మ‌హేశ్వ‌రంలో షర్మిల పాదయాత్ర.. స్థానికుల‌తో మాట-ముచ్చ‌ట‌..

వైఎస్సార్‌టీపీ అధినేత్రి ష‌ర్మిల వ‌డివ‌డిగా అడుగులు వేస్తున్నారు. సుదీర్ఘ ల‌క్ష్యంతో ప్ర‌జా ప్ర‌స్థానం పాద‌యాత్ర కొన‌సాగిస్తున్నారు. అచ్చం తండ్రి వైఎస్సార్ అడుగుజాడ‌ల్లోనే న‌డుస్తున్నారు. ఆయ‌న‌లానే చేవెళ్ల‌లో పాద‌యాత్ర ప్రారంభించిన ష‌ర్మిల‌.. 6 రోజులుగా పాద‌యాత్ర చేస్తున్నారు.  వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు షర్మిల చేపట్టిన ప్రజా ప్రస్థానం పాదయాత్ర సోమవారం ఆరవ రోజుకు చేరుకుంది. ఇవాళ మహేశ్వరం నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో పాదయాత్ర చేస్తున్నారు. సాయంత్రం లేమురు ద‌గ్గ‌ర‌ షర్మిల ‘మాట ముచ్చట’ కార్యక్రమం నిర్వహిస్తారు.  ష‌ర్మిల పాద‌యాత్ర‌కు అన్ని వ‌ర్గాల ఉంచి మంచి మ‌ద్ద‌తు ల‌భిస్తోంది. అచ్చం తండ్రిలానే పేద‌ల‌ను ఆప్యాయంగా ద‌గ్గ‌ర‌కు తీసుకుంటున్నారు. వారి క‌ష్ట‌సుఖాలు అడిగి తెలుసుకుంటున్నారు. మ‌రో ఆస‌క్తిక‌ర విష‌యం ఏంటంటే.. శ్రీలంకకు చెందిన వైఎస్ అభిమానులు షర్మిలను కలిసి పాదయాత్రకి మద్దతు తెలిపారు. తండ్రి అడుగుజాడ‌ల్లోనే న‌డుస్తున్నారంటూ కొనియాడారు.   

వాలంటీర్ హ‌త్యాచార‌య‌త్నం.. ఏపీలో క‌ల‌క‌లం..

ఏపీలో వాలంటీర్ల ఆగ‌డాలు హ‌ద్దు మీరుతున్నాయి. అధికార పార్టీ అండ‌తో రెచ్చిపోతున్నారు. విచ్చ‌ల‌విడిగా అరాచ‌కాల‌కు పాల్ప‌డుతున్నారు. బెదిరింపులు, దౌర్జ‌న్యాలు, అక్ర‌మాల‌తో పాటు తాజాగా హ‌త్యాచార‌య‌త్నానికీ పాల్ప‌డ‌టం క‌ల‌క‌లం రేపుతోంది. అస‌లు ఈ వాలంటీర్ల వ్య‌వ‌స్థ అవ‌స‌ర‌మా? అనే చ‌ర్చ మ‌రింత జోరందుకుంది. ఎన్ని విమ‌ర్శ‌లు వ‌స్తున్నా.. వాలంటీర్ల వ‌క్ర‌బుద్ధి మాత్రం మార‌డం లేదని ప్ర‌జ‌లు మండిప‌డుతున్నారు. తాజాగా, గుంటూరు జిల్లా మాచవరం మండలం, పిల్లుట్ల గ్రామంలో ఓ వివాహితపై వాలంటీర్ అఘాయిత్యం చేయ‌బోయాడు. ఒంటరిగా ఉన్న బాలింతను కామ-వాంఛ తీర్చాలంటూ వాలంటీర్ అసభ్యంగా ప్రవర్తించాడు. ఇంట్లోకి ప్రవేశించి ఆమెను బలవంతం చేయబోయాడు. భయపడిపోయ‌న ఆ మహిళ బయటకు పరుగులు తీసింది.  అంత‌టితో ఆగ‌లేదు ఆ వాలంటీర్ దాష్టీకం. ఈ విష‌యం ఎవరికైనా చెబితే ఊళ్లో తిరగలేవంటూ ఆ మ‌హిళ‌ను బెదిరించాడు. విష‌యం ఇంట్లో వాళ్ల‌కి చెప్పి పోలీసులకు ఫిర్యాదు చేసింది ఆ బాధితురాలు. వాలంటీర్‌పై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 

బ్రేకింగ్ న్యూస్‌.. కారు యాక్సిడెంట్‌.. ఏసీపీ ఫ్యామిలీ మెంబ‌ర్స్ దుర్మ‌ర‌ణం

ఆయ‌న హైద‌రాబాద్ సైబ‌ర్ క్రైమ్ ఏసీపీ. పేరు కేవీఎం ప్ర‌సాద్‌. డ్యూటీలో నిత్యం బిజీగా ఉంటారు. సోమ‌వారం ఉద‌యం స‌డెన్‌గా ఆయ‌న ఫోన్ రింగ్ అయింది. ఏదో డిపార్ట్‌మెంట్ కాల్ అయి ఉంటుంద‌ని చాలా క్యాజువ‌ల్‌గా కాల్ లిఫ్ట్ చేశారు. మేట‌ర్ విని ఒక్క‌సారిగా షాక్‌కు గుర‌య్యారు. తాను స్వ‌యంగా ఏసీపీ అయి ఉండికూడా.. ఆ న్యూస్ విని నిలువునా కుప్ప‌కూలిపోయారు. క‌న్నీటి ప‌ర్యంత మ‌య్యారు. ఇంత‌కీ ఏం జ‌రిగిందంటే....  మేడ్చల్‌ జిల్లా కీసర మండలం యాద్గార్‌పల్లి ఔటర్‌ రింగ్‌రోడ్డు ద‌గ్గ‌ర‌ ప్రమాదం జరిగింది. హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ ఏసీపీ కేవీఎం ప్రసాద్‌ కుటుంబ సభ్యులు ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఏసీపీ కుటుంబ సభ్యులు ముగ్గురు మృతి చెందగా.. ఒకరికి గాయాలయ్యాయి.  మృతుల్లో ఏసీపీ సతీమణి శంకరమ్మతో పాటు ఆయన సోదరుడి కుమారుడు భాస్కర్‌ దంపతులు ఉన్నారు. ఏసీపీ సోదరుడు బాలకృష్ణకు గాయాలు అవ‌డంతో ఆయన్ను ఆస్పత్రికి తరలించారు. ప్రకాశం జిల్లా చీరాలలో ఓ వివాహ వేడుకకు హాజ‌రై.. హైద‌రాబాద్‌కు తిరిగి వ‌స్తుండ‌గా ఈ ప్రమాదం జరిగింది. ఏసీపీ కేవీఎం ప్ర‌సాద్ ఇంట్లో తీవ్ర విషాధం నెల‌కొంది.  

నియోజక వర్గాల సంఖ్య డ‌బుల్ కానున్నాయా?.. అమిత్‌షా సిగ్న‌ల్ ఇచ్చేశారా?

ఉభయ తెలుగు రాష్ట్రాలలో అసెంబ్లీ, లోక్ సభ నియోజక వర్గాల పునర్విభజన అంశం మరో మారు చర్చకు వచ్చింది. జమ్మూ కశ్మీర్’ పర్యటనలో భాగంగా కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా ఇటీవ‌ల శ్రీనగర్ బహిరంగ సభలో జమ్మూ కశ్మీర్’లో   నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ సాగుతోందని, అది పూర్తయిన వెంటనే ఎన్నికలు నిర్వహిస్తామని ప్రకటించారు. అమిత్ షా అలా ప్రకటన చేశారో లేదో ఇలా, తెలంగాణ రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు, మాజీ ఎంపీ, బోయినపల్లి వినోద్ కుమార్ ఆ చేత్తోనే మా సంగతి చూడండి అంటూ తెలుగు రాష్ట్రాలలో అసెంబ్లీ, లోక్ సభ స్థానాల పునర్విభజన అంశాన్ని మరో మారు తెరమీదకు తెచ్చారు. జమ్మూ కశ్మీర్’తో పాటుగానే ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనూ అసెంబ్లీ స్థానాల పునర్విభజన ప్రక్రియ ప్రారంభించాలని  అన్నారు. రాష్ట్ర విభజన చట్టంలో పొందుపరిచిన విధంగా తెలుగు రాష్ట్రాలలో అసెంబ్లీ సీట్లను పెంచాలని, అందుకోసంగా జమ్మూకశ్మీర్’తో పాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోనూ నియోజకవర్గాల పునర్విభజన జరపాలని వినోద్ కుమార్ కేంద్రాన్ని డిమాండ్ చేశారు.   అదలా ఉంటే, ముందునుంచి కూడా  ఉభయ తెలుగు రాష్ట్రాలకు సంబంధించి, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టం 2014 (రాష్ట్ర విభజన చట్టం) దేశంలో నియోజక వర్గాల పునః విభజన ప్రక్రియతో సంబంధం లేకుండా తెలుగు రాష్ట్రాలలో నియోజక వర్గాల పునర్విభజనకు అవకాశం కల్పించిందనే అభిప్రాయాన్ని తెరాస సహా ఇతర పార్టీలు వ్యక్త పరుస్తున్నాయి. ఆ ప్రకారంగా  ఆంధ్ర ప్రదేశ్’లో ప్రస్తుతమున్న 175 అసెంబ్లీ నియోజక వర్గాలను 225కు తెలంగాణలో ప్రస్తుతమున్న 119 అసెంబ్లీ నియోజక వర్గాలను 153కు పెంచుకోవచ్చని విభజన చట్టం సూచించిందని, రాజకీయ పార్టీలు భావిస్తున్నాయి. ఈ నేపధ్యంలోనే ఉభయ తెలుగు రాష్ట్రాలలో నియోజక వర్గాల పునర్విభజన అంశం తరచు చర్చకు వస్తోంది. అయితే, విభజన చట్టం సీట్ల సంఖ్యను ఎంత వరకు పెంచుకోవచ్చో సూచించిందే, కానీ, ఎప్పటిలోగా అనే విషయంలో స్పష్టంగా చెప్పలేదని, కేంద్ర ప్రభుత్వ వర్గాలు తమ భాష్యం తాము వినిపిస్తున్నాయి.  అయితే, ఈ అంశం తెర మీదకు రావడం, మీడియాలో చర్చలు జరగడం ఇదే తొలిసారి కాదు. కొద్ది నెలల క్రితం  జమ్మూ కశ్మీర్’కు  రాష్ట్ర హోదా పునరుద్ధరణలో భాగంగా నియోజక వర్గాల పునర్విభజన ప్రక్రియకు కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇందుకు సంబదించి ప్రదాని మోడీ లోక్ సభలో ప్రకటన చేశారు.  తెలుగు రాష్ట్రాలలో తేనే తుట్టె కదిలింది, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్తీకరణ చట్టం 2014 లో  పొందుపరిచిన విధంగా, ఉభయ రాష్ట్రాలలో అసెంబ్లీ, లోక్ సభ స్థానాల సంఖ్యను పెంచాలని పార్లమెంట్ లోపల, వెలుపల కూడా చర్చ జరిగింది. ఇప్పటిలానే అప్పుడు కూడా వినోద్ కుమార్ ఇదే డిమాండ్ చేశారు. కేంద్రం పట్టించుకోలేదు. కానీ, తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఇదే అంశానికి సంబంధించి లోక్ సభలో వేసిన  ప్రశ్నకు కేంద్ర హోమ్ శాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్, ఉభయ తెలుగు రాష్టలలోనూ 2026 తర్వాతనే నియోజక వర్గాల పునర్విభజన ఉంటుందని, అంతవరకు ప్రస్తుత స్థితే యథాతథంగా కొనసాగుతుందని లిఖిత పూర్వకంగా ఇచ్చిన సమాధానంలో స్పష్టం చేశారు. అంతే కాకుండా రాష్ట్ర విభజన చట్టం సూచించిన విధంగా నియోజక వర్గాల పునర్విభజన చేపట్టాలంటే, రాజ్యాంగ సవరణ అవసరం అవుతుందని గతంలో చెప్పిన  విషయాన్నే కేంద్ర మంత్రి  మరోమారు స్పష్టం చేశారు. కాబట్టి, 2023లో జరిగే తెలంగాణ శాసన సభ ఎన్నికల నాటికి లేదా 2024లో సార్వత్రిక ఎన్నికల నాటికి తెలుగు రాష్ట్రాలలో అసెంబ్లీ, లోక్ సభ స్థానాల సంఖ్య పెరిగే అవకాశం లేదని, రాజకీయ పార్టీలు కూడా ఒక నిర్ణయానికి వచ్చాయి. అయితే, రాజకీయ పార్టీలు, ముఖ్యంగా తెరాస దీన్నొక రాజకీయ అస్త్రంగా ఉపయోగించుకుంటూనే ఉంటాయి.  అదలా ఉంటే, దేశవ్యాప్తంగా అసెంబ్లీ. లోక్ సభ స్థానాల పునర్విభజన  సంబంధించి కేంద్ర ప్రభుత్వం కొంత కసరత్తు చేసిందని కొద్ది నెలల క్రితం కాంగ్రెస్ పార్టీ సీనియర్ ఎంపీ మనీష్ తివారి  ట్వీట్ చేశారు. ఈ ట్వీట్’ దేశ వ్యాప్తంగా చర్చకు దారి తీసింది. మనీష్ తివారీ  ట్వీట్  ప్రకారం  ప్రస్తుతం 543 ఉన్న లోక్ సభ స్థానల సంఖ్య రెట్టింపు గీతను కూడా దాటి ఏకంగా 1200 ప్లస్ సంఖ్యకు చేరుకుంటుంది. అలాగే, ఉభయ తెలుగు రాష్ట్రాలలో కూడా లోక్ సభ స్థానాల సంఖ్య రెట్టింపు గీతను దాటేస్తుంది. ఆంధ్ర ప్రదేశ్’లో ప్రస్తుతమున్న 25 స్థానాలు 52, తెలంగాణలో ప్రస్తుతమున్న 17 స్థానాలు 39కి చేరుకుంటాయి. అయితే, 2026లో చేపట్టే నియోజక వర్గాల పునర్విభజన కసరత్తులో భాగంగా  కేంద్ర హోమ్ శాఖ సిద్దం చేసిన  బ్యాక్ పేపర్స్ ఆధారంగా మనీష్ తివారీ ట్వీట్ చేశారని, ప్రస్తుత కొవిడ్ పరిస్థితుల్లో 2026లోనూ నియోజక వర్గాల పునర్వ్యవస్థీకరణ ఉండక పోవచ్చని అధికార వర్గాల సమాచారం. కొవిడ్ కారణంగా 2021లో జరగవలసిన జనగణన జరగలేదు.ఆ కారణంగా నియోజక వర్గాల పునర్విభజన ఇంకొంత ఆలస్యం అయినా అవుతుందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి.    ఏది ఏమైనా ప్రస్తుత పరిస్థితులు, రాజకీయ సమీకరణలను పరిగణనలోకి తీసుకుంటే  కారణాలు ఏవైనా, అవి సహేతుకం అయినా కాకున్నా, ఇప్పట్లో తెలుగు రాష్ట్రాలలో అసెంబ్లీ, లోక సభ స్థానాల సంఖ్య పెరగదు. తెలంగాణ, ఏపీ అసెంబ్లీలలో వరసగా 119, 175, లోక్ సభలో ఏపీకి 25, టీఎస్ 17...అంతే, మరో ఎన్నిక వరకు సీట్ల సంఖ్యఇంతే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.  

