ఏపీలో ముందస్తు ఎన్నికలకు స్కెచ్? కేసీఆర్ బాటలో జగన్..
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మనసులో ఏముంది? ఓ వంక అప్పుల ఊబిలో కూరుకుపోతున్న రాష్ట్రం, మరో వంక అప్పు తలుపులు కూడా మూసుకు పోతున్న వైనం. అయినా అప్పులు చేయందే పూట గడవని గడ్డు పరిస్థితి. తాజాగా మంగళవారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆర్బీఐ వద్ద సెక్యూరిటీల వేలం ద్వారా మరో వెయ్యి కోట్ల రూపాయల అప్పు తెచ్చుకుంది. ఇక రూ.10,500 కోట్ల వార్షిక రుణ పరిమితిలో మిగిలింది, ఆ పై రూ.500 కోట్లే. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇంకా ఐదు నెలలు మిగిలే ఉన్నాయి, ఈ ఐదు నెలలు బండి నడిచేదెలా? అయితే. కేంద్రం కాళ్లు పట్టుకోవాలి,కాదంటే వెంకన్న జేబులు కొట్టాలి, అదీ కాదంటే, ఆస్తులు అమ్మేయాలి లేదా మందు బాబుల, సామాన్యుల మీద దుడ్డుకర్రతో దాడి చేయాలి, చార్జీలు, పన్నులు పెంచాలి, అవసరం అయితే అదీ ఇదీ ఇంకొన్ని కూడా చేయవలసి రావచ్చును. కానీ, ఎంతగా దిగాజారినా, బెగ్, బారో, స్టీల్ సూత్రాలు ఎన్ని పాటించినా, మరో రెండున్నర సంవత్సరాలు బండి లాగించడం అయ్యే పని కాదు.
ఆ నిజం, మన కంటే ముఖ్యమంత్రి, అయన సలహాదారులకే బాగా తెలుసు.. అందుకే శ్రీ జగన్మోహన్ రెడ్డి దేవుని నమ్ముకుని, దేవుని దయతో ముందస్తు ఎన్నికలకు వెళ్ళాలని నిర్ణయానికి వచ్చారు. అవును, విశ్వసనీయ సమాచారం ప్రకారం ఏపీ సీఎం జగన్ రెడ్డి, ముందస్తు ఎన్నికలకు ముందడుగు వేస్తున్నారు. పొరుగు రాష్ట్రం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ 2018లో పాటించిన పద్ధతినే, ఇప్పుడు జగన్ రెడ్డి ఏపీలో ఫాలో అయ్యేందుకు ప్లాన్ సిద్ధం చేస్తున్నారు. ఇందులో భాగంగా,ఇప్పటికే, ప్రశాంత్ కిషోర్ టీమ్ కుడా రంగంలోకి దిగింది. సర్వేలు మొదలయ్యాయి.ఏరి వేతలు, కుడికాలు, తీసివేతలు, అన్నీ మొదలయ్యాయి.ప్రజాగ్రహానికి గురవుతున్న సిట్టింగ్ ఎమ్మెల్యేలకుహెచ్చరికలు వెళుతున్నాయి.
అయితే, ముఖ్యమంత్రి జగన్ రెడ్డిని భయపెడుతోంది ఒక్క ఆర్థిక పరిస్థితి మాత్రమే కాదు, జగన్ రెడ్డి రెండున్నరేళ్ళ పాలనలో అన్ని వ్యవస్థలు సుందర ముదనష్టంగానే తయారయ్యాయి. పాడుబడని వ్యవస్థంటూ ఏదీ మిగలలేదు.అన్ని వ్యవస్థలు ఒకే విధంగా అఘోరిస్తున్నాయి, అందుకు కళ్ళ ఎదుటే అనేక ఆధారాలు కనిపిస్తున్నాయి. శాంతి భద్రతల పరిస్థితి గురించి చెప్పనక్కరలేదు. ముఖ్యమంత్రి, పోలీసు బాసుల స్వీయ పర్యవేక్షణలో వైసీపీ ‘బీపీ’ బ్యాచ్ యద్దేచ్చాగా ఎవరి మీదనైనా దాడులు చేస్తుంది. అంతే కాదు, వైసీపీ పాలనతో ప్రజలు విసిగి వేసారి పోయారు. ఒక్కొక్క వర్గం తిరగ్ బడుతోంది. ప్రస్తుత పరిస్థితినే గమనించినా, ఓ వంక జగన్ రెడ్డి ప్రభుత్వం తీసుకున్న ఎయిడెడ్ స్కూల్స్ మూత నిర్ణయానికి వ్యతిరేకంగా ఆందోళన సాగుతోంది. “నీ అమ్మ ఒడి వద్దు, ఇంగ్లీష్ మీడియం వద్దు, నాడు నేడు కుట్రలు వద్దు, మా బడులు మూత పెట్టవద్దు” అంటూ తల్లి తండ్రులు ఆందోళన చేస్తున్నారు.
మరో వంక రేషన్ డీలర్లు రోడ్డెక్కారు. ఉద్యోగులు, నిరుద్యోగులు, విద్యార్ధులు, ఉపాధ్యులు ఎవరికీ వారు ఎవర్గానికి ఈ వర్గం ఆందోళన బాట పడుతున్నారు. ఇలా రోజు రోజుకు పరిస్థితి విషమిస్తున్ననేపధ్యంలో ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ముందస్తు ఎన్నికలకు సిద్దమవుతున్నారని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. రాష్ట్రంలో పరిస్థితులే కాకుండా, జాతీయి స్థాయిలో చోటు చేసుకుంటున్న పరిణామాలు కూడా జగన్ రెడ్డిని భయ పెడుతున్నాయి అంటున్నారు. కాంగ్రెస్ పార్టీలో కదలిక వచ్చిన నేపధ్యంలో 2024 లోక్ సభ ఎన్నికల నాటికి, జాతీయ రాష్ట్ర స్థాయిల్లో, రాజకీయ సమీకరణలు మారే సంకేతాలు స్పష్టమవుతున్నాయి.ఈ నేపధ్యంలో లోక్ సభ ఎన్నికలతో పాటుగా అసెంబ్లీ ఎన్నికల జరిగితే అసెంబ్లీ ఫలితాలపై జాతీయ అంశాలు ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. అందుకే, జగన్ రెడ్డి ముందు చూపుతో ముందడుగు వేస్తున్నారని, ముందస్తు ఎన్నికల దిశగా అడుగులు వేస్తున్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం.
అలాగే,అన్నీ అనుకున్నట్లు జరిగితే, 2023 ప్రదమార్దంలో, ఏపీ అస్సెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశం ఉందని అంటున్నారు. అయితే ముందస్తుకు వెళ్ళినంత మాత్రం చేతనే జగన్ రెడ్డికి ప్రజలు మరో అవకాశం ఇస్తారా, లేక, ‘ఒక్క ఛాన్స్ అన్నావ్, ఇచ్చాం, పాలన చూశాం, సత్తా తెలిసిపోయింది .. ఇక చాలు పోయిరా అనిసాగనంపుతారా,అనేది .. చెప్పేందుకు ఇంకొంత సమయం అవసరం. అయితే, బటన్ నొక్కి పైసలు జనం ఖాతాల్లోకి వేసినంత మాత్రాన జనం సంతృప్తి చెందుతారు అనుకోవడం పొరపాటే అవుతుందని అంటున్నారు.