కుప్పంలో చంద్రన్న వ్యూహాలు.. తమ్ముళ్ల జేజేలు..
posted on Oct 30, 2021 @ 1:29PM
కుప్పం చంద్రబాబు అడ్డా. దశాబ్దాలుగా ఆయనే రారాజు. ఓటమి ఎరుగని నాయకుడు. వైసీపీ నేతలు ఎన్ని కుట్రలు, కుతంత్రాలు, దౌర్జన్యాలు, ఆగడాలు చేసినా.. కుప్పంలో చంద్రబాబు చిటికెన వేలు కూడా టచ్ చేయలేమనే విషయం వాళ్లకు కూడా తెలుసు. అందుకే, అధికార పార్టీలో అంత అసహనం. అది భరించలేకే.. టీడీపీ ఫ్లెక్సీలను చించేయడం.. కరెంట్ కట్ చేయడం.. సభలో ఉద్రిక్తతలు రాజేయడం.. లాంటి చిల్లర చేష్టలకు దిగుతున్నారు. వాటన్నిటికీ ఎప్పటికప్పుడు తెలుగు తమ్ముళ్లు ధీటుగా జవాబిస్తున్నారు. గట్టిగా ఎదురుదాడి చేస్తున్నారు. తాజాగా కుప్పంలో చంద్రబాబు పర్యటనకు లభించిన అనూహ్యం మద్దతు, భారీ ఘన స్వాగతం చూశాకైనా.. కుప్పంలో బాబు పవరెంతో ప్రత్యర్థులకు తెలిసొచ్చి ఉంటుంది.
ఇక, కుప్పంలో చంద్రబాబు రెండోరోజు కీలక సమీక్షలు జరుపుతున్నారు. ఈసారి జరగబోయే కుప్పం మున్సిపాలిటీ ఎన్నికలను టీడీపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇటీవల జరిగిన పలు ఉప ఎన్నికలు, స్థానిక సంస్థల ఎలక్షన్లలో వైసీపీకి వార్ వన్‌సైడ్ కావడంతో.. కుప్పంలో అధికార పార్టీ జోరుకు బ్రేకులు వేసేలా వ్యూహాలు రచిస్తున్నారు. చంద్రబాబు ఇలాఖాలో టీడీపీకి షాక్ ఇవ్వాలని అధికార పార్టీ ఎత్తులు వేస్తుంటే.. వారి జిత్తులను చిత్తు చేసేందుకు స్వయంగా చంద్రబాబే రంగంలోకి దిగారు. మూడు రోజుల పర్యటనతో కుప్పంలో పార్టీ శ్రేణుల్లో సమరోత్సాహం నింపుతున్నారు.
శనివారం పార్టీ ముఖ్య నేతలతో టీడీపీ అధినేత చంద్రబాబు వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. మునిసిపల్ ఎన్నికలపై చర్చిస్తున్నారు. టీడీపీ తరపున పోటీ చేసే ఆశావహులు భారీగా ఉండటంతో.. అభ్యర్థుల ఎంపిక కత్తి మీద సాముగా మారింది. ఇక, మునిసిపల్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై పార్టీ శ్రేణులకు చంద్రబాబు దిశానిర్దేశం చేస్తున్నారు. ఎన్నికల్లో ప్రలోభాలకు, ఒత్తిళ్లకు తలోగ్గకుండా.. అధికార పార్టీ ఆగడాలను అడ్డుకునేలా.. కేడర్‌కు చంద్రబాబు సూచనలు చేశారు. టీడీపీ అధినేత పర్యటనతో కుప్పంలో తెలుగు తమ్ముళ్ల జోష్ మామూలుగా లేదు.