ప్లీన‌రీ పాసుల కోసం గులాబీ లొల్లి.. న‌గ‌ర‌మా? ఫ్లెక్సీల మ‌య‌మా?

సామాన్యులకో రూల్‌.. అధికార పార్టీకి మ‌రో రూలా? హైద‌రాబాద్‌లో ఇంటి గేటుకు టు-లెట్ బోర్డు పెడితినే ఫైన్లు వేస్తూ జీహెచ్ఎమ్‌సీ అధికారులు ఓవ‌రాక్ష‌న్ చేస్తున్నారు. అదే టీఆర్ఎస్ పార్టీ మాత్రం న‌గ‌ర‌మంతా ఫ్లెక్సీల‌తో, కేసీఆర్ క‌టౌట్ల‌తో, గులాబీ జెండాల‌తో నింపేస్తే ప‌ట్టించుకోరా? హైకోర్టు అంత సీరియ‌స్‌గా చెప్పినా.. రూల్స్ ఫ‌క్కాగా ఉన్న ప్ర‌భుత్వ పార్టీకి పాల‌నా యంత్రాంగం మ‌రీ ఇంత‌లా కొమ్ముకాయ‌డమేంటి? ఒక‌టా..రెండా.. హైద‌రాబాద్ మొత్తం.. ఏ ఏరియాలో చూసినా.. ఏ గ‌ల్లీకి వెళ్లినా.. గులాబీ మ‌య‌మే. ఇంత‌లా ఓపెన్‌గా ఫ్లెక్సీలు, జెండాలు క‌నిపిస్తున్నా.. బ‌ల్దియా సిబ్బంది ఇప్ప‌టి వ‌ర‌కూ వాటిని ట‌చ్ చేయ‌క‌పోవ‌డం.. వారిపై ఎలాంటి చ‌ర్య‌లు తీసుకోక‌పోవ‌డం దారుణం. ప్లీన‌రీ మొత్తం ముగిసాక‌.. ప‌ని అయిపోయాక‌.. తీరిగ్గా రేపో ఎల్లుండో తీసేస్తారు కాబోలు. ఏదో నామిన‌ల్‌గా ల‌క్షో, ప‌ది ల‌క్ష‌లో ఫైన్ వేసి.. చ‌ర్య‌లు తీసుకున్నామ‌ని క‌వ‌రింగ్ ఇస్తారు కాబోలు. అద‌లా ఉంటే.... ఇక‌.. గులాబీ పండుగకు సర్వం సిద్ధమైంది. హైదరాబాద్‌లోని హైటెక్స్‌ వేదికగా జరగనున్న టీఆర్‌ఎస్‌ ప్లీనరీకి ఏర్పాట్లు పూర్తయ్యాయి. మూడేళ్ల తర్వాత ప్లీనరీ నిర్వహిస్తుండ‌టంతో టీఆర్‌ఎస్‌ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. అయితే, ఈసారి ప్లీనరీ నేపథ్యంలో పరిమిత సంఖ్యలో పాస్‌లు ఇవ్వడం.. కేవ‌లం 6 వేల మందికి మాత్ర‌మే ఆహ్వానాలు పంప‌డంతో గులాబీ కార్య‌క‌ర్తలు గొడ‌వ‌కు దిగుతున్నారు. మాకంటే మాకు పాసులు కావాలంటూ లోక‌ల్ లీడ‌ర్ల‌పై తీవ్ర ఒత్తిడి పెంచుతున్నారు. ఈ ప‌రిణౄమం  ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకులకు తలనొప్పిగా మారింది. పాస్‌ల కోసం ముఖ్య కార్యకర్తలు పోటీపడడంతో ఎవరికి ఇవ్వాలో తెలియక ఇబ్బందులు పడ్డారు.  ఇక కేసీఆర్ దావ‌త్ ఇస్తే ఎట్టా ఉంటాదో తెలియాలంటే టీఆర్ఎస్ ప్లీన‌రీకి వెళ్లాల్సిందే. ప్లీనరీకి వచ్చే ప్రతినిధుల కోసం 9 రకాల నాన్‌ వెజ్‌ ఐటమ్స్‌ సహా మొత్తం 33 రకాల వంటకాలు రెడీ చేశారు. మ‌ధ్యాహ్నం కాగానే లొట్ట‌లేసుకుంటూ తిన‌డ‌మే త‌రువాయి. ఇక సైబరాబాద్‌ సీపీ స్టీఫెన్‌ రవీంద్ర ఆధ్వ‌ర్యంలో 2,200మంది సిబ్బందితో గ‌ట్టి పోలీస్ బందోబ‌స్తు ఏర్పాటైంది. ప్లీనరీకి భారీ సంఖ్యలో వాహనాలు రానున్న నేపథ్యంలో హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ ఆంక్షలు అమలు చేయనున్నారు. 

