మంగళవారం మరదలమ్మా అని గౌరవించా... మంత్రి నిరంజన్ రెడ్డి వివరణ
posted on Oct 30, 2021 8:39AM
తెలంగాణ వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలను ఉద్దేశించి మంగళవారం మరదలు అంటూ తెలంగాణ మంత్రి నిరంజన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై దుమారం కొనసాగుతోంది. మంత్రి కామెంట్లపై తీవ్ర విమర్శలు రావడం, కుక్క అంటూ షర్మిల కౌంటర్ ఇవ్వడం మరింత కాక రాజేసింది. దీంతో తన మాటలపై వివరమ ఇచ్చారు మంత్రి నిరంజన్ రెడ్డి.
తన వ్యాఖ్యలతో ఎవరైనా నొచ్చుకుని ఉంటే, అందుకు పశ్చాత్తాప పడుతున్నానని మంత్రి చెప్పారు. అయినా తాను ఎవరి పేరును ఉపయోగించి ఈ వ్యాఖ్యలు చేయలేదని, తన వ్యాఖ్యలను మరోసారి గమనించాలని సూచించారు. "మంగళవారం మరదలమ్మా" అంటూ చివరన అమ్మా అని మర్యాద ఇచ్చానని స్పష్టం చేశారు. సంస్కారం ఉన్న వారికి తన మాటలు సంస్కారవంతంగానే ఉంటాయని మంత్రి నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు. షర్మిల తన తండ్రి సమకాలికుడైన కేసీఆర్ ను ఏకవచనంతో సంబోధిస్తుండడం సరైన పద్ధతేనా? అని ప్రశ్నించారు మంత్రి నిరంజన్ రెడ్డి.
తెలంగాణలో పార్టీ పెట్టిన వైఎస్ షర్మిల.. టీఆర్ఎస్ సర్కార్, సీఎం కేసీఆర్ టార్గెట్ గా దూుకుడుగా వెళుతున్నారు. కేసీఆర్ తో పాటు సీఎం కుటుంబ సభ్యులపైనా తీవ్రస్థాయిలో ఆరోపణలు చేస్తున్నారు. ప్రతి మంగళవారం నిరుద్యోగ దీక్ష చేపడుతున్నారు. ఈ నేపథ్యంలో మంత్రి నిరంజన్ రెడ్డి స్పందిస్తూ మంగళవారం మరదలు బయలుదేరింది అంటూ వ్యాఖ్యానించగా తీవ్ర విమర్శలు వచ్చాయి.