మొన్న వైవీ.. నిన్న ఆళ్ల.. రచ్చనా? రాయబారమా? ఏంటి సంగతి?
posted on Oct 26, 2021 @ 12:28PM
వైఎస్ షర్మిల ప్రజా ప్రస్థానం పాదయాత్ర చేస్తున్నారు. తెలంగాణలో తన రాజకీయ భవిష్యత్తుకు వడివడిగా అడుగులు వేసుకుంటున్నారు. ప్రజల నుంచీ మంచి స్పందనే వస్తోంది. వైఎస్సార్ అభిమానులు, నిరుద్యోగులు, మహిళలు మినహా ఆమె వెంట నిలిచే బలమైన నాయకులు లేరు. షర్మిల సింగిల్‌గా పాదయాత్రతో దూసుకుపోతున్నారు. ఇదీ ఇప్పటి వరకూ ఉన్న టాక్.
కట్ చేస్తే.. ఆదివారం వైసీపీ సీనియర్ నేత, ఆమె బాబాయ్ వైవీ సుబ్బారెడ్డి.. వైఎస్ షర్మిలను కలిసి మద్దతు పలికారు. వైఎస్ తరహాలో షర్మిల చేస్తున్న పాదయాత్రకు సపోర్ట్ చేశారు. షర్మిల యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఇంత వరకూ ఓకే. వైవీ సుబ్బారెడ్డి.. ఆమెకు బాబాయ్ కాబట్టి పర్సనల్‌గా ఆయన కలిసుంటారని అన్నారు. షర్మిలను జగన్ కాదనుకున్నా.. వైవీ సుబ్బారెడ్డి వెళ్లి షర్మిలను కలవడం వైసీపీలో కలకలం రేపింది. అదంతా ఫ్యామిలీ మేటర్ అని లైట్‌గా తీసుకునే పరిస్థితి లేదంటున్నారు.
ఇక సోమవారం మరింత ఇంట్రెస్టింగ్ పరిణామం జరిగింది. జగన్‌కు అత్యంత సన్నిహితుడు, మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఆంధ్ర నుంచి తెలంగాణకు తరలివచ్చి.. షర్మిల పాదయాత్రలో పాల్గొన్నారు. ప్రజల మధ్య కూర్చొని ఆమె ప్రసంగాన్ని విన్నారు. పాదయాత్ర అనంతరం షర్మిలతో గంటకు పైగా సమావేశమయ్యారు. ఇది మాత్రం క్యాజువల్ కానే కాదు. ఫ్యామిలీ మేటర్ అంతకన్నా కాదు.
జగన్ కోటరీలో కీలక నేతలుగా ఉన్న వైవీ సుబ్బారెడ్డి, ఆళ్ల రామకృష్ణారెడ్డిలు వరుసగా ఇలా షర్మిల పాదయాత్రలో పాల్గొనడం.. ఆమెతో సమావేశమవడం.. అత్యంత ఆసక్తికర అంశం. జగన్‌ను కాదని వారిద్దరు స్వతహాగా ఈ పని చేసి ఉంటారని అనుకోలేం. ఇక జగన్ పాదయాత్ర చేసినప్పుడు కీ రోల్ పోషించిన ఆళ్ల.. ఇప్పుడు షర్మిల పాదయాత్రలో ప్రత్యక్షమవడం వెనుక బలమైన కారణమే ఉండి ఉంటుందని అంటున్నారు. వాళ్లిద్దరూ జగన్ డైరెక్షన్‌లోనే షర్మిలను కలిశారా? ప్రజా ప్రస్థాన పాదయాత్రకు బూస్టింగ్ ఇస్తున్నారా? జగన్ తరఫున రాయబారానికి వచ్చారా? ఇలా అనేక ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
తాను జగనన్న వదిలిన బాణం కాదంటూ షర్మిల మొదట్లోనే తేల్చి చెప్పారు. వైఎస్ కుటుంబంలో తీవ్ర స్థాయిలో గొడవలు ఉన్నాయని ప్రచారం జరిగింది. ఆస్థి తగాదాలు, ఆధిపత్య పోరు, చెల్లిని అన్న పట్టించుకోకపోవడం.. ఆమె అలిగి రావడం.. ఇలా రకరకాలుగా అన్నారు. అయితే, అవన్నీ ఉత్తి ప్రచారమేనా? వాళ్లంతా ఒక్కటేనా? అనే చర్చ కొత్తగా స్టార్ట్ అయింది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో షర్మిల మాట్లాడుతూ.. జగన్‌తో తనకు అంత పెద్దగా విభేదాలు ఏవీ లేవని.. తాము ఇప్పటికీ ఫోన్లో మాట్లాడుకుంటున్నామని.. వైఎస్సార్ సమాధి దగ్గర గతంలోనూ తాము మాట్లాడుకోలేదని.. చిన్న చిన్న గొడవలు ఉన్నా.. కూర్చొని మాట్లాడుకుంటే సమసిపోయేవేనని ఆమే స్వయంగా స్పష్టం చేశారు. అది నిజమేనన్నట్టు.. ఇప్పుడు జగన్ సన్నిహితులు వైవీ సుబ్బారెడ్డి, ఆళ్ల రామకృష్ణారెడ్డిలు షర్మిలను కలిసి చర్చించడం ఆసక్తికరం. అంటే.. వారంతా ఒకే తాను ముక్కలా? షర్మిల జగనన్న వదిలినా బాణమేనా? మరి, ఫ్యామిలీలో గొడవలు ఉన్నాయనే ప్రచారం కావాలనే చేశారా? లేక... చెల్లి పాదయాత్ర చేయడం చూడలేక.. అన్న రాయబారం పంపించారా? అనే అనుమానమూ వస్తోందంటున్నారు. ఇందులో ఏది నిజమో.. జగన్-షర్మిల మధ్య అసలేం జరుగుతోందో.. క్లారిటీ వచ్చీ రానట్టుగా ఉందంటున్నారు.