ఢిల్లీలో చంద్రబాబు... వైసీపీలో గుబులు! నిఘా కోసం ప్రత్యేక బృందాలు...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ సర్కార్ అరాచక పాలన సాగిస్తోందని ఆరోపిస్తున్న తెలుగు దేశం పార్టీ దేశ రాజధానిలో పోరాటం చేయబోతోంది. జగన్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక, నిరంకుశ పాలనపై కేంద్రం పెద్దలకు ఫిర్యాదు చేయబోతోంది. టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలోని ఆ పార్టీ బృందం రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతితో పాటు కేంద్రం పెద్దలను కలవబోతోంది. తెలుగు దేశం పార్టీ నేతలు  ఢిల్లీకి చేరుకున్నారు. సోమవారం ఉదయం టీడీపీ అధినేత చంద్రబాబు హైదరాబాద్ నుంచి ఢిల్లీ వచ్చారు.  సోమవారం మధ్యాహ్నం 12 గంటల 45 నిమిషాలకు భారత రాష్ట్రపతితో చంద్రబాబు ఆధ్వర్యంలో ఐదుగురు సభ్యుల టీడీపీ బృందం కలవబోతోంది. రాష్ట్రప‌తిని క‌ల‌వ‌నున్న చంద్రబాబు.. ఏపీలో నెల‌కొన్న ప‌రిస్థితులు, వైసీపీ అమ‌లు చేస్తున్న అరాచ‌క పాల‌న‌, టీడీపీ కార్యాల‌యాల‌పై దాడులు, ఇష్టారాజ్యంగా టీడీపీ నేత‌ల‌ను అరెస్ట్ చేస్తున్న తీరు.. త‌దిత‌రాల‌ను రామ్ నాథ్ కోవింద్‌కు వివ‌రించ‌నున్నారు. అంతేకాకుండా ఆయా ఘ‌ట‌న‌ల‌కు సంబంధించి చంద్ర‌బాబు ఆధారాల‌ను కూడా అందించ‌నున్నారు. అరాచ‌క పాల‌న నుంచి ఏపీ ప్ర‌జ‌ల‌ను ర‌క్షించేందుకు త‌క్ష‌ణ‌మే రాష్ట్రంలో రాష్ట్రప‌తి పాల‌న‌ను అమ‌లు చేయాల‌ని కూడా చంద్ర‌బాబు కోర‌నున్నారు.ఏపీలో మాదకద్రవ్యాలు , వైసీపీ దాడులపై ఫిర్యాదు చేయనుంది.   రెండున్నర సంవత్సరాల తరువాత చంద్రబాబు హస్తినకు వెళుతున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, హోంమంత్రితో పాటు మరికొందరిని కూడా కలిసే అవకాశం ఉంది. రెండు రోజులపాటు  చంద్రబాబు బృందం ఢిల్లీలోనే మకాం వేయనున్నారు. ఏపీలో రాజ్యాంగ వ్యవస్థలు విధ్వంసంపై ఢిల్లీలో నేతలకు బృందం సభ్యులు వివరించనున్నారు. టీడీపీ నేతలపై దాడులు, పార్టీ కార్యాలయాల విధ్వంసం, అక్రమ కేసులు వంటి అంశాలను  టీడీపీ బృందం కేంద్ర పెద్ద దృష్టికి తీసుకెళ్లనున్నారు. ఏపీలో ఆర్టికల్ 356 ప్రయోగించాల్సిన పరిస్థితులు నెలకొన్నాయని టీడీపీ నేతలు చెబుతున్నారు. సాధార‌ణంగా ఓ పార్టీ అధినేత హ‌స్తిన ప‌ర్య‌ట‌న‌కు వెళుతుంటే.. ఇత‌ర పార్టీలు ఆస‌క్తిగా గ‌మ‌నిస్తూ ఉంటాయి. ఢిల్లీ వెళ్లిన నేత ఎవ‌రెవ‌రిని క‌లుస్తున్నారు? ఏమేం చేస్తున్నారు? అన్న విష‌యాల‌పై వివ‌రాలు సేక‌రిస్తూ ఉంటాయి. విప‌క్షంలో ఉన్న పార్టీ నేత‌లు ఇలా ఢిల్లీకి వెళితే.. అధికారంలోని పార్టీలు అంత‌గా ప‌ట్టించుకోవు. అయితే ఏపీలో ప‌రిస్థితి అలా లేద‌నే చెప్పాలి. విప‌క్ష నేత‌గా ఉన్న చంద్రబాబు ఢిల్లీ వెళుతున్నారంటేనే.. వైసీపీలో ఇప్ప‌టికే పెను అల‌జ‌డి రేగింది. చంద్ర‌బాబుకు జాతీయ స్థాయిలో మంచి పలుకుబడి ఉండటమే వాళ్లకు నిద్రలేకుండా చేస్తోంది. ఏపీలో పరిస్థితులు కూడా గందరగోళంగా ఉండటంతో ఎక్కడ తమకు ఎసరు వస్తుందోనన్న ఆందోళన జగన్ రెడ్డిలో కనిపిస్తుందని తెలుస్తోంది. ఢిల్లీ పర్య‌ట‌న‌లో చంద్ర‌బాబు ఎక్క‌డ బీజేపీ నేత‌ల‌ను క‌లుస్తారో, ఎక్క‌డ టీడీపీ, బీజేపీల మ‌ధ్య కొత్త పొత్తు పొడుస్తుందోన‌న్న భ‌యం వైసీపీలో నెల‌కొంది.  ఇలా జ‌ర‌గ‌కుండా ఉండాలంటే.. తాను సైలెంట్‌గా ఉంటే కుద‌ర‌దు క‌దా అనుకుందో, ఏమో తెలియ‌దు గానీ.. వైసీపీ అప్పుడే రంగంలోకి దిగిపోయింది. చంద్ర‌బాబు ఎవ‌రెవ‌రి అపాయింట్‌మెంట్లు కోరుతున్నార‌న్న విష‌యాన్ని ప‌సిగ‌డుతూ ఆయా నేత‌ల కార్యాల‌యాల‌కు త‌న పార్టీ ఎంపీల‌ను పంపుతూ చంద్ర‌బాబుకు ఆయా నేత‌ల‌ అపాయింట్ మెంట్లు ద‌క్క‌కుండా వ్యూహాన్ని అమ‌లు చేస్తోంద‌ట‌. ఇందుకు సంబంధించి వైసీపీ కీల‌క నేత‌ల‌తో పాటు ఇటీవ‌లే ఏపీ ప్ర‌భుత్వ ముఖ్య స‌ల‌హాదారుగా నియ‌మితులైన ఓ కీల‌క రిటైర్డ్ ఐఏఎస్ సేవ‌ల‌ను కూడా జ‌గ‌న్ స‌ర్కారు వినియోగిస్తోంద‌ట‌. చంద్రబాబు ఏం చేస్తున్నారు, ఎవరెవరిని కలుస్తున్నారు.. వాళ్ల నుంచి ఆయనకు ఎలాంటి స్పందన వస్తుందన్న వివరాలను కూడా సేకరించేందుకు ప్రత్యేక బృందాలను వైసీపీ రంగంలోకి దింపిందని అంటున్నారు.  ఏపీ సీఎం జ‌గ‌న్ తీరును నిర‌సిస్తూ టీడీపీ జాతీయ అధికార ప్ర‌తినిధి కొమ్మారెడ్డి ప‌ట్టాభిరామ్ ఆవేశ‌పూరిత వ్యాఖ్య‌లు చేయ‌డం, వాటికి బ‌దులుగా వైసీపీ శ్రేణులు టీడీపీ కేంద్ర కార్యాల‌యంతో పాటుగా ప‌లు జిల్లాల్లోని ఆ పార్టీ కార్యాల‌యాల‌పైనా, కీల‌క నేత‌ల‌పైనా దాడుల‌కు తెగ‌బ‌డ‌టం తెలిసిందే. ఈ దాడుల‌ను నిరసిస్తూ టీడీపీ జాతీయ అధ్య‌క్షుడు నారా చంద్ర‌బాబునాయుడు 36 గంట‌ల దీక్ష‌కు దిగితే.. ఆ దీక్ష‌కు వ్య‌తిరేకంగా వైసీపీ జ‌నాగ్ర‌హ దీక్ష‌ల‌కు తెర తీయ‌డం.. టీడీపీ నేత‌ల‌పై వైసీపీ నేత‌లు ప‌రుష ప‌ద‌జాలంతో విరుచుకుప‌డ‌టం, వైసీపీ నేత‌ల వ్యాఖ్య‌ల‌పై టీడీపీ నేత‌ల ఎదురు దాడి.. వెర‌సి ఏపీలో ఈ వారమంతా ఉద్రిత్త‌తో కూడిన ప‌రిస్థితులే నెల‌కొన్నాయి. ఏపీలో జ‌గ‌న్ పాల‌న మొద‌ల‌య్యాక అరాచ‌కం రాజ్య‌మేలుతోంద‌ని, మంగ‌ళ‌వారం నాటి దాడులు, ఆ త‌ర్వాతి ప‌రిణామాలే ఇందుకు నిద‌ర్శ‌న‌మ‌ని చంద్రబాబు విమ‌ర్శించారు.  ఏపీలో రాష్ట్రప‌తి పాల‌న అమ‌లు చేయాల‌ని కూడా ఆయ‌న డిమాండ్ చేశారు. ఇదే డిమాండ్‌తో చంద్ర‌బాబు ఢిల్లీకి వెళ్లారు. 

ఢిల్లీకి చంద్రబాబు టీమ్.. బోస్ డీకే అంటే అర్ధం ఇదా.. రేవంత్ సంచలనం.. బిగ్ ఫైట్ టాప్ న్యూస్ @ 7PM

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ సర్కార్ అరాచక పాలన సాగిస్తోందని ఆరోపిస్తున్న తెలుగు దేశం పార్టీ దేశ రాజధాని కేంద్రంగా పోరాటానికి సిద్ధమవుతోంది. జగన్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక, నిరంకుశ పాలనపై కేంద్రం పెద్దలకు ఫిర్యాదు చేయబోతోంది. టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలోని ఆ పార్టీ బృందం రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతితో పాటు కేంద్రం పెద్దలను కలవబోతోంది. సోమవారం మధ్యాహ్నం టీడీపీ బృందానికి రాష్ట్రపతి అపాయింట్ మెంట్ ఖరారైంది.-----జగన్ ప్రభుత్వ పాలన పూర్తిగా గాడి తప్పిందని సీపీఐ రామకృష్ణ తప్పుబట్టారు ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం దివాళా దిశగా సాగుతోందన్నారు. అప్పులు తెస్తేనే రాష్ట్ర మనుగడ.. లేకపోతే దుర్భర పరిస్థితి అన్నట్లుగా మారిందని చెప్పారు. ఆర్ధికంగా చిన్నాబిన్నమై అప్పుల్లో కూరుకుపోయిందన్నారు. అందని ద్రాక్షలా ఇసుక, ఇటుక, ఉక్కు ధరలు పెరిగిపోయాయని రామకృష్ణ ఆందోళన వ్యక్తం చేశారు.--------- సానుభూతి వస్తుందంటే తన ముఖం మీద తానే ఉమ్మేసుకునే రకం జగన్ అని మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు విమర్శించారు. కోడికత్తి నుంచి ప్రతిదానిని వదలని జగన్‌...బోస్‌డీకే పదాన్ని వదులుతాడా? అని ఆయన ప్రశ్నించారు. సజ్జలను బోస్‌డీకే అంటే అది తననే అన్నారని జగన్ అన్వయించుకున్నారని మండిపడ్డారు. బోస్‌డీకే పదానికి పెడర్థాలు తీసి తల్లి పేరుతో కొత్త సెంటిమెంట్‌ కార్డు జగన్‌ బయటకు తీశారని చెప్పారు -------- టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో మరో ఆరుగురుని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విజయవాడకు చెందిన జోగరాజు, ఎస్‌కే బాబు, ఎస్‌కే సైదా.. గుంటూరుకు చెందిన బంక సూర్య సురేష్‌, కల్లా మోహన్ కృష్ణారెడ్డిని  పోలీసులు అరెస్ట్ చేశారు. మిగతా నిందితుల కోసం నాలుగు ప్రత్యేక పోలీసు బృందాలు గాలిస్తున్నాయి. వీడియో ఫుటేజ్‌ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు ------- విశాఖ జిల్లా  మాధవధారలోని ఓ అపార్ట్‌మెంట్‌లో నిర్వహిస్తున్న క్రికెట్ బెట్టింగ్ ను పోలీసులు గుట్టురట్టు చేశారు. నిర్వాహకుడు ప్రభాకర్‌‌ను అరెస్ట్‌ చేశారు. నిందితుల నుంచి ల్యాప్‌టాప్, 2 సెల్‌ఫోన్లు, 2 చెక్‌బుక్‌లు, 2 ఏటీఎం కార్డులతో పాటు రూ.88 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ జరుపుతున్నారు ----- హుజూరాబాద్ ఉప ఎన్నిక నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి విమర్శల్లో పదును పెంచారు. దేవుడి మాన్యాలను పంచుకునే విషయంలో తలెత్తిన విభేదాల వల్లే కేసీఆర్, ఈటల విడిపోయారని వెల్లడించారు. అక్రమ సంపాదన పంపకాల్లో వచ్చిన గొడవే ఈటల రాజీనామాకు, తద్వారా హుజూరాబాద్ ఉప ఎన్నికకు దారితీసిందని వివరించారు.  ----- కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు ఇస్తామని ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి ప్రకటించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ మైనారిటీలకు సీఎం కేసీఆర్ ఏడాదికి వేయి కోట్లు ఖర్చు చేయలేదని విమర్శించారు. ఇళ్ల కేటాయింపులలో ముస్లింలకు 25 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్‌కు వచ్చిన 60 వేల ఓట్లు సాధిస్తే మనదే విజయమని జీవన్‌రెడ్డి దీమా వ్యక్తం చేశారు. --  షర్మిల పాదయాత్రకు ఊహించని మద్దతు లభించింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ లోక్ సభ సభ్యుడు, టీటీడీ చైర్మెన్ వైవీ సుబ్బారెడ్డి.. షర్మిలను కలిసి మద్దతు తెలిపారు.షర్మిల పాదయాత్ర ప్రస్తుతం మహేశ్వరం మండలం నాగారం ఏరియాలో సాగుతోంది. నాగారం గ్రామానికి వచ్చిన వైవీ సుబ్బారెడ్డి... షర్మిలను కలిసి మాట్లాడారు. కొద్దిసేపు ఆమెతో కలిసి నడిచారు. టీటీడీ చైర్మెన్ షర్మిల పాదయాత్రకు మద్దతు తెలపడం ఇప్పుడు సంచలనంగా మారింది. ----- జమ్మూ సిటీ, శ్రీనగర్‌లో రెండేళ్లలో మెట్రో సర్వీసులు ప్రారంభిస్తామని కేంద్ర హోం మంత్రి అమిత్‌షా ప్రకటించారు. జమ్మూలోని భాగ్‌వతి నగర్ ప్రాంతంలో జరిగిన ర్యాలీలో అమిత్‌షా మాట్లాడుతూ, జమ్మూ విమానాశ్రయాన్ని విస్తరించి, జమ్మూకశ్మీర్‌లోని ప్రతి జిల్లాలో హెలికాప్టర్ సర్వీసులు ప్రారంభిస్తామని చెప్పారు. జమ్మూకశ్మీర్‌లో ప్రారంభించిన అభివృద్ధిని ఎవరూ ఆపలేరన్నారు. జమ్మూకశ్మీర్‌లో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే ఎవ్వరినీ విడిచిపెట్టేది లేదని అమిత్‌షా స్పష్టం చేశారు. ---- పెట్రోలు, డీజిల్ ధరల పెంపుపై నవంబరు 14 నుంచి 29 వరకు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు కాంగ్రెస్ ప్రకటించింది. ఆ పార్టీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ మాట్లాడుతూ, ఈ నిరసన కార్యక్రమాల్లో భాగంగా  మొదటి వారంలో దేశవ్యాప్తంగా తమ పార్టీ నేతలు ఎవరి ప్రాంతాల్లో వారు పాదయాత్రలు నిర్వహిస్తారన్నారు. 

