పార్టీ నేతలకు వైసీపీ ఎమ్మెల్యే వార్నింగ్.. రూ.20కోట్లకు దావా!.. ఎందుకో తెలుసా?
posted on Oct 26, 2021 @ 1:31PM
అసలే అధికార పార్టీ. అందులోనూ అరాచకానికి కేరాఫ్. నోరున్న నేతలదే హవా. ఎంతగా నోరు వాడితే పార్టీలో అంతగా అందలం. మంత్రులుగా ఉన్నవారు తమ పదవిని కాపాడుకోడానికి.. ఎమ్మెల్యేలు మంత్రులు అవడానిక.. పార్టీ లీడర్లు వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ దక్కించుకోవడానికి.. ఇలా వైసీపీ వాళ్లంతా నమ్ముకుంటున్న ఏకైక మార్గం.. రచ్చ..తిట్లు..బూతులు..అరాచకం..విధ్వంసం. ఈ స్ట్రాటజీ బాగా వర్కవుట్ అవుతుండటంతో.. ప్రతిపక్షంతో పాటు స్వపక్షం మీద కూడా ఇదే వ్యూహాన్ని అమలు చేస్తున్నారు కొందరు నాయకులు. తాజాగా, ఉదయగిరి వైసీపీలో కుమ్ములాటలు తారాస్థాయికి చేరుకున్నాయి. వైసీపీ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డిపై జెడ్సీటీసీ చేజర్ల సుబ్బారెడ్డి ఇటీవల సంచలన ఆరోపణలు చేశారు. ఎమ్మెల్యే అవినీతి చిట్టా మొత్తం మీడియా ముందు పెట్టేశారు. వైసీపీ ప్రజాప్రతినిధులు ఏ రేంజ్‌లో దోపిడీకి, అక్రమాలకు పాల్పడుతున్నారో చేజర్ల మాటలను బట్టి తెలుస్తోంది.
తనపై చేసిన విమర్శలపై సొంతపార్టీ నేతలపై తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి. చిత్తూరులో గోడలకు నీళ్లు పట్టుకొని బతికినవాళ్లు తన గురించి విమర్శిస్తే తరిమి కొడతానని.. తన దగ్గర ఎదిగి తననే విమర్శిస్తారా? అంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. చేజర్ల సుబ్బారెడ్డిపై రూ.20 కోట్లకు పరువు నష్టం దావా వేస్తానని ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి హెచ్చరించారు.
జిల్లాల వారీగా వైసీపీ నేతల్లో కుమ్ములాటలు తీవ్ర స్థాయికి చేరాయి. మంత్రులు, ఎమ్మెల్యేలు, కార్యకర్తలు ఇలా పార్టీ శ్రేణులంతా అవినీతి, అక్రమాలతో చెలరేగిపోతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇటీవల కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు అందుకు నిదర్శనం అంటున్నారు. వైసీపీ నేతలు లంచవతారాలుగా మారిపోయారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు నల్లపురెడ్డి. ఏపీలో దాదాపు అన్ని నియోజకవర్గాల్లోనూ వైసీపీ నేతలు అవినీతిలో పోటీ పడుతున్నారు. వాటాల విషయంలో వర్గ పోరు నడుస్తోంది. ఫలితంగా.. ఇలా ఒకరిపై ఒకరు ఆరోపణలు, విమర్శలు చేసుకుంటూ.. బజారున పడుతున్నారు వైసీపీ నాయకులు. ఏకంగా ఎమ్మెల్యే మేకపాటి అవినీతిపైనే ఆయన అనుచరులు ఆరోపణలు చేయడం.. ఎమ్మెల్యే నల్లపురెడ్డి తన అనుచరుల అవినీతిపై హెచ్చరించడం.. వైసీపీ దోపిడీ బ్యాచ్‌గా మారిందనే విమర్శలకు బలం చేకూర్చుతున్నాయని అంటున్నారు. యధా రాజా.. తదా నేతలని కూడా అంటున్నారు.