చిక్కులో సీఎం కేసీఆర్?ఈసీ ఎంట్రీతో గులాబీలో టెన్షన్..
posted on Oct 26, 2021 @ 2:39PM
తెలంగాణ రాజకీయాలను హీటెక్కిస్తున్న, వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు కీలకంగా భావిస్తున్న కరీంనగర్ జిల్లా హుజురాబాద్ ఉప ఎన్నిక పోలింగ్ కు ముందు టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు గట్టి షాక్ తగిలే సూచనలు కన్పిస్తున్నాయి. టీఈర్ఎస్ ప్లీనరీలో ఆయన చేసిన వ్యాఖ్యలపై కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తోంది. పార్టీ ప్లీనరీలో హుజురాబాద్ ఉప ఎన్నికపై మాట్లాడిన కేసీఆర్.. ఎన్నికల సంఘాన్ని ఉద్దేశించి హాట్ కామెంట్లు చేశారు. ఒక రకంగా హెచ్చరించినట్లుగా మాట్లాడారు.
హుజురాబాద్ లో ఎన్నికల సంఘం రాజ్యాంగ పరిధి దాటి ప్రవర్తిస్తుందని కేసీఆర్ ఆరోపించారు. భారత ఎన్నికల సంఘం రాజ్యాంగ వ్యవస్థగా వ్యవహరించాలి. గౌరవాన్ని నిలబెట్టుకోవాలి. ఈ దేశంలో ఒక సీనియర్ రాజకీయ నాయకుడిగా, బాధ్యత గల పార్టీ అద్యక్షుడిగా, ఒక ముఖ్యమంత్రిగాభారత ఎన్నికల సంఘానికి ఒక సలహా ఇస్తున్నాను. చిల్లరమల్లర ప్రయత్నాలు మానుకోవాలని హెచ్చరిస్తున్నాను అని కేసీఆర్ అన్నారు. కేసీఆర్ సభ పెట్టొద్దు ఇది ఏం కథ.. ఇది ఒక పద్ధతా? కొందరు దిక్కుమాలిన రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు.
గులాబీ బాస్ మండిపడ్డారు.
ఎన్నికల సంఘాన్ని హెచ్చరిస్తూ సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. స్వయం ప్రతిపత్తి గల ఎన్నికల సంఘాన్ని టార్గెట్ చేస్తూ ముఖ్యమంత్రి మాట్లాడటంపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ఎన్నికల సంఘాన్ని హెచ్చరించడంపై కాంగ్రెస్, బీజేపీలు తీవ్రంగా స్పందించాయి. ఎన్నికల సంఘాన్ని కించపరిచేలా కేసీఆర్ మాట్లాడారని కాంగ్రెస్ ఆరోపించింది. ముఖ్యమంత్రిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. కేసీఆర్ వ్యాఖ్యలపై కేంద్ర ఎన్నికల సంఘానికి బీజేపీ నేతలు ఫిర్యాదు చేశారు. ఎన్నికల అధికారులను భయభ్రాంతులకు గురి చేసేలా కేసీఆర్ మాట్లాడారని, వెంటనే ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.
విపక్షాల ఫిర్యాదులతో పాటు కేసీఆర్ మాటలపై తమ దృష్టికి వచ్చిన అంశాలపై కేంద్ర ఎన్నికల సంఘం ఆరా తీసిందని తెలుస్తోంది. టీఆర్ఎస్ ప్లీనరీలో కేసీఆర్ మాట్లాడిన బైట్ ను సీఈసీ సేకరించిందని, ఆయన మాటలను పరిశీలించి తగిన చర్యలు తీసుకోవడానికి సిద్ధమవుతోందని ఈసీ వర్గాల సమాచారం. కేంద్ర ఎన్నికల కమిషనర్, తెలంగాణ ఇంచార్జ్ ఉమేష్ సిన్హా సైతం ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు. కేసీఆర్ మాట్లాడిన మాటలను పరిశీలిస్తున్నామని, ఈసీని కించపరిచేలా ఆయన వ్యాఖ్యలు ఉంటే తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.
ఎన్నికల సంఘాన్ని ఉద్దేశించి సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు రూల్స్ కు విరుద్దంగా ఉన్నాయనే చర్చే రాజకీయ వర్గాల్లో సాగుతోంది. ఈసీని హెచ్చరించినట్లుగానే ముఖ్యమంత్రి మాటలు ఉన్నాయని, ఇది సరికాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. గతంలో ఈసీని ఉద్దేశించి కామెంట్లు చేసిన నేతలపై సీరియస్ యాక్షన్ తీసుకున్నారని, సీఎం కేసీఆర్ పైనా కఠిన చర్యలు తీసుకోవచ్చని చెబుతున్నారు. మొత్తంగా ఈసీపై కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు కాక రేపుతుండగా.. ఏం జరుగుతుందోనన్న టెన్షన్ గులాబీ లీడర్లలో కనిపిస్తోంది. కేసీఆర్ పై ఈసీ యాక్షన్ తీసుకుంటే మాత్రం హుజురాబాద్ పోలింగ్ పై దాని ప్రభావం తీవ్రంగా ఉంటుందనే చర్చ సాగుతోంది.