టీఆర్ఎస్ ప్లీనరీలో ప్రత్యేకతలు ఇవే... 

తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ  ద్వదశాబ్ధి ఉత్సవాలకు సర్వం సిద్ధమైంది. కరోనా కారణంగా మూడేండ్ల తర్వాత ప్లినరీ జరుగుతుండటంతో గులాబీ పార్టీ భారీగా ఏర్పాట్లు చేసింది. హైదరాబాద్ నగరమంతా గులాబీమయమైంది. జంటనగరాల్లోని పలు ప్రాంతాల్లో భారీ ఎత్తున కటౌట్స్, జెండాలు, తోరణాలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. ప్రధాన కూడళ్లన్ని టీఆర్ఎస్ పార్టీ జెండాలతో నిండిపోయాయి. నెక్లెస్ రోడ్ సర్కిల్, ప్యాట్నీ, ప్యారడైజ్, తెలుగు తల్లి ప్లై ఓవర్, బేగంపేట లోని సీఎం క్యాంప్ ఆఫీస్ సర్కిల్ , జూబ్లీహిల్స్ చెక్ పోస్టు, సైబర్ టవర్స్ , ఎల్పీనగర్ జంక్షన్, మలక్ పేట్ జంక్షన్ల దగ్గర పెద్ద ఎత్తుల ఫ్లెక్సీలు, బ్యానర్లు పెట్టారు. ముఖ్యమంత్రి కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ల ఫొటోలతో కూడిన హోర్డింగ్ లు ఆకట్టుకుంటున్నాయి.  ప్లీనరీకి దాదాపు 15 వేల మంది ప్రతినిధులు హాజరవుతున్నట్టు టీఆర్ఎస్ పార్టీ నాయకులు తెలిపారు. వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. వేదిక వద్ద కూడా ప్రత్యేకంగా ఏర్పాట్లు చేస్తున్నారు. మహిళా ప్రతినిధులు, కార్యకర్తలకు ప్రత్యేక గ్యాలరీ ఏర్పాటు చేశారు. వచ్చిన వారిలో హుషారు నింపేందుకు సాంస్కతిక కార్యక్రమాలను, ధూంధాం ఏర్పాటు చేస్తున్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న అనేక పధకాలకు సంబంధించిన పాటలు, టీఆర్ఎస్ ఆవిర్భావం, ప్రత్యేక రాష్ట్రం కోసం జరిగిన ఉద్యమానికి సంబంధించిన ప్రత్యేక చిత్రాలను వేదిక ప్రాంగణంలో ఏర్పాటు చేస్తున్నారు.  వేలాదిగా తరలి వస్తున్న ప్రతినిధులు, పార్టీనాయకులు, కార్యకర్తలకు నోరూరించే వంటకాలను కూడా సిద్ధం చేస్తున్నారు. ముఖ్యంగా తెలంగాణ రుచులను అందించేందుకు ప్రత్యేకంగా 29 రకాల నాన్ వెజ్ ఐటమ్స్, పలు రకాల వెజ్ ఐటమ్స్, స్వీట్లను సిద్ధం చేస్తున్నారు. ముఖ్యంగా ప్లీనరీ సందర్భంగా వంటల కోసం 500 మంది వంటవాళ్లు పని చేస్తున్నారని మంత్రి తలసాని తెలిపారు. వేదిక వద్ద తెలంగాణ సంప్రదాయాలను తెలియజేసే చిత్రాలు, ఉద్యమ సమయంలో కేసీఆర్ చేసిన పాత్రను తెలియజేసే చిత్రాలు హైలైట్ కానున్నాయి. ప్లీనరీ వేదిక పై దాదాపు 100 మంది ముఖ్యులు కూర్చునే విధంగా వేదికను తీర్చిదిద్దుతున్నారు. 

టీఆర్ఎస్ కు ఎన్నేళ్లు.. ఇరవయ్యా ? ఏడా?.. ఉద్యమకారులు ఏమంటున్నారు! 

కాంగ్రెస్ పార్టీది వందేళ్ళు పైబడిన చరిత్ర. 1885, డిసెంబర్ 28న కాంగ్రెస్ పార్టీ ఆవిర్బవించింది. అయితే ఆ కాంగ్రెస్, ఈ కాంగ్రెస్ ఒకటేనా అనే విషయంలో చరిత్రకారులలో, ఏకాభిప్రాయం లేదు. భారత స్వాతంత్ర ఆఖరి ఘట్టానికి నాయకత్వం వహించిన కాంగ్రెస్ పార్టీ చరిత్ర స్వాతంత్ర సిద్దితో, సమాప్తమై పోయింది. అందుకే, మహత్మా గాంధీ, అప్పుడే కాంగ్రెస్ పార్టీని రద్దు చేయమని  కోరారనే వాదన ఒకటుంది. అయితే  గాంధీ సూచను పార్టీ పట్టించుకోలేదు,   అనుకోండి అది వేరే విషయం. నిజానికి 1947కు ముందున్న కాంగ్రెస్ ఒక రాజకీయ పార్టీ కాదు, అదొక  ఉద్యమం. ఆ తర్వాత వచ్చిన నాయకత్వం చెట్టు పేరు చెప్పుకుని కాయలు అమ్మకున్నా, కాంగ్రెస్ ఉద్యమానికి, కాంగ్రెస్ పార్టీకి మద్యన ఉన్న సన్నని గీత మాత్రం అలాగే ఉండి పోయింది. ఆ తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీలో అనేక చీలికలు పేలికలు  వచ్చాయి. అయితే అవన్నీ ఎలా ఉన్నా, సైధాంతిక వైరుద్యాల ప్రాతిపదికన 1969లో వచ్చిన చీలిక కాంగ్రెస్ చరిత్రలో ఒక ప్రధాన మైలు రాయిలా నిలిచి పోయింది.     కాంగ్రెస్ పార్టీ విషయాన్ని పక్కన పెట్టి అసలు విషయనికి వస్తే, తెలంగాణ రాష్ట్ర సాధన ఒక్కటే లక్ష్యంగా, అదే  సింగిల్ పాయింట్ అజెండాగా, 2001 (ఆగష్టు 27)న ఆవిర్భవించిన తెలంగాణ రాష్ట్ర సమితి, తెరాస ఇప్పుడు ద్విదశాబ్ది (20ఏళ్ల) పండగ వేడుకలు జరుపుకుంటోంది. ఈ నేపధ్యంలోనే కొందరు కాంగ్రెస్ లానే రాష్ట్ర సాధన ఒక్కటే లక్ష్యంగా ఏర్పడిన తెరాస, కూడా 2014కు ముందు ఒక  ఉద్యమ వేదికే కానీ, రాజకీయ పార్టీ కాదనే వాదనను ముందుచుతున్నారు. పుష్కర కాలానికి పైగా సాగిన తెలంగాణ మలి దశ పోరాటం రాజకీయాలకు అతీతంగా సాగిన  ఉద్యమం.  అదొక ఉద్యమం కావడం వల్లనే,రైట్, లెఫ్ట్, మధ్యేవాద భావజాలం ఉన్న అన్ని పార్టీలు, అందరు నాయకులు, ప్రజలు, విద్యార్ధులు అందరూ ఉద్యమంలో భాగస్వాములు అయ్యారు.తెలంగాణ సాకారం అయిన తర్వాత ఉద్యమ స్పూర్తి పక్కకు పోయి తెరాస రాజకీయ రంగు పులుముకుంది.  నిజానికి  మహత్మా గాంధీ, కాంగ్రెస్ పార్టీని రద్దు చేయమని ఒక సూచన  మాత్రమే చేశారు. అది జరగలేదు, కానీ, తెలంగాణ ఉద్యమానికి సారధ్యం వహించిన, తెరాస వ్యవస్థాపక అధ్యక్షుడు కేసీఆర్, 2014 అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే, తెరాస ఉద్యమ పార్టీని రద్దుచేశారు. ఉద్యమ లక్ష్యం నెరవేరిన నేపధ్యంలో తెరాస ఇకపై  ఫక్తు 16 అణాల రాజకీయ పార్టీగా పనిచేస్తుందని చెప్పారు . చెప్పడమే కాదు, రాజకీయ పునరేకీకరణ, బంగారు తెలంగాణ మాటల చాటున, ఈ ఏడేళ్ళలో అదే చేశారు. అందుకే, ఉద్యమంలో  పాల్గొన్న పెద్దలు కొందరు, కేసీఆర్  ఉద్యమ పార్టీకి బొంద పెట్టారని అంటారు. ఆరోపిస్తున్నారు, కుటుంబ పార్టీ కట్టుకున్నారని అంటారు.  నిజంగా కూడా కేసీఆర్ ఉద్యమ అవవాళ్ళు, వాసనలు లేకుండా, ఉద్యమ  పార్టీని పూర్తి స్థాయిలో ‘పక్షాళన’ చేశారు. గాదె ఇన్నయ, ఆలే నరేంద్ర, ప్రొఫెసర్ కోదండ రామ్ మొదలు ఈటల రాజేందర్ వరకు ఉద్యమంతో సంబధమున్న నేతలు అందరినీ ఏరి పారేశారు.  ఇంకా హరీష్ రావు వంటి  ఒకరిద్దరు ఉన్నా, కేసీఆర్ తెరాసను ఉద్యమ పార్టీని, రాజకీయ పార్టీగా... రాజకీయ పార్టీని ... కుటుంబ పార్టీగా చాల చకక్గా దిగ్విజయంగా ముందుకు తీసుకుపోతున్నారు.  ఈ నేపధ్యంలోనే తెరాస ద్విదశాబ్ది  (20 ఏళ్ల) ఉత్సవాలు జరుపుకోవడం సమంజసమేనా అన్న చర్చ జరుగుతోంది. ఇరవై ఏళ్ల క్రితం, 2001 పుట్టిన పార్టీని, పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుని హోదాలో  కేసీఆర్ 2014లో రద్దు చేశారు, కాబట్టి, తెరాస రాజకీయ పార్టీగా అవతరించి ఏడేళ్ళే అయిందని, 20 ఏళ్ల పండగ ఎట్లా చేసుకుంటారని, ఉద్యమ నాయకులు ప్రశ్నిస్తున్నారు. అయితే, అప్పుడు ఉద్యమ పార్టీ అయినా ఇప్పుడు కుటుంబ పార్టీ అయినా, పార్టీ నాయకుడు, కేసీఆర్ ఒక్కరే కాబట్టి, అన్ని హక్కులు ఆయనకే ఉంటాయని ఇంకొందరి వాదన.  ఎవరు ఏ వాదన చేసినా, అది ఇరవై ఏళ్ళా, ఏడేళ్ల అనేది పక్కన పెడితే, తెరాస ఒక చరిత్ర. ఇద్దరంటే ఇద్దరే ఎంపీలతో వందేళ్ళ కాంగ్రెస్ పార్టీని,విలీన ఆశ చూపి  బురిడి కొట్టించి  తెలంగాణ సాధించడం నిజంగా ఒక చారిత్రక సందర్భం. అయితే  వ్యూహాలు, ఎత్తుగడలు, దొంగ దీక్షలు, అగ్గిపెట్టె దొరకక ఆగిపోయిన అత్మాహుతుల వల్ల మాత్రమే తెలంగాణ రాలేదు. 14 వందల బలిదానాల కారణంగానే 60 ఏళ్ల తెలంగాణ స్వప్నం సాకారమైంది. ఈ ఏడేళ్ళలో ఆ కల చాలా వరకు కరిగిపోయింది. అదెలా ఉన్నా, తెలంగాణ సాధించిన క్రెడిట్ ఉద్యమానిదే కానీ, తెరాస పార్టీది కాదు, తెరాస కుటుంబ పార్టీది అయితే అసలే కాదు. అనేది తెలంగాణ ప్రజల గుండె చప్పుడుగా ఘోషిస్తోంది.. 

వైఎస్ షర్మిలకు ఊహించని సపోర్ట్.. జగనే పంపించారా? 

