టీఆర్ఎస్ ప్లీనరీలో తెలుగు తల్లి! రేవంత్ రెడ్డి దెబ్బకు మైండ్ బ్లాంక్...
posted on Oct 26, 2021 @ 10:25AM
తెలంగాణలో అధికారంలో ఉన్న తెలంగాణ రాష్ట్ర సమితీ ద్వదశాబ్ది వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకుంది. హైదరాబాద్ హైటెక్స్ లో జరిగిన ప్లీనరీ అట్టహాసంగా సాగింది. టీఆర్ఎస్ అధ్యక్షుడిగా తొమ్మిదోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు కేసీఆర్. పార్టీ 20వ పండుగ కావడంతో హైదరాబాద్ మొత్తం గులాబీమయం చేసింది అధికార పార్టీ. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. విపక్షాలు ఆందోళన కూడా చేశాయి. గ్రేటర్ పరిధిలో బ్యానర్లు, ఫ్లెక్సీలపై నిషేదం ఉండగా.. ఇంత పెద్ద స్థాయిలో ఎలా ఏర్పాటు చేశారని ప్రశ్నించాయి.
టీఆర్ఎస్ పార్టీ ప్లీనరీపై టీపీసీసీ అధ్యక్షుడు, ఎంపీ రేవంత్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. జలదృశ్యం నుంచి జనదృశ్యం అని ఆ పార్టీ నేతలు చెబుతున్నారని, కానీ ఉద్యమం ముసుగులో గులాబీ పార్టీని విస్తరించారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. సామాన్య ప్రజలు నగరంలో టులెట్ బోర్డ్ పెడితే జీహెచ్ఎంసీ 2 వేల జరిమానా వేస్తుందని, కాని హైదరాబాద్ కట్టిన టీఆర్ఎస్ జెండాలు వాళ్లకు కనిపించలేదా అని ఆయన ప్రశ్నించారు. టీఆర్ఎస్ నేతలకు ఎంత ఫైన్ వేస్తారని బల్దియా అధికారులను నిలదీశారు. కాంగ్రెస్ నేత విగ్రహాలకు సైతం టీఆరెఎస్ జెండాలు కట్టారన్నారు. ప్లీనరీలో తెలంగాణ అమర వీరులను కూడా స్మరించుకోలేదన్నారు. జల దృశ్యంలో మొదలైన టీఆర్ఎస్ ప్రస్థానం అవినీతి దృశ్యంగా దోపిడీ దృశ్యంగా మారిందని రేవంత్ రెడ్డి విమర్శించారు.
టీఆర్ఎస్ ప్లీనరీ సమావేశంలో తెలంగాణ తల్లి కాకుండా తెలుగు తల్లిని ఫ్లెక్సీ పెట్టారని రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణ తల్లిని కాదని తెలుగు తల్లికి పెద్ద పీట వేశారన్నారు. ఆంధ్రా కాంట్రాక్టర్ల కోసమే వేదికపై తెలుగు తల్లిని పెట్టారని విమర్శించారు. మొదటి నుంచి టీఆర్ఎస్ లో ఉన్న వాళ్లు, రాష్ట్రం కోసం ప్రాణాలు అర్పించిన అమరులు గుర్తురాలేదన్నారు. 2001 జలదృశ్యంలో మొదలైన టీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు రూ.వేల కోట్లకు ఎగపాకిందని విమర్శించారు. కొండా లక్ష్మణ్ బాపు, బియ్యాల జనార్దన్ రావు, జయశంకర్, కేశవరావు, గుడ అంజయ్య, సాంబశివుడు, రహ్మాన్, చివరి నిమిషం వరకు కేసీఆర్ కోసం పనిచేశారన్నారు. గాదె ఇన్నయ్య, పాశం యాదగిరి, పాపారావు, విజయ రామరావు, ఆలే నరేంద్ర, విజయశాంతి.. ఎవర్ని గుర్తు చేసుకోలేదని విమర్శించారు.
కేసీఆర్, కేటీఆర్ ఇద్దరి బొమ్మలే ప్లీనరీలో పెట్టుకున్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఏడున్నర ఏళ్ల పాలనపై చర్చకు సిద్ధమా అని సవాల్ చేశారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు లేక, విద్యార్థులకు స్కాలర్ షిప్ లేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. కేజీ టు పీజీ వరకు ఉచిత విద్యపై చర్చకు సిద్ధమా అన్నారు. ఓయూకు ఎంత నిధులు కేటాయించారో తెలపాలన్నారు. యువతను ఉద్యోగాలు ఇవ్వకపోవడంతో ప్రాణాలు తీసుకుంటున్నారని రేవంత్ రెడ్డి తెలిపారు. కొత్తలో లక్ష 7 వేల ఖాళీలున్నాయని కేసీఆర్ చెప్పారని, బిశ్వల్ కమిటీ రిపోర్ట్ కూడా లక్ష 91 వేల ఉద్యోగాలు ఖాళీలున్నాయని చెప్పిందన్నారు. సింగరేణి, విద్యుత్, ఆర్టీసీ, నిరుద్యోగుల సమస్యలపై కవులు, కళాకారులు, జర్నలిస్టులు, తెలంగాణ సమాజం అంతా కలిసి పోరాటం చేశాలని కోరారు. ఉద్యమకారులపై పెట్టిన కేసులు ఎందుకు తొలగించలేదని ప్రశ్నించారు. కల్వకుంట్ల కవిత, కేటీఆర్, కేసీఆర్ పై పెట్టిన కేసులు తొలగించుకున్నారని విమర్శించారు.
పార్టీ కార్యాలయాల పేరుతో సీఎం కేసీఆర్ రూ.1000 కోట్ల ఆస్తులను సంపాదించుకున్నారని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. ఫిక్సిడ్ డిపాజిట్లు రూ.420 కోట్లు ఉన్నాయంటే.. అవి ఎలా వచ్చాయని ప్రశ్నించారు. టీఆర్ఎస్ బైలాస్ మార్చారంటే కేసీఆర్ స్లీపింగ్ కేటీఆర్ వర్కింగ్ అని భవిష్యత్ ముఖ చిత్రం తెలుస్తుందని రేవంత్ రెడ్డి అన్నారు