గెలుపు ధీమా.. ఓటమి భయం! హుజురాబాద్ ఎవరిది..?
హుజూరాబాద్ ఉప ఎన్నిక పోలింగ్ దగ్గరవుతున్న కొద్దీ పార్టీ నాయకులు, అభ్యర్ధులలో టెన్షన్, క్షణం క్షణం పెరుగుతోంది. ఏ పార్టీకి ఆ పార్టీ, ఏ అభ్యర్ధికి ఆ అభ్యర్ధి పైకి గెలుపు తమదే అనే ధీమాను వ్యక్తపరుస్తున్నారు.కానీ గుండెల్లో గుబులు మాత్రం అందరినీ వెంటడుతూనే ఉందని,వారి మాటలు,ముఖకవళికలలో బయట పడుతూనే ఉందని సన్నిహితుల సమాచారం.
ముందు నుంచి సంక్షేమ పథకాలపైనే ఆశలు పెట్టుకున్న అధికార తెరాస, ఇప్పటికీ అదే ధీమాతో వుంది. గడచిన ఏడేళ్ళలో చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలే గట్టేక్కిస్తాయని తెరాస గంపెడాశతో వుంది. అందుకే హుజూరాబాద్ ఉప ఎన్నికను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్, ముందు నుంచే ఓ పథకం ప్రకారం నియోజక వర్గానికి భారీగా నిధులను పంప్ చేశారు. ఈటల రాజీనామా చేసినప్పటి నుంచే వందల కోట్ల రూపాయల పనులు, అదే స్థాయిలో సంక్షేమ పథకాలకు అవసరమైన నిధులను మంజూరు చేశారు. చివరకు బ్రహ్మాస్రంక గా దళిత బంధును ప్రయోగించారు.ఈ అన్నటికీ తోడు, మరో రెండున్నరేళ్ళు అధికారంలో ఉండే పార్టీగా, ప్రజలు తమనే గెలిపిస్తారనే తెరాస నాయకులు ధీమాగా ఉన్నారు.
భారతీయ జనతా పార్టీ, బీజేపీ, అభ్యర్ధి ఈటల రాజేందర్ వ్యక్తిగత ఇమేజ్’,సానుభూతి పైనే ఆశలు పెట్టుకుంది. ఇంచుమించుగా 18 సంవత్సరాలుగా నియోజక వర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఈటల రాజేందర్ కు ప్రజల్లో మంచి పేరు పలుకుబడి ఉన్నాయి. పిలిస్తే పలికే నాయకుడిగా ఆయనకు పేరుంది. ఆలాగే కష్టం సుఖం పంచుకునే ‘ఇంటి మనిషి’ గా ప్రజల గుండెల్లో చోటుంది. ఈ అన్నిటినీ మించి ముఖ్యమంత్రి కేటీఆర్ కావాలనే, ఆయనపై అపనిందలు మోపి అన్యాయం చేసారనే సానుభూతి వుంది. తెలంగాణ ఉద్యమంలో రాష్ట్ర ఏర్పాటులో తమకు కుడిభుజంగా ఉన్న ఈటలపై ముఖ్యమంత్రి కేసీఆర్ వేటు వేయడాన్ని స్థానిక తెరాస శ్రేణులు కూడా జీర్ణించుకోలేక పోతున్నాయి. ఇది ఆయన పట్ల సానుభూతిని పెంచింది. ఈటలపై తెరాస ప్రభుత్వం, ముఖ్యమంత్రి చేసిన అక్రమ భూఆక్రమణల ఆరోపణలను ప్రజలు నమ్మలేదు. దీంతో ఈటల మంచి తనం, నిజాయతీలే ఆయన్ని గెలిపిస్తాయని, అటు ఈటల, ఇటు బీజేపీ ధీమాగా ఉన్నాయి.