తెలంగాణలో పార్టీ స్థాపించిన వైఎస్ షర్మిల దూకుడుగా ముందుకు వెళుతున్నారు. నిరుద్యోగ దీక్షల పేరుతో వారం వారం నిరసన కార్యక్రమాలు చేపట్టిన షర్మిల... తెలంగాణ వ్యాప్తంగా పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. తన తండ్రి, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి సెంటిమెంట్ ను పాటిస్తూ.. చేవెళ్ల నుంచి ఈనెల 21న పాదయాత్ర మొదలుపెట్టారు. ప్రస్తుతం ఆమె యాత్ర రంగారెడ్డి జిల్లాలోనే కొనసాగుతోంది. పాదయాత్రలో ప్రజలను కలుస్తూ వారి సమస్యలు తెలుసుకుంటున్నారు వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. కేసీఆర్ ప్రభుత్వంపై తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నారు. అయితే షర్మిల పాదయాత్రకు ఊహించని మద్దతు లభించింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ లోక్ సభ సభ్యుడు, టీటీడీ చైర్మెన్ వైవీ సుబ్బారెడ్డి.. షర్మిలను కలిసి మద్దతు తెలిపారు.షర్మిల పాదయాత్ర ప్రస్తుతం మహేశ్వరం మండలం నాగారం ఏరియాలో సాగుతోంది. నాగారం గ్రామానికి వచ్చిన వైవీ సుబ్బారెడ్డి... షర్మిలను కలిసి మాట్లాడారు. కొద్దిసేపు ఆమెతో కలిసి నడిచారు. టీటీడీ చైర్మెన్ షర్మిల పాదయాత్రకు మద్దతు తెలపడం ఇప్పుడు సంచలనంగా మారింది. షర్మిలకు అన్న ఏపీ సీఎం జగన్ తో విభేదాలు ఉన్నాయనే ప్రచారం జరుగుతోంది. అన్నమీద కోపంతోనే షర్మిల సొంత పార్టీ పెట్టుకున్నారనే చర్చ జరిగింది. జరుగుతున్న ప్రచారానికి బలం చేకూరేలానే ఇప్పటివరకు పరిణామాలు జరుగుతూ వచ్చాయి. షర్మిల పార్టీ ప్రారంభ సభకు వైసీపీ నేతలెవరు రాలేదు. విజయమ్మ ఒక్కరే షర్మిల వెంట ఉంటున్నారు. అంతేకాదు వైఎస్సార్ జయంతి రోజున ఆత్మీయ సమావేశం నిర్వహించారు విజయమ్మ. గతంలో వైఎస్ తో సన్నిహితంగా ఉన్న నేతలకు ఆహ్వానం పలికింది. ఆమె ఆహ్వానం వెళ్లిన వారిలో ఎక్కువ మంది వైసీపీ నేతలే ఉన్నారు. కాని వాళ్లెవరు విజయమ్మ సమావేశానికి హాజరుకాలేదు. తెలంగాణకు సంబంధించి కాంగ్రెస్, బీజేపీ నేతలు విజయమ్మ  సమావేశానికి వెళ్లగా.. వైసీపీ నేతలు హాజరుకాకపోవడం చర్చగా మారింది. జగన్ ఆదేశాలతోనే వైసీపీ నేతలెవరు విజయమ్మ సమావేశానికి వెళ్లలేదని భావించారు.  వైఎస్సార్ ఆత్మీయ సమావేశానికి వైసీపీ నేతలెవరు హాజరుకాని పరిస్థితుల్లో షర్మిల పాదయాత్రకు వైవీ సుబ్బారెడ్డి మద్దతు పలకడంపై రాజకీయ వర్గాల్లోనూ ఆసక్తికర చర్చ సాగుతోంది.  వైవీ సుబ్బారెడ్డి వ్యక్తిగతంగానే షర్మిలను కలిశారా లేక జగన్ అనుమతి ఉందా అన్నదానిపై స్పష్టత లేదు. షర్మిలకు వైవీ సుబ్బారెడ్డి చిన్నాన్న కావడంతో.. కుటుంబ సభ్యుడిగానే కలిసి ఉండవచ్చనే చర్చ జరుగుతోంది. పాదయాత్రలో ఉన్న షర్మిలను వైవీ సుబ్బారెడ్డి కలవడంపై వైసీపీలోనూ చర్చ జరుగుతోందని తెలుస్తోంది. 

ఢిల్లీలో చంద్రబాబు ఏం చేస్తారో.. వైసీపీలో కలవరం..

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ సర్కార్ అరాచక పాలన సాగిస్తోందని ఆరోపిస్తున్న తెలుగు దేశం పార్టీ దేశ రాజధాని కేంద్రంగా పోరాటానికి సిద్ధమవుతోంది. జగన్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక, నిరంకుశ పాలనపై కేంద్రం పెద్దలకు ఫిర్యాదు చేయబోతోంది. టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలోని ఆ పార్టీ బృందం రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతితో పాటు కేంద్రం పెద్దలను కలవబోతోంది. సోమవారం మధ్యాహ్నం టీడీపీ బృందానికి రాష్ట్రపతి అపాయింట్ మెంట్ ఖరారైంది. సోమవారం  రాష్ట్రపతి అపాయింట్‌మెంట్ ఖరారైన నేపథ్యంలో తెలుగు దేశం పార్టీ నేతలు  ఢిల్లీకి బయలుదేరి వెళ్తున్నారు. ఆదివారం  సాయంత్రం  అచ్చెం నాయుడు, కేశినేని నాని ఇతర నేతలు ఢిల్లీకి వెళుతున్నారు. సోమవారం ఉదయం టీడీపీ అధినేత చంద్రబాబు హైదరాబాద్ నుంచి ఢిల్లీ బయలుదేరనున్నారు. చంద్రబాబుతో పాటు మరికొంత మంది నేతలు ఢిల్లీకి పయనం కానున్నారు.  సోమవారం మధ్యాహ్నం 12 గంటల 45 నిమిషాలకు భారత రాష్ట్రపతితో టీడీపీ నేతలు భేటీ అవనున్నారు. చంద్రబాబు ఆధ్వర్యంలో ఐదుగురు సభ్యుల బృందం రాష్ట్రపతిని కలవనున్నారు.  రెండున్నర సంవత్సరాల తరువాత చంద్రబాబు హస్తినకు వెళుతున్నారు. హోంమంత్రితో పాటు మరికొందరిని కూడా కలిసే అవకాశం ఉంది. ఏపీలో మాదకద్రవ్యాలు , వైసీపీ దాడులపై ఫిర్యాదు చేయనున్నారు చంద్రబాబు. రెండు రోజులపాటు  చంద్రబాబు బృందం ఢిల్లీలోనే మకాం వేయనున్నారు. ఏపీలో రాజ్యాంగ వ్యవస్థలు విధ్వంసంపై ఢిల్లీలో నేతలకు బృందం సభ్యులు వివరించనున్నారు. టీడీపీ నేతలపై దాడులు, పార్టీ కార్యాలయాల విధ్వంసం, అక్రమ కేసులు వంటి అంశాలను  టీడీపీ బృందం కేంద్ర పెద్ద దృష్టికి తీసుకెళ్లనున్నారు. ఏపీలో ఆర్టికల్ 356 ప్రయోగించాల్సిన పరిస్థితులు నెలకొన్నాయని టీడీపీ నేతలు చెబుతున్నారు. 

స్పుత్నిక్ వీతో హెచ్ఐవీ ముప్పు! దక్షిణాఫ్రికా ప్రకటనతో కలకలం..

ప్రపంచాన్ని వణికించిన కొవిడ్ మహమ్మారి కట్టడికి వ్యాక్సినేషన్ ప్రధానం కావడంతో అన్ని దేశాల్లో వ్యాక్సినేషన్ ను ముమ్మరంగా చేపట్టాయి. యుద్ధప్రాతిపదికన టీకాలను సమకూర్చుకుని దేశ ప్రజలకు అందిస్తున్నాయి. వివిధ దేశాల్లో అందుబాటులో ఉన్న టీకాలను కొనుగోలు చేసుకుంటున్నాయి. రెండు రోజుల క్రితమే వ్యాక్సినేషన్ లో భారతదేశం అద్బుత మైలురాయిని క్రాస్ చేసింది. వంద కోట్ల టీకాలతో బహుబలిగా నిలిచింది.    అయితే వ్యాక్సినేషన్ వేగంగా సాగుతున్న సమయంలో దక్షిణాఫ్రికా చేసిన ఓ ప్రకటన ఇప్పుడు కలకలం రేపుతోంది.రష్యా తయారు చేసిన కరోనా వ్యాక్సిన్ స్పుత్నిక్ వీతో హెచ్ఐవీ ముప్పుందంటూ దక్షిణాఫ్రికా సంచలన కామెంట్లు చేసింది. అడినోవైరస్ టైప్ 5 వెక్టార్లతో హెచ్ఐవీ ముప్పు ఎక్కువగా ఉంటుందని కొన్ని అధ్యయనాలు తేల్చాయని.. అదే వెక్టార్ తో తయారైన స్పుత్నిక్ వ్యాక్సిన్ వల్ల పురుషుల్లో హెచ్ఐవీ ముప్పు ఎక్కువగా ఉండే అవకాశం ఉందని తెలిపింది. హెచ్ఐవీ ముప్పు ఉంది కాబట్టి రష్యా వ్యాక్సిన్ ను అనుమతించలేమని దక్షిణాఫ్రికా ఔషధ నియంత్రణ సంస్థ గత సోమవారం తేల్చి చెప్పింది. దానికి సంబంధించిన డేటానూ రష్యా సమర్పించలేదని, ఆ డేటాను అందజేశాక టీకా అనుమతులపై నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేసింది. దక్షిణాఫ్రికా ప్రకటనతో ఆఫ్రికా దేశమైన నమీబియా స్పుత్నిక్ వ్యాక్సిన్లను తాత్కాలికంగా నిలిపేసింది. ఇప్పటికే అక్కడ జనానికి స్పుత్నిక్ టీకాలు ఇస్తున్న ఆ దేశం.. మధ్యలోనే ఆపేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు నమీబియా ప్రకటన చేసింది. దక్షిణాఫ్రికా ప్రకటనను పరిగణనలోకి తీసుకునే ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ అనుమతి ఇచ్చేంత వరకు స్పుత్నిక్ వ్యాక్సిన్ ను నిలిపేస్తున్నామని తేల్చి చెప్పింది. దక్షిణాఫ్రికా ఆరోగ్య సంస్థ ప్రకటన, నమీబియా నిర్ణయంతో ప్రపంచ వ్యాప్తంగా ఇప్పుడు ఆందోళన కనిపిస్తోంది. మరోవైపు స్పుత్నిక్ వీ టీకా  తయారుదారు సంస్థ మాత్రం దక్షిణాఫ్రికా ప్రకటనను ఖండించింది. స్పుత్నిక్ వీ టీకాతో హెచ్ఐవీ వచ్చే అవకాశం లేదని స్పష్టం చేసింది.  

ఏపీలో ఏమి జరుగుతోంది? అరాచకం రాజ్యమేలుతోంది..!

