రేవంత్ రెడ్డి కారు ఎవరిది? ఆంధ్రా కాంట్రాక్టర్ దేనా?
posted on Oct 26, 2021 @ 12:49PM
తెలంగాణలో అధికార, ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. టీఆర్ఎస్ సర్కార్, సీఎం కేసీఆర్ తీరుపై పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నారు. అవినీతికి సంబంధించిన పలు ఆధారాలు బయటపెడుతున్నారు. సోమవారం జరిగిన టీఆర్ఎస్ ప్లీనరీపైనా సంచలన కామెంట్లు చేశారు. అయితే రేవంత్ రెడ్డి ఆరోపణలపై కౌంటర్ ఇచ్చారు గులాబీ లీడర్లు. బ్లాక్ మెయిలింగ్ తో కోట్లాది రూపాయలు కూడబెట్టారని ఆరోపించారు.
పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై సంచలన ఆరోపణలు చేశారు టీఆర్ఎస్ ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్. రేవంత్ రెడ్డి జీవితమంతా బ్లాక్ మెయిలింగే అన్నారు. ఎమ్మెల్యేను కొనుగోలు చేస్తూ కోట్లాది రూపాయలతో అడ్డంగా దొరికిన దొంగ రేవంత్ రెడ్డి అన్నారు. కాంట్రాక్టర్లను బెదిరించి వసూళ్లకు పాల్పడుతారని మండిపడ్డారు. ఆంధ్రా కాంట్రాక్టర్ల కోసమే ప్లీనరీ వేదికపై తెలుగు తల్లి ఫోటో పెట్టారన్న రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై సీరియస్ గా స్పందించారు ఎమ్మెల్యే కిషోర్ కుమార్. రేవంత్ రెడ్డి తిరుగుతున్న కారు ఆంధ్రా కాంట్రాక్టర్ ది కాదా అని ప్రశ్నించారు. కర్నూల్ కు చెందిన కాంట్రాక్టర్ సంస్థ పేరుతో రిజిస్టర్ అయిన కారులో రేవంత్ రెడ్డి తిరుగుతున్నారని, దాన్ని నిరూపించేందుకు తాను సిద్ధమన్నారు. రేవంత్ రెడ్డికి ధమ్ముంటే తాను చెప్పేది నిజం కాదని నిరూపించుకోవాలన్నారు గాదరి కిషోర్ కుమార్.
సోమవారం టీఆర్ఎస్ ప్లీనరీపై స్పందించిన రేవంత్ రెడ్డి.. ప్లీనరీ సమావేశంలో తెలంగాణ తల్లి కాకుండా తెలుగు తల్లిని ఫ్లెక్సీ పెట్టారని అన్నారు. తెలంగాణ తల్లిని కాదని తెలుగు తల్లికి పెద్ద పీట వేశారన్నారు. ఆంధ్రా కాంట్రాక్టర్ల కోసమే వేదికపై తెలుగు తల్లిని పెట్టారని విమర్శించారు. మొదటి నుంచి టీఆర్ఎస్ లో ఉన్న వాళ్లు, రాష్ట్రం కోసం ప్రాణాలు అర్పించిన అమరులు గుర్తురాలేదన్నారు. 2001 జలదృశ్యంలో మొదలైన టీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు రూ.వేల కోట్లకు ఎగపాకిందని విమర్శించారు. పార్టీ కార్యాలయాల పేరుతో సీఎం కేసీఆర్ రూ.1000 కోట్ల ఆస్తులను సంపాదించుకున్నారని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. ఫిక్సిడ్ డిపాజిట్లు రూ.420 కోట్లు ఉన్నాయంటే.. అవి ఎలా వచ్చాయని ప్రశ్నించారు.