జపాన్ మిత్రవింద.. సామాన్యుడిని పెళ్లాడిన రాకుమారి..
posted on Oct 26, 2021 @ 5:09PM
ఆమె జపాన్ రాకుమారి. పేరు మకో. ఓ సామాన్యుడిని ప్రేమించింది. పెళ్లి కూడా చేసుకోవాలనుకుంది. కానీ, రాజ కుటుంబం నిబంధనలు కఠినంగా ఉన్నాయి. బయటి వారిని పెళ్లి చేసుకుంటే.. ఆమె రాచరికాన్ని వదులుకోవాల్సి ఉంటుంది. రాజభరణమూ కోల్పోవాల్సి ఉంటుంది. అయినా, ఆమె రాచరికం కంటే.. రాజభరణం కంటే.. ప్రేమే గొప్పదని భావించింది. ప్రియుడు కీ కొమురోను పెళ్లాడింది. మూడేళ్లుగా సాగుతున్న ఆ వివాహ వివాదం.. తాజాగా వారి వివాహబంధంతో సుఖాంతం అయింది. జపాన్‌లో ఆ పెళ్లి సంచలనంగా మారింది.
మకో - కిమురోల వివాహాన్ని టోక్యో ఇంపీరియల్ ప్యాలెస్ అధికారికంగా ధ్రువీకరించింది. పెళ్లి తర్వాత మకో రాజప్రసాదాన్ని వీడారు. ప్యాలెస్‌లో ఎలాంటి వేడుకలను నిర్వహించలేదు. సంప్రదాయం ప్రకారం వీడ్కోలు ప్రకటించారు.
జపాన్ చక్రవర్తి నరుహిటో తమ్ముడు అకిషినో కుమార్తె మకో. టోక్యో ఇంటర్నేషనల్ క్రిస్టియన్ యూనివర్శిటీలో చదువుకున్నారు. తనతో పాటు చదువుకునే కొమురోతో ప్రేమలో పడ్డారు. 2017లోనే వారి ప్రేమ విషయం బయటకు వచ్చింది. తాము ప్రేమపెళ్లి చేసుకోబోతున్నట్టు వారు అప్పుడే ప్రకటించారు. అయితే ఏడాది తిరిగే సరికి అనుకోని సమస్య వచ్చి పడింది. కొమురో తల్లి కారణంగా తలెత్తిన ఆర్థిక వివాదాలతో వారి పెళ్లి అప్పట్లో రద్దయ్యింది. దీంతో 2018లో కొమురో.. లా చదివేందుకు న్యూయార్క్ వెళ్లిపోయారు. మూడేళ్ల పాటు కొమురో యూఎస్‌లోనే ఉండిపోయారు. జపాన్‌కు ఒక్కసారి కూడా రాలేదు.
గత నెలలో చదువు పూర్తి చేసుకుని కొమురో జపాన్‌కి తిరిగొచ్చారు. మకో-కిమురోలు పెళ్లి ప్రతిపాదన మళ్లీ తీసుకొచ్చారు. అప్పట్లో తలెత్తిన ఆర్థిక వివాదంపై కొమురో లిఖితపూర్వక హామీ ఇవ్వడంతో.. వారి పెళ్లికి మకో కుటుంబం అంగీకారం తెలిపారు. ఎలాంటి హడావుడి లేకుండా చాలా సింపుల్‌గా మకో-కిమురోల వివాహం జరిపించేశారు. సంప్రదాయం ప్రకారం వేడుకలు నిర్వహించలేదు. వీరు పెళ్లిని ధృవీకరిస్తూ అధికారికంగా పత్రాలు మాత్రం విడుదల చేశారు.
జపాన్ రాజ కుటుంబ మహిళలు సామాన్యులను పెళ్లాడితే రాచరికాన్ని వదులుకోవాలనేది రూల్. ప్రేమ కోసం.. గాఢంగా ప్రేమించిన ప్రియుడి కోసం అందుకు సిద్ధమైన మకో.. రాజభరణం కింద తనకు వచ్చే రూ.10 కోట్లను వదులుకొని మరీ.. కిమురోను వివాహం చేసుకున్నారు. పెళ్లి తర్వాత రాజమందిరం వీడుతూ భావోద్రేగానికి లోనయ్యారు. మగధీర మూవీలో మరుజన్మ ఎత్తి మరీ ప్రేమను సొంతం చేసుకున్న మిత్రవిందలా కాకుండా.. మకో రాచరికాన్ని త్యజించి మరీ తన ప్రేమను సాధించుకోవడం.. ప్రియుడిని పెళ్లి చేసుకోవడం.. కాస్త సినిమాటిక్‌గా ఉన్నా.. వారిది చరిత్రలో నిలిచే వివాహబంధం.