సహజంగా ఎక్కడైనా, ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టి పై చేయి సాధించేందుకు ప్రతిపక్షాలు అల్లర్లు చేస్తాయి, అలజడులు సృష్టిస్తాయి. కానీ,ఆంధ్ర ప్రదేశ్’లో మాత్రం బండి రివర్స్’లో నడుస్తోంది. అనుభవ రాహిత్యమో, అజ్ఞానమో లేక ఆ రెండూ కలగలిసిన దురహంకారమో కానీ,ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మొదలు, తెలుగు దేశం పార్టీ టికెట్’పై గెలిచి, అధికారికంగా వైసీపీలో చేరకుండానే, చేరినట్లుగా వ్యవహరిస్తున్న,గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ వరకు ప్రతి ఒక్కరూ కూడా రాజకీయాలకంటే రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమనే విషయాన్ని విస్మరిస్తున్నారు. రాజకీయాల కోసం రాష్ట్ర సమస్యలు పక్కన పెట్టి వంకర చూపులు చూస్తున్నారు. వక్ర బుద్ధిని ప్రదర్శిస్తున్నారు. ఒక అబద్ధాన్ని కప్పిపుచ్చుకునేందుకు వెయ్యి అబద్ధాలు చెప్పవలసి వస్తుంది. ఇప్పుడు ఏపీ ప్రభుత్వం ఒక తప్పునుంచి తప్పించుకునేందుకు, వంద తప్పులు చేస్తూ పోతోంది. అందుకే ప్రజల ముందు, న్యాయస్థానాల ఎదుట  అభాసు పాలవుతోంది.  అందుకే, రాష్ట్రంలో ఏమి జరుగుతోంది? అని రాష్ట్ర హై కోర్టు ప్రశ్నించే పరిస్థితి వచ్చింది. దీన్ని బట్టే, రాష్ట్రం ఎటు పోతోందో, ఎంతలా దిగజారి పోతిందో  వేరే చెప్పవలసిన అవసరం లేకుండా అర్ధమవుతోంది.  రాష్ట్రంలో చట్టబద్దమైన పాలన సాగడం లేదు, అన్నదే హై కోర్టు  రాష్ట్ర ప్రభుత్వం నెత్తిన వేసిన తాజా అక్షింతల సారాంశం.హైకోర్టు అక్షింతలు వేసిది పోలీసల నెత్తినే కావచ్చును కానీ,అధికారంలో ఉన్నవారిలో, ప్రభుత్వ సలహాదారు సజ్జల వారితో సహా ఏ ఒక్కరికైనా ఒకింత  విజ్ఞత, వివేచనా ఉన్నా న్యాయస్థానం ఎవరిని ఉద్దేశించి, అంత తీవ్ర మైన వ్యాఖ్యలు చేసిందో అర్థమవుతుంది. అంతటి విజ్ఞత, వివేచనా ప్రభుత్వానికి లేదనే కావచ్చును, న్యాయస్థానం సర్కార్ తప్పును వివరంగా, విశదపరించింది.  “రాష్ట్రంలో పోలీసులకు చట్టబద్ద పాలన అంటే గౌరవం లేదు. హై కోర్టు న్యాయమూర్తులు, ఇతర రాజ్యాంగబద్ద పదవులలో ఉన్న వారిని దూషించిన వారిపై చర్యలు తీసుకునే విషయంలో ఉత్సాహం చూపించని పోలీసులు, ముఖ్యమంత్రిని దూషించారనే కారణంతో  తెలుగు దేశం పార్టీ నాయకుడు పట్టాభి విషయంలో అంత ఉత్సాహం చూపవలసిన అవసరం ఏముంది? గౌరవం, వ్యక్తిగత ప్రతిష్ట ఒక్క ముఖ్యమంత్రికి మాత్రమే కాదు, ప్రతి ఒక్కరికీ ఉంటాయి. అందరి గౌరవాన్ని కాపాడవలసిన బాద్యత పోలీసుల పై  ఉంది. చట్టం కంటే ఎవరూ ఎక్కువ కాదు, ముఖ్యమంత్రి  అయినా సరే, పోలీసుల వ్యవహార శైలి పై అభ్యంతరాలతో కోర్టు ముందుకు ప్రతి రోజు పలు వ్యాజ్యాలు వస్తున్నాయి . పట్టాభి అరెస్ట్’ విషయంలో పోలీసులు నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరించారు” అంటూ న్యాయస్థానం పోలీసుల వ్యవహారశైలి పైనే కాదు, ప్రభుత్వం దుర్నీతి, దుర్మార్గ వ్యవహార శైలి పైనా అక్షింతలు వేసింది. ఒక రకంగా చూస్తే, రాష్ట్ర హై కోర్టు ప్రభుత్వాన్ని పరోక్షంగానే అయినా అభిశంసించిందని కూడా  అనవచ్చునేమో. అనే విధంగా వ్యాఖ్యలు చేసింది.  అయితే అదేమీ విచిత్రమో కానీ, బుగ్గకార్లలో తిరుగుతున్న, మంత్రులు, ఐఏఎస్, ఐపీఎస్’లు, వందమందో ఆపైనో ఉన్న సలహాదారులకు ఈ విషయం ఎందుకో  తలకెక్కడం లేదు. ఈ ప్రభుత్వ వైఖరి సామాన్యులకు అర్థం కావడం లేదు. ఇలా మంత్రులు, అధికారులు, సలహాదారులు ఎవరికి వారు మనకెందుకులే అని కొందరు, భయంతో ఇంకొందరు  మౌనంగా ఉన్నా,లేక ముఖ్యమంత్రి తానా అంటే, తాము తందానా అన్నా, పరిస్థితి విషమించి చేజారి పోయేందుకు అట్టే కాలం పట్టదు. ఇప్పుడు ఏపీలో జరిగింది, జరుగుతోంది కూడా అదే, ముఖ్యమంత్రి ఏది చెబితే అదే పవిత్ర బైబిల్ సూక్తి అనంట్లుగా అధికార యంత్రాంగం వ్యవహరిస్తోంది. ఇలా అధికార యంత్రాగంలో జీ హుజూర్ మనస్తత్వం బలిసి పోవడం వలన  ఇలంటి జరగరాని అనర్ధాలు అన్నీ జరిగి పోతున్నాయి. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ స్థాయి అధికారులు కూడా, కోర్టు బోనులో నిలబడి సంజాయిషీ ఇచ్చుకోవలి వస్తోంది. అయినా, అందరూ కాకపోవచ్చును కానీ, కొందరు  అధికారులు అదే పంధాలో పోతున్నారు.   ఇక ప్రస్తుత బూతుల భాగోతం విషయానికే వస్తే, ఈ చండాలం అంతటికీ మూలం, రాష్ట్రం డ్రగ్స్, గంజాయి అక్రమ వ్యాపారానికి అడ్డాగా మారిందనే ఆరోపణ,ఆ ఆరోపణ చుట్టూ అల్లుకున్న వివాదం. నిజానికి,ఇది కేవలం ఆరోపణ మాత్రామేకాదు,నిజం. అలాగే, డ్రగ్స్, గంజాయి అక్రమ దందా, ఇప్పుడే మొదలైందా అంటే కాదు. అధికార పార్టీ నాయకులు, చివరకు సంబంధిత  ప్రభుత్వ అధికారులు కూడ తమను తాము డిఫెండ్ చేసుకునేందుకు చెపుతున్న గతాన్ని కొట్టివేయడం కుదరదు. అయితే, గతంలో జరిగింది కాబట్టి ఇప్పుడూ ‘జరగవచ్చును’ అనేది మాత్రం  తప్పు. ఆ మొదటి తప్పును అసలు సమస్యను కప్పి పుచ్చుకునేందుకు, పట్టాభి తిట్టును అడ్డుపెట్టుకుని, దానికి విరీత అర్థాలు జోడించి, తెలుగు దేశం పార్టీ కార్యాలయాలపై, పట్టాభి ఇంటిపి వైసీపీ కార్యకర్తలు దాడి చేయడం రెండవ తప్పు. ఈ అన్నిటినీ మించి ముఖ్యమంత్రి పట్టాభి తిట్టుకు ఉన్న నానార్ధలలో తమకు అనుకూలమానుకున్న, ముఖ్యమంత్రి హోదాలో ఉన్న నన్నే ... అంత మాటన్నారని, అమ్మను అవమానించే ఆ మాటను తననోటితోనే బహిరంగ వేదిక నుంచి రాష్ట్ర మంతా వినిపించడం, అదే సమయంలో వైసీపీ కార్యకర్తలు, నాయకులు  అందరూ బీపీ రోగులని నిర్ధారించడం, బీపీలు పెరిగే దాడులు చేశారని ముఖ్యమంత్రి బహిరంగాంగా సమర్ధించడం అన్నిటినీ మించిన అతి పెద్ద తప్పు. నిజానికి ఆది తప్పు మాత్రమే కాదు, రాజ్యాంగాన్ని ఉల్లంగించడం కూడా ఆవుతుంది.  అందుకే వైసీపీ బీపీ బ్యాచ్, బీపీ ఇంకా పెరిగి మర్దల్లో, మాన భంగాలో చేసినా ముఖ్యమత్రి వాటినీ సమర్దిస్తారా అని అడుగుతున్నారు. హిందూ దేవాలయాల మీద దాడులు చేసే వారు, రథాలను దగ్ధంచేసే వారు  మతి స్థిమితం లేని పిచ్చోళ్ళు, ప్రతిపక్ష పార్టీ కార్యాలయలపై దాడులు చేసే వారేమో .. బీపీ రోగులు. బాగుంది, ఇక మర్డర్లు ఇతర నేరాలు చేసే వారికి కూడా ముఖ్యమంత్రి ఏదో ఒక రోగాన్ని అతికిస్తే,, సరిపోతుందని, మాజీ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు అంటున్నారు.  ఇప్పటికైనా ప్రభుత్వం చేయవలసింది బూతుల విచారణ కాదు, ఈ మొత్తం  రచ్చకు మూలమైన డ్రగ్ మాఫియా, గంజాయి దందా మీద దృష్టి పెట్టాలని మాజీ  ఐఏఎస్, ఐపీఎస్ సామాన్య ప్రజలు కోరుకుంటున్నారు.

తెలంగాణ డీజీపీ ఫోన్ ట్యాప్! హుజురాబాద్ ఎన్నికల వేళ కలకలం...

హుజురాబాద్ ఉప ఎన్నికల ప్రచారం తారా స్థాయికి చేరింది. నాలుగు రోజుల్లో ప్రచారం ముగియనుండటంతో అన్ని పార్టీల నేతలంతా అక్కడే మకాం వేశారు. లేట్ గా ప్రచారానికి వచ్చినా... హుజురాబాద్ లో అదరగొట్టారు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. శనివారం పలు సభల్లో ప్రసంగించిన రేవంత్ .. కేసీఆర్, టీఆర్ఎస్ పై తీవ్రమైన ఆరోపణలు చేశారు.  హుజూరాబాద్ లో అధికార పార్టీ అరాచకాలు, అక్రమాలకు పాల్పడుతుందని రేవంత్ రెడ్డి ఆరోపించారు.  టీఆర్ఎస్, బీజేపీలు హుజురాబాద్ ను వ్యసనాలకు అడ్డాగా మార్చాయన్నారు. పంపకాల్లో తేడా వల్లే హుజూరాబాద్ ఉప ఎన్నిక వచ్చిందన్నారు రేవంత్ రెడ్డి. తెలంగాణలో పోలీస్ విభాగం రెండుగా విడిపోయిందని సంచలన ఆరోపణ చేశారు రేవంత్ రెడ్డి. ఉప ఎన్నికలో పోలీసులు నిజాయతీగా వ్యవహరించడం లేదని, టీఆర్ఎస్ నేతలు పోలీసు విధులను అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. డీజీపీ ఫోన్ నూ ట్యాప్ చేస్తున్నారంటూ సంచలన ఆరోపణలు చేశారు రేవంత్ రెడ్డి.  డీజీపీపై నర్సింగరావు, తమపై వేణుగోపాలరావు నిఘా పెట్టారని చెప్పారు. ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ సామాజిక వర్గానికి చెందిన పోలీసులను వేధిస్తున్నారని రేవంత్ రెడ్డి ఆరోపణలు చేశారు. సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, హరీశ్ రావులపైనా రేవంత్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. హుజూరాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి బల్మూరి వెంకట్ స్థానికేతరుడు అని కేటీఆర్ వ్యాఖ్యానించడంపై ఆయన  తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. హుజురాబాద్ నియోజకవర్గానికి సీఎం కేసీఆర్, కేటీఆర్, హరీశ్ ఇతర మంత్రులూ  అనామకులేనని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అభ్యర్థిని నాన్ లోకల్ అంటున్నారని, మరి, గజ్వేల్, సిరిసిల్ల, సిద్దిపేటలో పోటీ చేసిన వారెలా స్థానికులవుతారని ప్రశ్నించారు. దళితబంధు, పేదల ఇళ్ల కోసం ఈటల రాజీనామా చేయలేదని విమర్శించారు. సిద్దిపేటలో దళితబంధు ఇవ్వరా? అని ప్రశ్నించారు. దుబ్బాక, హుజూర్ నగర్, నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఏమయ్యాయని సీఎం కేసీఆర్ ను నిలదీశారు రేవంత్ రెడ్డి. జనాలను భయపెట్టి ఓట్లేయించుకునేందుకు హరీశ్ ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. త్వరలోనే టీఆర్ఎస్ లో ముసలం ఖాయమని, కేసీఆర్ పై తిరుగుబాటు మొదలైందని చెప్పారు. తెలంగాణ రాష్ట్రం కోసం కేసీఆర్ కుటుంబంలో ప్రాణ త్యాగాలు ఎవరూ చేయలేదని రేవంత్ రెడ్డి అన్నారు. 

