మద్యం షాపునకు మహిళలు సై.. మందుబాబులు ఫుల్ ఖుషీ..
posted on Oct 26, 2021 @ 2:36PM
ఎక్కడైనా మద్యం షాపు కావాలా? వద్దా? అని మహిళలను అడిగితే.. ఎక్కువ శాతం మంది వద్దనే అంటారు. ఆ రాష్ట్రం, ఈ రాష్ట్రం.. ఆ జిల్లా, ఈ గ్రామం.. అనే తేడా లేకుండా.. మహిళలు ఎప్పుడూ మద్యం షాపులకు వ్యతిరేకంగానే ఉంటారు. మగాళ్లు సంపాదించినదంతా తాగుడుకే తగలేస్తారని.. డబ్బులు ఖాళీ.. ఒళ్లు గుల్ల చేసుకుంటారనే కారణంతో మహిళలు.. మద్యం పాలిటి మహంకాళిలుగా మారుతుంటారు. బెల్టు షాపులపై దాడులు చేయడం.. తమ వీధిలో నుంచి మద్యం షాపు తీసేయాలంటూ ధర్నాలు చేయడం.. అలాంటి దృశ్యాలు రెగ్యులర్‌గా కనిపిస్తుంటాయి. కానీ, ఈ ఫోటో మాత్రం వాటన్నింటికీ డిఫరెంట్. మహిళలే తమ గ్రామంలో మద్యం షాపు కావాలంటూ చేతులెత్తి ఆమోదం తెలుపుతున్న అరుదైన దృశ్యం ఇది.
మహిళల్లో చాలా మార్పు వస్తున్నట్టుంది. తమ గ్రామంలో మద్యం షాపులకూ ఎలాంటి అభ్యంతరం లేదంటూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తున్నారు. ఈ ఫోటో అలాంటిదే. ఈ చిత్రంలో కనిపిస్తున్న మహిళలంతా.. తమ గ్రామంలో మద్యం దుకాణం ఏర్పాటుకు ఇలా జైకొట్టారు. త్వరలో మద్యం దుకాణాలకు టెండర్లు పిలవనున్న నేపథ్యంలో తెలంగాణలోని వినోభానగర్, గుండెపూడి గ్రామాల్లో సోమవారం పీసా గ్రామసభలు నిర్వహించారు. వినోభానగర్ పంచాయతీ కార్యాలయం దగ్గర సమావేశంలో ఇలా మద్యం దుకాణం ఏర్పాటుకు చేతులెత్తి మద్దతు ప్రకటించారు మహిళలు. ఆ సందర్భంగా తీసిన ఫోటో ఇది. మహిళలూ.. మీకు వందనాలు అంటున్నారు మద్యం ప్రియులు.