చంద్రబాబు మారాలా? కోటరీ వల్లే కష్టాలా? నిజమైన నేతల నినాదమేంటి?
posted on Oct 26, 2021 @ 11:14AM
చంద్రబాబు మారాలి. లోకేశ్ మారాలి. తండ్రీకొడుకులు మారాలి. టీడీపీలో కొత్త చర్చ నడుస్తోంది. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంపై వైసీపీ మూకల దాడి, బీభత్సం తర్వాత తెలుగు తమ్ముళ్లు కొత్త చర్చను తెరమీదకు తీసుకొచ్చారు. మాజీ మంత్రి పరిటాల సునీత మొదట ఆజ్యం పోశారు. అదిప్పుడు దావాగ్నిలా పార్టీలో రగులుతోంది. పార్టీ శ్రేణులంతా వైసీపీ దాడులపై ఆగ్రహంతో ఊగిపోతున్నారు. దెబ్బకు దెబ్బ.. దాడికి ప్రతిదాడి చేయాలంటూ పిలుపిస్తున్నారు. పరిటాల సునీత అయితే ఏకంగా.. చంద్రబాబు సీఎం అయ్యాక ఓ గంట కళ్లు మూసుకుంటే చాలు.. తామేంటో చూపిస్తాం అంటూ.. వైసీపీని ఫసక్ చేస్తామనే రేంజ్‌లో సవాల్ చేశారు. ఆమె ప్రసంగాన్ని చంద్రబాబు సైతం ఆసక్తిగా విన్నారు. సునీత పిలుపు తర్వాత ఇతర నాయకులూ చంద్రబాబు మారాలనే సూచన చేస్తుండటం ఆసక్తికర పరిణామం.
ఇక చంద్రబాబును పార్టీ శ్రేణులే పలు రకాలుగా తప్పుబడుతున్నారు. అధికారంలో ఉన్నప్పుడు తన చుట్టూ గిరి గీసుకొని.. ఓ కోటరీని ఏర్పాటు చేసుకొని.. అందులోంచి బయటకు రాలేకపోయారని అంటున్నారు. పవర్‌లో ఉన్నప్పుడు అధికారం అనుభవించి.. హవా నడిపించిన ఆ కోటరీ.. టీడీపీ అధికారం కోల్పోగానే.. పటాపంచలు అయిపోయిందని.. చంద్రబాబును వదిలేసి ఎవరి దారి వారు చూసుకున్నారని మండిపడుతున్నారు. ఈ విషయంలో చంద్రబాబుదే తప్పనే విధంగా చర్చ నడుస్తోంది. పార్టీ కోసం ప్రాణాలొడ్డి.. వైసీపీ కుతంత్రాలను ఎదుర్కొటూ.. నిబద్ధతతో పని చేస్తున్న నిజమైన నాయకులను, కార్యకర్తలను అప్పట్లో చంద్రబాబు పెద్దగా పట్టించుకోలేదని తప్పుబడుతున్నారు. తీరా.. అధికారానికి దూరమయ్యాక.. అధినేతకు ఇప్పుడు తత్వం బోధపడుతోందని అంటున్నారు. ప్రస్తుతం కష్టకాలంలో పార్టీకి అండగా నిలుస్తున్నదంతా నిఖార్సైన తెలుగు తమ్ముళ్లేనని గుర్తు చేస్తున్నారు.
అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు కొందరివాడే అంటారు. మంత్రి నారాయణ, ఎంపీలు సుజనాచౌదరి, సీఎం రమేశ్‌లాంటి వాళ్లు చంద్రబాబును హైజాక్ చేశారని చెబుతారు. అధినేత సైతం వారికే ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చే వారని చెబుతారు. ఇప్పుడు వాళ్లెవరూ పార్టీలో లేరు. ప్రస్తుతం పార్టీని, చంద్రబాబును కంటికి రెప్పలా కాపుడుకుంటున్నది.. పరిటాల, చింతమనేని, కూన రవికుమార్, కొల్లు రవీంద్ర, దూళిపాళ్ల, బుద్దా వెంకన్న, బొండా ఉమా, పట్టాభి లాంటి వాళ్లే. అందుకే, అధికారంలో ఉన్నా లేకున్నా.. నిజమైన నాయకులను, కార్యకర్తలను పట్టించుకోవాలని.. పార్టీని బతికించుకోవాలని.. తదనుగుణంగా చంద్రబాబు మారాలనే చర్చ నడుస్తోంది.