రెండున్నర ఏండ్ల తర్వాతబిగ్ ఫైట్.. భారత్- పాక్ మ్యాచ్ తో క్రికెట్ ఫీవర్...

ప్రపంచ క్రికెట్‌ ప్రేమికులంతా అత్యంత ఆసక్తిగా ఎదురుచూసే సమరం మరికొన్ని గంటల్లో జరగబోతోంది. దాదాపు రెండున్నరేళ్ల తర్వాత భారత్‌-పాకిస్థాన్‌ మధ్య క్రికెట్ మ్యాచ్ జరగబోతోంది. దుబాయ్ వేదికగా జరుగుతున్న టీ20 ప్రపంచకప్‌ టోర్నీలో  దుబాయ్‌ ఇంటర్నేషనల్‌ స్టేడియం ఈ ఉత్కంఠ సమరానికి వేదిక కానుంది. సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో కొన్నేళ్లుగా దాయాది జట్ల మధ్య ద్వైపాక్షిక సిరీస్‌లు జరగడం లేదు. దీంతో భారకత్- పాక్ మధ్య క్రికెట్‌ మ్యాచ్‌లు అత్యంత అరుదుగా మారాయి. కేవలం ఐసీసీ టోర్నీల్లోనే అభిమానులకు ఆ అవకాశం దక్కుతోంది. ఇప్పుడు టీ20 ప్రపంచకప్‌ సూపర్‌-12 గ్రూప్‌-2లో భాగంగా ఇరు జట్లు తమ తొలి మ్యాచ్‌లో తలపడపోతున్నాయి. చివరిసారిగా 2019 వన్డే వరల్డ్‌కప్‌లో భారత్‌-పాక్‌ తలపడ్డాయి. బ్రాడ్‌కాస్టర్ల ఖజానా నింపే ఈ మ్యాచ్‌ కోసం 17,500 టిక్కెట్లు కొన్ని గంటల్లోనే అమ్ముడుపోయాయి.  ఐసీసీ టోర్నీల్లో పాకిస్థాన్‌పై భారత్‌దే ఆధిపత్యంగా ఉంది. వన్డే వరల్డ్‌క్‌పలో ఏడు సార్లు.. టీ20 ప్రపంచక్‌పలో ఐదుసార్లు గెలిచింది. ఓవరాల్‌గా పొట్టి ఫార్మాట్‌లో 8 మ్యాచ్‌లాడితే భారత్‌ ఏడింటిలో గెలిచింది.టీ20 ప్రపంచక్‌పలో తొలిసారిగా కోహ్లీ నేతృత్వంలో భారత జట్టు పాక్‌ను ఎదుర్కొనబోతోంది.  కెప్టెన్ కోహ్లీకి ఈ ఫార్మాట్‌లో కెప్టెన్‌గా ఇదే ఆఖరి టోర్నీ కూడా. అందుకే అన్ని విధాలా ఈ మ్యాచ్‌ చిరస్మరణీయం చేసుకోవాలనుకుంటున్నాడు. ఇంతకుముందు ఐదుసార్లు ఈ మెగా టోర్నీల్లో ధోనీ ఆధ్వర్యంలోనే జట్టు బరిలోకి దిగింది. ఇప్పుడు ధోనీ జట్టు మెంటార్‌గా వ్యవహరిస్తున్నాడు. అయితే ఈ ఫార్మాట్‌లో బలంగా కనిపిస్తున్న పాక్‌ జట్టును.. గత రికార్డును దృష్టిలో ఉంచుకుని తేలిగ్గా తీసుకుంటే షాక్‌ తప్పదు.  భారత జట్టు బ్యాటింగ్‌ ఆర్డర్‌ పటిష్టంగా కనిపిస్తోంది. ఓపెనర్లు రోహిత్‌, రాహుల్‌ టాప్‌ ఫామ్‌లో ఉన్నారు. పేసర్‌ షహీన్‌ షా అఫ్రీదిని వీరు దీటుగా ఎదుర్కొని పరుగులు రాబడితే మిడిలార్డర్‌పై ఒత్తిడి తగ్గుతుంది. కోహ్లీ నెంబర్‌ త్రీలో రావడం ఖాయం కాగా, ఆ తర్వాత మిడిల్‌ ఓవర్లలో సూర్యకుమార్‌ దూకుడు జట్టుకు లాభించనుంది. ఆరో నెంబర్‌లో హార్దిక్‌ వైపే కోహ్లీ మొగ్గు చూపుతున్నాడు. స్పిన్‌ విభాగంలో జడేజాకు జతగా అశ్విన్‌, రాహుల్‌ చాహర్‌లలో ఒకరిని ఆడించవచ్చు. పేస్‌ త్రయం బుమ్రా, షమి, శార్దూల్‌ పాక్‌ బ్యాటర్స్‌ పనిబట్టేందుకు సిద్ధంగా ఉన్నారు. ఐసీసీ టోర్నీల్లో భారత్‌పై విజయాలు లేకున్నా పాక్‌ ఆ గతాన్ని గుర్తుచేసుకోవాలనుకోవడం లేదు. ఎందుకంటే ఆ జట్టు టీ20ల్లో అద్భుత ఫామ్‌లో ఉంది. ఈ గ్రౌండ్‌లో ఆడిన 25 టీ20ల్లో 15 మ్యాచ్‌లు గెలిచారు. పాక్‌ టాపార్డర్‌ అత్యంత పటిష్టంగా కనిపిస్తోంది. ఓపెనర్లు మహ్మద్‌ రిజ్వాన్‌ (1462), కెప్టెన్‌ ఆజమ్‌ (1363) ఈ ఏడాది పొట్టి ఫార్మాట్‌లో అత్యధిక పరుగులు సాధించిన  టాప్‌-2 క్రికెటర్లు. ఆజమ్‌ ఖాతాలో ఓ సెంచరీ కూడా ఉంది. ఇదే జోరును భారత్‌పైనా చూపాలనుకుంటున్నారు. ఇక నెంబర్‌ 3లో ఫఖర్‌ జమాన్‌ చెలరేగేందుకు సిద్ధంగా ఉన్నాడు. రెండు వామ్‌ప మ్యాచుల్లో కలిపి అతను 98 పరుగులు సాధించాడు. బౌలింగ్‌లో లెఫ్టామ్‌ పేసర్‌ షహీన్‌ అఫ్రీది ఇబ్బందిపెట్టవచ్చు. 2017 చాంపియన్స్‌ ట్రోఫీ ఫైనల్లో మహ్మద్‌ ఆమిర్‌ను భారత టాపార్డర్‌ ఆడలేక మ్యాచ్‌ను కోల్పోవాల్సి వచ్చింది. ఇక స్పిన్నర్లు ఇమాద్‌ వసీం, షాదాబ్‌ ఖాన్‌ కూడా జట్టుకు ఉపయోగపడాలనుకుంటున్నారు.

ఏపీలో బుసకొడుతున్న అరాచకం.. దగ్గరుండి మరీ రెండు దేవలయాల కూల్చివేత

ఏపీలో జగన్ సర్కారు అరాచకానికి అంతు లేకుండా పోతోంది. అమ్మవారి భక్తుల సెంటిమెంట్లు పట్టడం లేదు. ఆంజనేయస్వామి విగ్రహాన్ని అందరూ చూస్తుండగానే దారుణంగా అవమానించారు. అసలు హిందువుల సెంటిమెంట్లంటేనే జగన్ ఖాతరు చేయడం లేదు. జగన్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటికి వందకు పైగా ఆలయాలు, విగ్రహాలు ధ్వంసం అయ్యాయి. హిందువుల మీద విపరీతమైన ద్వేషం ప్రదర్శించేవారిని  వెనకేసుకొస్తున్న జగన్ వైఖరి కారణంగానే.. తాజాగా శ్రీకాకుళం జిల్లా పాతపట్నంలో మరో రెండు ఆలయాలు ధ్వంసమయ్యాయి. ఆంజనేయస్వామి గుడిని కొట్టేసి విగ్రహాన్ని దగ్గరలోనే ఉన్న బావిలో పడేయడం హిందూ భక్తుల ఆగ్రహానికి కారణమవుతోంది. నిత్య పూజలు అందుకునే ఆంజనేయస్వామి విగ్రహం తమ కళ్ల ముందే బావిలో పడేస్తుంటే ఏం చేయాలో, ఎవరిని నిలదీయాలో తెలియక అమాయకులైన పాతపట్నం గ్రామప్రజలు  నిశ్చేష్టులై చూస్తూ ఉండిపోయారు. ఆ దృశ్యాలు కాస్తా కొందరు విలేకరుల దృష్టికి రావడంతో ఈ అరాచకం బయటపడింది.  శ్రీకాకుళం జిల్లా పాతపట్నంలో ఫ్లైఓవర్ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. అయితే స్థానిక పెట్రోల్ బంకు దగ్గర నుంచి ఫ్లైఓవర్ వెళ్తోంది. ఆ పెట్రోల్ బంకు వద్దనే ఆంజనేయస్వామి గుడి ఉంది. అయితే ఫ్లైఓవర్ నిర్మాణం కోసం వచ్చిన సిబ్బంది ఆలయాన్ని పూర్తిగా కొట్టేయాలంటూ ముందుకొచ్చారు. స్థానికులు, గుడి పూజారి అధికారుల ముందుకొచ్చి ఒక గంట సమయం ఇవ్వాలని ఎంతో ప్రాధేయపడ్డా వినకుండా అప్పటికప్పుడే ఆంజనేయస్వామి గుడిని పూర్తిగా నేలమట్టం చేశారు. గుడిని నేలమట్టం చేయడం ఒక ఎత్తయితే... ప్రతిరోజూ పూజలందుకునే ఆంజనేయస్వామి విగ్రహం మీద కక్ష కట్టినట్టు.. దాన్ని బావిలో పడేయడాన్ని మాత్రం స్థానికులు జీర్ణించుకోలేకపోతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఆంజనేయస్వామి భక్తుల మనోభావాలు, హిందువుల సెంటిమెంట్లు దారుణంగా గాయపడ్డాయి. గుడిని గానీ, ఏదైనా ప్రార్థనా స్థలాన్ని గానీ తొలగించాలంటే ముందుగా నోటీసులు ఇవ్వాల్సి ఉంటుంది. వ్యక్తిగత ఆస్తికి ఇచ్చేపాటి విలువ కూడా హిందువుల ఆరాధ్య దైవానికి ఇవ్వకపోవడంపై ప్రజలంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎలాంటి ముందస్తు నోటీసులు జారీ చేయకుండా, కనీసం విగ్రహాన్ని తరలించే సమయం కూడా ఇవ్వకుండా కక్ష కట్టినట్టు వ్యవహరించడమేంటని ప్రజలంతా నిలదీస్తున్నారు. ఈ గుడినే నమ్ముకున్న పూజారి కుటుంబం రోడ్డున పడి విలపిస్తోంది. గుడినే జీవనాధారంగా బతుకుతున్న తమకు ఇప్పుడు ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితి ఏర్పడిందని వాపోతున్నారు. పాతపట్నం ప్రజల హాహాకారాలు ఏమాత్రం పట్టించుకోకుండా ఫ్లైఓవర్ నిర్మాణకర్తల విధ్వంసకాండ కొనసాగింది. అక్కడే ఉన్న నీలమణి దుర్గమ్మ గుడి మీద కూడా ప్రతాపం చూపారు. ఉత్తరాంధ్రుల ఆరాధ్య దైవం, ఆంధ్రా-ఒడిశా సరిహద్దు ప్రాంతాల ప్రజలు ఎంతో దైవంగా కొలిచే అమ్మవారి గుడిని సగభాగం కొట్టేశారు. దీంతో ఆ ప్రాంతమంతా భయానకమైన వాతావరణం కమ్ముకొంది. స్థానిక ప్రజలంతా ఈ అరాచకాన్ని ఆపేదెవరు.. తమ గోడు వినేవారెవరు... అంటూ రోదిస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యేకైనా చెప్పుకునే అవకాశం ఇవ్వకుండా, తమకు సమయం ఇవ్వకుండా ఇలా ఏకపక్ష నిర్ణయాలు తీసుకొని రెండు గుళ్లను కొట్టేయడమేంటని ప్రజలు నిలదీస్తున్నారు. మరి జగన్ ఈ విషయం మీద ఎలా స్పందిస్తారో చూడాలంటున్నారు స్థానికులు.