అయితే వేటుకు , ఉప ఎన్నికకు మధ్య దూరం పెరగడంతో సానుభూతి చల్లారడంతో అంతిమ ఫలితం పై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అలాగే, పెట్రోల్, డీజిల్, గ్యాస్ సహా ధరల పెరుగుదల అంశాన్ని కేంద్ర ప్రభుత్వానికి ముడివేసి, తెరాస చేసిన ప్రచారం, అదే విధంగా గడచిన మూడు నాలుగు నెలల సమయంలో ప్రభుత్వం అమలు చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలు ఈటల ఓటును దెబ్బతీసే ప్రమాదం ఉందని, పార్టీ వర్గాలు అనుమానిస్తున్నాయి.
ఇక కాంగ్రెస్ విషయానికి వస్తే, అసలు పోటీచేయాలా వద్డా, దగ్గర మొదలై, బరిలో దిగడమే కాకుండా ప్రాధాన ప్రత్యర్ధులు బీజేపీ, తెరాస అభ్యర్ధులు ఇద్దరికీ, హస్తం పార్టీ గుండెల్లో రైళ్ళు పరిగెత్తిస్తోంది. కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రి కొండా సురేఖ సహా చాలా పేర్లను పరిశీలించి చివరకు విద్యార్ధి నాయకుడు వెంకట్’ను బరిలో దింపింది. వెంకట్ యువకుడే అయినా, కాంగ్రెస్ పార్టీకి గత ఎన్నికల్లో వచ్చిన 60 వేల ఓట్లకు తోడు 32 వేలకు పైగా ఉన్నవిద్యార్ధి, నిరుద్యోగ ఓట్లను వైపుకు తిప్పుకుంటే, గెలుపు తమదే అవుతుందని కాంగ్రెస్ నాయకులు లెక్కలు వేస్తున్నారు. కాంగ్రెస్ అభ్యర్ధి గెలుపు విషయం ఎలా ఉన్నా, హస్తం పార్టీ ఎవరి ఓటును ఎక్కువ పట్టుకు పోతుంది అనేదానిపై, బీజేపే, తెరాస గెలుపు ఓటములు ఆధారపడి ఉంటాయని అంటున్నారు.
ఇదలా ఉంటే ఉపఎన్నికల ప్రచారం మరో రెండు రోజులో ముగియనున్న నేపథ్యంలో ఇప్పటికే ఓటర్లను ప్రలోభాలకు గురిచేసే ప్రక్రియ మొదలైంది. పత్రం, ఫలం, తోయం .. తాయిలం ఓటర్ల తలుపులు తడుతున్నాయి. అదే విధంగా ఇన్ని రోజులు ఒక లెక్క ఇప్పటి నుండి మరో లెక్క అనేలా టీఆర్ఎస్, బీజేపీ, ప్రచారం కోరు పెంచాయి. బిజెపి, టిఆర్ఎస్ అభ్యర్థులు నాయకులు సొంతగా సర్వేలు చేయించుకుంటూ ఎవరి బలాలు బలహీనతలు తెలుసుకుంటున్నారు. ముఖ్యంగా, మొదటినుంచి సర్వేలనే నమ్ముకుంటూ వస్తున్న తెరాస, ఇంతవరకు వెనకబడ్డా, ఇప్పుడు ముందడుగులో ఉందని ప్రచారం చేసుకుంటోంది. మరో వంక బీజేపీ ఈటల గ్రాఫ్ దూసుకుపోతోందని, చెప్పుకుంటోంది. అయితే, ఇందులో ఏది నిజమో, ఏది కాదో, నవంబర్ 2 కానీ తెలియదు. అదలా ఉంటే మరోవంక నియోజక నియోజక వర్గంలోనే కాకుండా రాష్ట్రం అంతటా, హుజూరాబాద్ ఉప ఎన్నిక ఫలాలపై బెట్లు (పందాలు) జోరుగా సాగుతున్నట్లు సమాచారం.