ఒక్కొక్కరిని చెండాడుతా.. సుప్రీంకోర్టు నన్నేం ఏం చేయలేదు! సిద్ధిపేట కలెక్టర్ కామెంట్ల కలకలం..
posted on Oct 26, 2021 @ 11:30AM
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సొంత జిల్లాకు ఆయన కలెక్టర్. ఆర్థికశాఖ మంత్రి హరీష్ రావు నియోజకవర్గం. ఆ కలెక్టర్ పై ఇప్పటికే ఎన్నో ఆరోపణలు ఉన్నాయి. సుదీర్ఘంగా కాలంగా ఆయన సిద్దిపేటలోనే విధులు నిర్వహిస్తున్నారు. ఎన్నికల సమయంలో కొన్ని రోజులు మార్చినా.. తిరిగి అక్కడే పోస్టింగ్ ఇచ్చారు. సీఎం కేసీఆర్ కు బినామీగా కలెక్టర్ వ్యవరిస్తున్నారనే ఆరోపణలను విపక్ష నేతలు చేశారు. దుబ్బాక ఉప ఎన్నికల సమయంలో ఆయన టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తారనే ప్రచారం జరిగింది. ఇటీవల జరిగిన కోకాపేట భూముల వేలాన్ని దక్కించుకున్న రియల్ ఎస్టేట్ సంస్థలో ఆయనకు వాటాలున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. కేసీఆర్ బినామీ కాబట్టే.. అతని సంస్థకు ఖరీదైన భూములను తక్కువ ధరకు కట్టబెట్టారని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. గతంలో ఆయన అధికార పార్టీకి మద్దతుగా చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి.
ఇన్ని ఆరోపణలు ఉన్న సిద్ధిపేట జిల్లా కలెక్టర్ వెంకట్రామిరెడ్డి మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అగ్రికల్చర్ మీటింగ్‌లోఆయన అధికారులకు వార్నింగ్ ఇచ్చారు. ఈ యాసంగిలో వరి విత్తనాలు అమ్మకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. ఒకవేళ ఎవరైన వరి విత్తనాలు అమ్మినట్లు తెలిస్తే ఒక్కొక్కరిని చెండాడుతా, వేటాడుతా.. అంటూ కలెక్టర్ వెంకట్రామిరెడ్డి హెచ్చరించారు. వరి విత్తనాలు అమ్మె హక్కు ఎవరికీ లేదన్నారు. ఈ యాసంగిలో వరికి బదులుగా ప్రత్యామ్నాయ పంటల సాగుపై కలెక్టర్ ఆధ్వర్యంలో రెవెన్యూ, వ్యవసాయ అధికారులు, విత్తన సరఫరా చేసే డీలర్ల సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
‘‘యాసంగిలో ఏ ఒక్క డీలర్ కేజీ వరి విత్తనాలు కూడా అమ్మడానికి వీళ్లేదు. అలా అమ్మితే వెంటనే ఆ షాపును సీజ్ చేస్తాం. షాపును రీఓపెన్ చేయాలని సుప్రీం కోర్టు చెప్పినా, ప్రజాప్రతినిధులు చెప్పినా, నా పైఅధికారులు చెప్పినా నేను వినను. నేను కలెక్టర్‌గా ఉన్నన్ని రోజులు ఆ షాపు ఓపెన్ కానివ్వకుండా చేస్తా. ఒకవేళ డీలర్లు అమ్మితే సంబంధిత ఏఈవోలు, అధికారులు సస్పెన్షన్ అవుతారు.’’ అని సిద్ధిపేట కలెక్టర్ అన్నారు.
సిద్ధిపేట జిల్లా కలెక్టర్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. కలెక్టర్ తీరుపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ట్విట్టర్ వేదికగా ప్రభుత్వంపై విమర్శలు చేశారు. సిద్దిపేట కలెక్టరేట్‌లో విత్తనాలు, ఎరువుల డీలర్లతో జరిగిన సమావేశం వీడియోను పోస్ట్ చేస్తూ ట్వీట్ చేశారు.
‘రైతులు పండించిన ధాన్యాన్ని సేకరించలేక ప్రభుత్వం చేతులెత్తేసేంది. అందుకే ప్రభుత్వం విత్తనాల అమ్మకాన్ని నిలిపివేసేందుకు ఎత్తుగడలు వేస్తోంది. రాష్ట్రంలో వరి పండించే అవకాశం లేనప్పుడు మరి లక్షల కోట్లు వెచ్చించి సాగునీటి ప్రాజెక్టులు నిర్మించడం దేనికి.’’ అంటూ రేవంత్ ట్వీట్ చేశారు. దీనిపై నెటిజన్లు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. కలెక్టర్ హోదాలో ఉండి ఇలా బెదిరించడం ఏంటని నెట్టింట తీవ్రంగా చర్చ జరుగుతోంది.