బుర్జ్ ఖలీఫాపై మెరిసిన బతుకమ్మ.. తెలంగాణకే గర్వకారణమన్న కవిత

తెలంగాణకే ప్రత్యేకమైన పూల పండుగ బతుకమ్మ. సంస్కృతి, సంప్రాదాయాలకు నిలువెత్తు సాక్ష్యంగా నిలిచే బతుకమ్మ సంబరాలు విజయదశమికి ముందు తొమ్మిది రోజుల పాటు ఘనంగా జరుగుతాయి. ప్రపంచంలో పూలను పూజించే ఏకైకం పండుగగా గుర్తింపు ఉంది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటయ్యాక బతుకమ్మ పండుగ విశ్వవ్యాప్తమైంది.  ప్రపంచంలోనే అతిపెద్దదైన దుబాయ్‌లోని బుర్జ్ ఖలీఫాపై తెలంగాణ బతుకమ్మ కనువిందు చేసింది. శనివారం రాత్రి రెండుసార్లు.. 9.40 గంటలకు ఒకసారి, 10.40 గంటలకు మరోసారి మూడు నిమిషాలపాటు బుర్జ్ ఖలీఫాపై బతుకమ్మ వీడియోను ప్రదర్శించారు.  తెలంగాణ, ముఖ్యమంత్రి కేసీఆర్ ఫొటోలతోపాటు జైహింద్, జై తెలంగాణ, జై కేసీఆర్ అనే నినాదాలను కూడా ప్రదర్శించారు.   బుర్జ్ ఖలీఫాపై మెరిసిన బతుకమ్మను ప్రపంచవ్యాప్తంగా లక్షలాదిమంది వీక్షించారు. ఏఆర్ రెహమాన్ సంగీత దర్శకత్వంలో రూపొందించిన పాటతో పాటు రంగురంగుల పూలతో అలంకరించిన బతుకమ్మ బుర్జ్ ఖలీఫాపై కనిపించగానే, కార్యక్రమానికి హాజరైన తెలంగాణ ప్రవాసులు జై తెలంగాణ, జై కేసీఆర్ అంటూ నినదించారు. తెలంగాణ మహిళలతో కలిసి ఎమ్మెల్సీ కవిత బుర్జ్ ఖలీఫా వద్ద బతుకమ్మ ఆడారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. బుర్జ్ ఖలీఫాపై బతుకమ్మను ప్రదర్శించడం ఒక్క తెలంగాణకే కాదని, మొత్తం దేశానికే గర్వకారణమని అన్నారు. బతుకమ్మ ప్రదర్శనకు సహకరించిన యూఏఈ ప్రభుత్వానికి, బుర్జ్ ఖలీఫా నిర్వాహకులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నట్టు పేర్కొన్నారు

టీడీపీ సీనియర్ నేత కాట్రగడ్డ బాబు కన్నుమూత..

తెలుగుదేశం పార్టీలో విషాదం నెలకొంది. కృష్ణా జిల్లాకు చెందిన  టీడీపీ సీనియర్ నేత కాట్రగడ్డ బాబు కన్నుమూశారు. మధ్యాహ్నం ఆయనకు గుండె నొప్పి రావడంతో  ప్రయివేట్ ఆసుపత్రి లో చేరారు. అయితే వైద్యం అందిస్తుండగానే.. సాయంత్రం కార్డియాక్ అరెస్ట్ తో తుది శ్వాస విడిచారు కాట్రగడ్డ బాబు. గత 25 ఏళ్లుగా బెజవాడ నగరంలో టీడీపీ పార్టీలో వివిధ పదవుల్లో కొనసాగారు కాట్రగడ్డ బాబు. దశాబ్ద కాలంగా పేదలకు ఉచితంగా మందులు పంపిణీ చేశారు. క్లిన్ అండ్ గ్రీన్ వంటి సేవ కార్యక్రమాలు నిర్వహించారు. తెలుగు దేశం పార్టీ కార్యకర్తలకు ఆయన నిత్యం అందుబాటులో వుండేవారు. కాట్రగడ్డ బాబు మృతిపట్ల టీడీపీ నేతలు తీవ్ర సంతాపం తెలిపారు. 

రాజస్థాన్, యూపీలోకీ చొచ్చుకొచ్చిన ఖలిస్తాన్.. కొత్త మ్యాప్ కలకలం

ఇస్లామిక్ టెర్రరిజం మరో కొత్త టర్న్ తీసుకుంటోంది. భారత్ లో చిచ్చు పెట్టడానికి దొరికిన అన్ని అవకాశాలనూ సద్వినియోగం చేసుకుంటోంది. సిక్కులను శాశ్వతంగా భారత్ నుంచి దూరం చేసే కుట్రను తీవ్రతరం చేసింది. ఖలిస్తాన్ పేరుతో సరికొత్త మ్యాప్ ను విడుదల చేసింది. ఈ నెల 31న లండన్ లోని క్వీన్ ఎలిజబెత్ సెంటర్ లో జరిగే రెఫరెండంకు ప్రిపరేషన్లో భాగంగా విడుదల చేసిన తాజా మ్యాపును ప్రపంచమంతా ఖండిస్తోంది. సిక్కుల కోసం ప్రత్యేక దేశం కావాలంటున్న డిమాండ్ కు సిక్కుల నుంచే మద్దతు లేకపోవడం గమనించాల్సిన అంశం. ఈ నెలాఖరున లండన్లో జరిగే రెఫరెండం ద్వారా యావత్ సిక్కుజాతిని ఖలిస్తాన్ వైపు కదిలించాలని కొందరు వేర్పాటువాదులు, ఉగ్రమూకలు కలిసి పన్నాగం పన్నుతున్నాయి. ఖలిస్తాన్ డిమాండ్ ఇప్పటిదే కాకపోయినా.. కాలం చెల్లిన, ప్రజల మద్దతు దొరకని ఆ డిమాండ్ కు మాత్రం సోషల్ మీడియా కారణంగా ప్రచారమైతే పెరుగుతోంది.  ఈ క్రమంలో ఈ నెలాఖరున లండన్లో సిక్కులతో ఓ రెఫరెండం నిర్వహించాలని సిఖ్స్ ఫర్ జస్టిస్ (ఎస్.ఎఫ్.జె) నిర్ణయించింది. తాజాగా విడుదల చేసిన మ్యాపులో భారత్ లోని పూర్తి పంజాబ్ తో పాటు యూపీ, రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్, ఢిల్లీ రాష్ట్రాలను కూడా చేర్చారు. దీనిపై భారత్ నుంచే కాక ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇండియన్ డయాస్పోరా అగ్గిమీద గుగ్గిలం అవుతోంది. అసలు సిక్కుల తొలి గురువు నానక్ దేవ్ జన్మస్థలమైన కర్తార్ పూర్, నన్కానా సాహిబ్ (పాకిస్తాన్లో ఉన్నాయి) గ్రామాలు తాజా మ్యాపులో లేకపోవడంతో ఈ దుశ్చర్య ఎవరిదో ప్రపంచానికి మరోసారి తేటతెల్లమవుతోంది. సిక్కుల కోసం సొంత దేశం కావాలంటున్న ఖలిస్థాన్ ఉగ్రవాదులు పాకిస్తాన్లోని నానక్ జన్మస్థలాన్ని విస్మరించడం గమనించాల్సిన అంశం. దీనివెనుక పాక్ ఉగ్రవాద శిక్షణా సంస్థ అయిన ఐ.ఎస్.ఐ హస్తం ఉందని తాజా దృష్టాంతంతో తేలిపోయిందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. లండన్ లో రెఫరెండాన్ని ప్రస్తావిస్తూ ఎస్.ఎఫ్.జె తాజా మ్యాపును పోస్టు చేసిన కాసేపటికే నెటిజన్ల నుంచి తీవ్రమైన విమర్శలు ఎదుర్కొంటోంది. మ్యాపులో రాజస్థాన్ లోని జోధ్ పూర్, గంగానగర్ వంటి జిల్లాలను కూడా చేర్చడంపై రాజస్థాన్ పౌరులు పాక్ కుట్రపై మండిపడుతున్నారు. పాక్ లో ఉన్న కర్తార్ పూర్ ను అడిగే దమ్ములేని ఆటబొమ్మలు ఖలిస్తానీ వాదులంటూ పంజాబ్ లోని నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు.  భారత్ లో చిచ్చు పెట్టేందుకు ఉగ్రవాదులను చాపకింద నీరులా పంపిస్తున్న పాకిస్తాన్... సిక్కులను నయానా, భయానా లొంగదీసుకుంటోంది. పాక్ లో మైనారిటీలుగా ఉన్న హిందువులు, సిక్కులను మతమార్పిళ్లకు గురిచేస్తూ, వారి ఆస్తులను కబ్జా చేస్తూ దేశం నుంచి పారిపోయేలా చేస్తున్నారు. అయితే ఖలిస్తాన్ అనే సెంటిమెంట్ ను ఆసరా చేసుకొని సిక్కుల ప్రత్యేక ప్రాంతానికి కుట్రపూరితంగా మద్దతిస్తూ, వారి వేర్పాటువాదానికి అవసరమైన వనరులు సమకూరుస్తూ లండన్లో ఉగ్రవాద సంస్థలతో కలిసి ఈ రెఫరెండం నిర్వహిస్తోంది.  ఇటీవల పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ చేసిన వ్యాఖ్యలను నెటిజన్లు గుర్తు చేసుకోవడం విశేషం. పంజాబ్ పీసీసీ చీఫ్ గా ఎంపికైన నవజోత్ సింగ్ సిద్ధూను అత్యంత ప్రమాదకరమైన వ్యక్తిగా కెప్టెన్ అభివర్ణించారు. సిద్ధూ మీద ఇతర ఆరోపణలేవీ చేయని కెప్టెన్... ఆయన వైఖరిని మాత్రమే ప్రస్తావించారు. దేశానికి సరిహద్దులో ఉన్న పంజాబ్ నిర్ణయాలు సిద్దూలాంటి వ్యక్తుల చేతుల్లోకి వెళితే దేశానికి పూడ్చుకోలేని నష్టంగా మారుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో గురునానక్ జయంతి ఉత్సవాల సందర్భంగా ఇమ్రాన్ ఖాన్ ఆహ్వానంతో ఎగిరి గంతేసిన సిద్దూ పాక్ లో పర్యటించారు. అయితే ఇటీవల సిక్కులను టార్గెట్ చేస్తూ మత మార్పిళ్లు, లవ్ జిహాద్ లు, ఆస్తుల లూటీలు జరుగుతున్నా సిద్దూ ఏనాడూ నోరు మెదపలేదు. బహుశా ఇలాంటి నేపథ్యాన్ని దృష్టిలో ఉంచుకునే కెప్టెన్ అమరీందర్ సిద్ధూ గురించి తీవ్రమైన అనుమానం వ్యక్తం చేసి ఉంటారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 1984లో ఖలిస్తాన్ ఉగ్రవాదులను ఏరిపారేసేందుకే ఇందిరాగాంధీ ఆపరేషన్ బ్లూ స్టార్ నిర్వహించారు. అందుకు కాంగ్రెస్ భారీ మూల్యం కూడా చెల్లించింది. మరి ఖలిస్తాన్ మద్దతుదారులు ఇప్పుడు ఏకంగా భారత్ లోని అనేక రాష్ట్రాలను మ్యాపులో చేర్చి విడుదల చేస్తే కాంగ్రెస్ ఎలా రెస్పాండ్ అవుతుందో చూడాలంటున్నారు నెటిజన్లు.