ప్రజా ప్రస్థానం యాత్రకు బ్రేక్.. దీక్షకు దిగిన షర్మిల.. ఎందుకంటే..?
posted on Oct 26, 2021 @ 2:58PM
పట్టుదల మామూలుగా లేదు. చిత్తశుద్ధిలో అసలేమాత్రం కాంప్రమైజ్ కావట్లేదు. తెలంగాణలో వైఎస్సార్‌టీపీ ఏర్పాటు చేయడమే ఓ సాహసం అనుకుంటే.. ప్రజా ప్రస్థానం పేరుతో సుదీర్ఘ పాదయాత్ర చేస్తుండటం షర్మిలకే సాధ్యం అంటున్నారు. రాజన్న రాజ్యం కోసమంటూ.. తండ్రి వైఎస్సార్ అడుగుజాడల్లో నడుస్తూ.. పాదయాత్రతో ప్రజలకు మరింత చేరువవుతున్నారు.
అయితే.. తెలంగాణలో షర్మిల పార్టీ ప్రస్థానం నిరుద్యోగుల సమస్యలపై పోరాటంతోనే మొదలైంది. నిరుద్యోగ సమస్యలపై ఇందిరాపార్క్ దగ్గర దీక్షతో ఘనంగా ఉనికి చాటుకున్నారు. ఇక, ప్రతీ మంగళవారం నిరుద్యోగ దీక్షలతో చిత్తశుద్ధి చాటుకుంటున్నారు షర్మిల. అందుకే, పాదయాత్రతో ప్రజల మధ్యలో ఉన్నా.. నిరుద్యోగ దీక్షలను మాత్రం వీడటం లేదు. ప్రతీ మంగళవారం తాను ఎక్కడ ఉంటే అక్కడే.. దీక్ష చేస్తూ కమిట్‌మెంట్ చాటుకుంటున్నారు.
‘ప్రజా ప్రస్థానం’ పేరుతో పాదయాత్ర చేపట్టిన వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు షర్మిల కందుకూరు మండలం తిమ్మాపూర్‌లో నిరుద్యోగుల కోసం నిరాహార దీక్ష చేస్తున్నారు. దీక్షా శిబిరం దగ్గర వైఎస్సార్ విగ్రహానికి పూలమాల వేసి.. దీక్షలో కూర్చున్నారు. నిరాహార దీక్ష సందర్భంగా మంగళవారం పాదయాత్రకు బ్రేక్ ఇచ్చారు వైఎస్ షర్మిల.