ఉత్తుత్తి అరెస్టులేనా?, బొండాపై మరోకేసు.. కలెక్టర్‌పై రేవంత్ ఫైర్.. టాప్‌న్యూస్ @1pm
posted on Oct 26, 2021 @ 1:03PM
1. టీడీపీ నేత బొండా ఉమాపై అరండల్‌పేట పోలీసులు కేసు నమోదు చేశారు. సీఎంపై అనుచిత వ్యాఖ్యలు చేశారని మేయర్ కావటి మనోహర్ నాయుడు ఫిర్యాదు చేశారు. బొండా ఉమాపై 153 ఎ, 294 బి, 504, 505, 506 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.
2. టీడీపీ ఆఫీస్‌పై దాడి కేసులో పోలీసుల ప్రకటనలపై టీడీపీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. దాడి కేసులో 24 మందిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు ప్రకటించారు. మూడు దఫాలుగా ఎస్పీ కార్యాలయం ప్రకటన చేసింది. కాగా ఎవ్వరినీ అదుపులోకి తీసుకోలేదని క్రిందిస్థాయి సిబ్బంది చెబుతోంది. కేవలం నోటీసులు మాత్రమే ఇచ్చామని విచారణ సిబ్బంది తెలిపింది.
3. వరి విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని సీడ్ డీలర్లను సిద్దిపేట కలెక్టర్ బెదిరించడం వరి రైతులను బ్లాక్ మెయిల్ చేయడమేనని టీపీసీసీ అధ్యక్షుడు, ఎంపీ రేవంత్‌రెడ్డి మండిపడ్డారు. ‘సుప్రీంకోర్టు నుంచి ఆర్డర్ తెచ్చుకున్నా ఊరుకోను’ అంటూ కలెక్టర్ ఒక నియంతలా మాట్లాడుతున్నారన్నారు. ప్రభుత్వం వరి రైతుల బాధ్యతల నుంచి తప్పుకునేందుకే ఈ ఎత్తుగడ అన్నారు. వరి పంటలు వేయనప్పుడు ఇక లక్షల కోట్లు వ్యయం చేసి ప్రాజెక్టుల నిర్మాణాలు ఎందుకని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.
4. వైసీపీ నేతలకు ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఇటీవల తనపై అవినీతి ఆరోపణలు చేసిన జెడ్పీటీసీ చేజర్ల సుబ్బారెడ్డి, తదితర నేతలపై మేకపాటి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. చిత్తూరులో గోడలకు నీళ్లు పట్టుకొని బతికినవాళ్లు తన గురించి విమర్శిస్తే తరిమి కొడతానని.. తన దగ్గర ఎదిగి తననే విమర్శిస్తారా? అని మండిపడ్డారు. రూ.20 కోట్లకు పరువు నష్టం దావా వేస్తానని ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి హెచ్చరించారు.
5. ఏపీలో నిరసనకు దిగిన వారి గొంతులు నొక్కేస్తున్నారని మాజీ మంత్రి దేవినేని ఉమ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీలో ప్రస్తుతం అసాధారణ పరిస్థితులు నెలకొన్నాయని.. రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్ చేశారు. ‘‘ఏపీలో నిరసన గొంతులు నొక్కేస్తున్నారు, అసాధారణ పరిస్థితులు నెలకొన్నాయి. రాష్ట్రపతి పాలన విధించాలి. డ్రగ్స్‌పై విచారణకు ఆదేశించి, డీజీపీని రీకాల్ చేయాలి. దాడులపై సీబీఐ విచారణ చేయాలి. అధికార పార్టీ అవినీతి, అరాచకాలపై టీడీపీ పోరును దాడులతో ఆపలేరు’’ అని దేవినేని ఉమ అన్నారు.
6. కొవిడ్ మృతుల పరిహారం చెల్లింపుపై ఏపీ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. కొవిడ్‌తో మరణించిన వారి కుటుంబానికి రూ.50,000 మంజూరు చేసేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దరఖాస్తు నమునాను కూడా ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులలో పొందుపరిచింది. రాష్ట్ర విపత్తు నిర్వహణ నిధి నుంచి చెల్లించేందుకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
7. హుజురాబాద్‌లో ప్రలోభాల పర్వం కొనసాగుతోందని.. ఊర్లను బార్లుగా మార్చి, మద్యం ఏరులు పారిస్తున్నారని ఈటల రాజేందర్ అన్నారు. ప్రభుత్వ, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను బెదిరింపులకు గురిచేస్తున్నారన్నారు. పౌరులు ఏ పార్టీలో ఉండాలో టీఆర్ఎస్ ప్రభుత్వం నిర్ణయిస్తోందన్నారు. మీడియాలో తన మొహం కనిపించకుండా చేసేందుకు ఇప్పటికే 500 కోట్ల నల్లధనం ఖర్చు చేశారని ఆరోపించారు.
8. హుజురాబాద్ ఎన్నికలను గిన్నిస్ రికార్డులోకి ఎక్కించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి అన్నారు. సమాచార హక్కు చట్టంను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వీర్యం చేశాయని విమర్శించారు. కేసీఆర్ ప్రభుత్వం రైతుల మెడ చుట్టూ ఉరి తాడు బిగిస్తోందని అన్నారు. వరిసాగుపై జిల్లా కలెక్టర్ మాట్లాడిన పదాలను వెనక్కి తీసుకోవాలని చాడ వెంకటరెడ్డి డిమాండ్ చేశారు.
9. అమరావతి రైతుల మహా పాదయాత్రకు సీపీఐ మద్దతు ఇస్తున్నట్లు ఏపీ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ తెలిపారు. సుదీర్ఘకాలంగా అమరావతి రైతుల ఉద్యమం కొనసాగుతున్నా రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని విమర్శించారు. మహా పాదయాత్రకు అనుమతిపై డీజీపీ ఈనెల 28 లోపు వివరణ ఇవ్వాలని హైకోర్టు ఆదేశించిందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఇప్పటికైనా కళ్లు తెరిచి.. అమరావతిని రాజధానిగా కొనసాగిస్తూ ప్రకటన చేయాలని రామకృష్ణ డిమాండ్ చేశారు.
10. గ్రామ సచివాలయాల్లో మహిళా కార్యదర్శులను పోలీసులుగా నియమించడంపై దాఖలైన పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ, డీజీపీ, హోమ్ సెక్రటరీ, పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్, ఏపీపీఎస్సీ చైర్మన్లకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. రెవెన్యూలో 15 వేల మందిని మహిళా కార్యదర్శులుగా నియమించి పోలీసు విధులు అప్పగించడంపై పిటిషనర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. పోలీసు విధులు మహిళా కార్యదర్శులకు ఎలా ఇస్తారో చెప్పాలని హైకోర్ట్ ఆదేశించింది. వెంటనే కౌంటర్ దాఖలు చేయాలని ప్రతివాదులకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.