్రాయపడ్డారు. కీలక సమయాల్లో వికెట్లు కోల్పోవడం భారత్ అవకాశాలను దెబ్బ తీసిందన్నారు.
పాక్ లక్ష్య ఛేదనలో టీమ్‌ఇండియా ఆదిలోనే వికెట్లు తీయలేకపోయిందని సచిన్ చెప్పారు. అలా చేసిఉంటే పరిస్థితులు మరోలా ఉండేవని, దాంతో పాక్ బ్యాట్స్‌మెన్ ఒత్తిడిలోకి వెళ్లేవారని అంచనా వేశారు. భారత బ్యాటింగ్ సమయంలో పాకిస్థాన్ అదే చేసిందని టెండుక్లర్ స్పష్టం చేశారు. ఇక పాక్ ఓపెనర్లు రిజ్వాన్, బాబర్ మెల్లిగా స్ట్రైక్ రొటేట్ చేస్తూ టీమ్‌ఇండియాపై ఒత్తిడి తెచ్చారన్నాడు. తేలికైన బంతుల్ని బౌండరీలకు తరలిస్తూనే సింగిల్స్, డబుల్స్‌తో ఇన్నింగ్స్‌ను నిర్మించారని తెలిపాడు. అయితే, టీమ్‌ఇండియా కీలక సమయాల్లో ఒత్తిడి పెంచి పైచేయి సాధించే అవకాశాలు వచ్చినా వాటిని సద్వినియోగం చేసుకోలేకపోయిందని మాస్టర్ బ్లాస్టర్ చెప్పారు.
టీమ్‌ఇండియా ఓటములకు పలు కారణాలుగా కనిపిస్తున్నా పాకిస్థాన్‌ను సరైన రీతిలో ఎదుర్కోలేకపోవడమే కోహ్లీసేన చేసిన అతి పెద్ద తప్పుగా చెబుతున్నారు విశ్లేషకులు. ఆ జట్టు ఇటీవల ఎలా ఆడుతోంది.? అందులో కీలక ఆటగాళ్లు ఎవరు? బౌలర్లు ఎలా రాణిస్తున్నారు.? వారిని ఎలా ఎదుర్కోవాలి.? 2017లో నాటి పరిస్థితులే ఇప్పుడూ ఎదురైతే ఏం చేయాలి? మన బౌలర్లు ఎలా రాణించాలి? అనే విషయాలపై దృష్టి సారించలేదని స్పష్టంగా తెలుస్తోంది.