ఈ సందర్బంగా పరిటాల సునీత చేసిన మరో కామెంట్ సైతం చర్చనీయాంశంగా మారింది. ఇటీవల పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్.. నరసారావుపేటకు పరామర్శకు వెళుతుంటే.. ప్రభుత్వ ప్రోద్బలంతో పోలీసులు విజయవాడలోనే ఆయన్ను అడ్డుకున్నారు. ఆ సందర్భంగా లోకేశ్ వెంట పట్టుమని పది మంది కార్యకర్తలు కూడా లేరని.. అలాంటి పరిస్థితి రావొద్దంటూ సునీత సూచించారు. ఇదంతా గతంలో క్రింది స్థాయి కార్యకర్తలకు చంద్రబాబు కానీ, లోకేశ్ కానీ.. తగిన ప్రాధాన్యత ఇవ్వకపోవడం వల్లే ఇప్పుడు ఆ కేడర్ కాస్త దూరంగా ఉంటోందని గుర్తు చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితులు మళ్లీ రావొద్దంటే.. నిజమైన తెలుగు తమ్ముళ్లకు తగిన ప్రాధాన్యం ఇవ్వాలంటూ కేడర్ నుంచి డిమాండ్లు వస్తున్నాయి.
అయితే, టీడీపీ అధినేత తీరునూ గట్టిగా సమర్థించే వాళ్లూ ఉన్నారు. నవ్యాంధ్ర తొలి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు నిత్యం పరిపాలనా పనుల్లో బిజీగా ఉండేవారని.. ఆంధ్రుల కలల రాజధాని అమరావతి నిర్మాణంపైనే ప్రధానంగా ఫోకస్ పెట్టారని చెబుతున్నారు. లోకేశ్ సైతం కీలక శాఖలకు మంత్రిగా ఉంటూ ఏపీ అభివృద్ధి, పెట్టుబడులపైనే దృష్టి కేంద్రీకరించడం వల్ల.. పార్టీని, కేడర్‌ను పెద్దగా పట్టించుకోలేకపోయారని.. అంతేకానీ వేరే ఉద్దేశ్యం లేదనేది చంద్రబాబు తరఫు వర్షన్. ఏది ఏమైనా.. టీడీపీ కేంద్ర కార్యాలయంపై వైసీపీ రౌడీల దాడుల తర్వాత.. పార్టీని మరింత ధృఢంగా, పటిష్టంగా మార్చడంపై అధినేత చంద్రబాబు మరింత కసరత్తు చేయాల్సిన అవసరాన్ని గట్టిగా సూచిస్తోంది. దీక్షలు, ధర్నాలతో పాటు అధికార పార్టీ దౌర్జన్యాలపై ఇంకా దూకుడుగా, ధీటుగా జవాబిచ్చేలా పదునైన వ్యూహాలు సిద్ధం చేయాలని.. అందుకు అనుగుణంగా కేడర్‌ను సమాయత్తం చేయాల్సిన తప్పనిసరి పరిస్థితిని తీసుకొచ్చిందని అంటున్నారు. మరి, కేడర్ కోరుతున్నట్టు.. చంద్రబాబు మారుతారా? లోకేశ్ మరింత అగ్రెసివ్ అవుతారా? కోటరీకి స్థానం లేకుండా చేసి.. నిజమైన కేడర్‌తో రాజకీయ రణతంత్రం రచిస్తారా? చూడాలి...