మేడమ్ 'మమత'కు పెద్దోళ్ల సపోర్ట్!.. బదిలీ బంద్!
posted on Oct 30, 2021 @ 12:16PM
మేడమ్ మమత. తెలుసుగా. ఆమె గురించి తెలీకపోయినా ఈ ఫోటో చూస్తే గుర్తుపట్టేస్తారు. తెలంగాణ ఉద్యమం ఫాలో అయిన వారందరికీ ఈమె సుపరిచితమే. అప్పట్లో ఉద్యమంలో ఫుల్ యాక్టివ్ ఉండేవారు. తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్-టీజీవోల తరఫున గట్టిగా పోరాడారు. ప్రస్తుత మంత్రి, అప్పటి టీజీవో లీడర్ శ్రీనివాస్‌గౌడ్ తర్వాత.. నెంబర్ 2గా చెలామని అయ్యారు. యూనియన్ తరఫున ప్రతీ ఫ్రేమ్‌లో ఆమె ఉండేవారు. తెలంగాణ రాష్ట్రం సాకారమయ్యాక.. ఆమె పోరాటానికి తగిన గుర్తింపుతో పాటు, మేడమ్‌కు ప్రమోషన్ కూడా లభించింది. అసలు మమతకు పదోన్నతి ఇవ్వడంపైనా వివాదం ఉంది. ఆమె కంటే పదులమంది సీనియర్లు ఉన్నప్పటికీ జోనల్ కమిషనర్‌గా ప్రమోషన్ దక్కింది. అలా ఏళ్లుగా.. ఓ వెలుగు వెలుగుతూ వచ్చిన మమతకు సడెన్‌గా షాక్ తగిలింది.
ఇప్పుడు మమత మున్సిపల్ కమిషనర్. సుదీర్ఘ కాలంగా కూకట్‌పల్లిలో పని చేస్తున్నారు. ఇటీవల ఎల్బీనగర్‌కు బదిలీ చేయడం ఆమెకు ఊహించని పరిణామం. ఆ.. నన్నే ట్రాన్స్‌ఫర్ చేస్తారా? అంటూ మేడమ్ కన్నెర్ర చేశారు. దెబ్బకు సాయంత్రానికల్లా బదిలీ ఉత్తర్వులు మారిపోయాయి. ఆమెను కూకట్ పల్లిలోనే కొనసాగించాలని మార్చిన ఆర్డర్ వచ్చేసింది. అదీ మమత పవర్.
అవినీతి ఆరోపణలు ఉండటం.. సుదీర్ఘకాలంగా పని చేస్తూండటంతో.. గ్రేటర్ పరిధిలోని ఐదుగురు జోనల్ కమిషనర్లను ఒక్క సారిగా బదిలీ చేశారు. ఇందులో మమత కూడా ఉన్నారు. వెంటనే ఓ మంత్రి, ముగ్గురు ఎమ్మెల్యేలు మమత తరఫున రంగంలోకి దిగారు. ప్రభుత్వ పెద్దలపై ఒత్తిడి తెచ్చారు. కట్ చేస్తే.. మమత బదిలీ అగిపోయింది. మిగిలిన వారి బదిలీలు యధావిధిగా జరిగిపోయాయి. మమత మేడమ్ పరపతి ఏంటో గ్రేటర్ కమిషనర్‌కు తెలిసొచ్చింది. అయితే.. ఎప్పుడో ఉద్యమంలో యాక్టివ్‌గా ఉన్నారనే కారణంతో.. ఇన్నేళ్లైనా ఆమెకు అంత ప్రయారిటీ ఇవ్వడం.. పదోన్నతి, కావలసిన పోస్టింగ్‌లోనే కూర్చోబెట్టడంపై మిగతా ఉద్యోగ సంఘాల నేతలు, సహచర ఉద్యోగులు మండిపడుతున్నారు.