భారతవర్ష.. పూలబాల విరచిత అద్భుత రచన..
posted on Oct 30, 2021 @ 10:53AM
బహుభాషా కోవిదుడు పూలబాల రచించిన 1265 పేజీల భారతవర్ష 21 వ శతాబ్దపు అతిపెద్ద తెలుగు ప్రబంధ కావ్యం. యూజిసి జాతీయ స్థాయి సమావేశాల్లో పాల్గొని ఫ్రెంచ్ జర్మన్ భాషల్లో ప్రసంగించిన పూలబాల ఆంధ్రప్రదేశ్ నుంచి ఫ్రెంచ్ లో నవల రచించిన తొలి తెలుగు రచయిత.
ప్రపంచ సాహిత్యంలో భారతవర్ష వైశిష్టత:
ప్రపంచ సాహిత్య చరిత్రలో వేయి పేజీలు దాటిన గ్రంధాల రచనకు కనీసం 10 సంవత్సరాల సమయం తీసుకున్నారు. గాన్ విత్ ద విండ్ 10 సంవత్సరాలు, జురాసిక్ పార్క్ 10 సంవత్సరాలు, లె మిజరబుల్స్ 12 సంవత్సరాలు కాగా 1265 పేజీల భారతవర్ష రచనా సమయం 8 నెలలు. ఆ రచయితలంతా వాడుక భాష లో రాసారు . కానీ భారతవర్ష రచయిత పూలబాల ప్రాచీన భాష లో (గ్రాంధికం లో) చందోబద్ద పద్యాలతో కావ్య రచన చేశారు.
తెలుగు భాషకు బంగారు పల్లకి:
భారతవర్ష ఆద్యంతం ఉత్కంఠతో సాగే ఆధ్యాత్మిక శృంగారకావ్యం. ప్రేమ, శృంగారాలను పాండిత్యం తో రంగరించి సాహిత్య సరదాలు అద్ది, ఆధ్యాత్మిక, వైద్య, వైమానిక, సాంకేతిక రంగాల్లో అబ్బురపరుచు అరుదైన విషయజ్ఞానాన్ని హృద్యమైన భాష తో మేళవించిన బహు విషయ జ్ఞాన భండారం భారతవర్ష. పుట పుట లోను పరుగులెత్తు గోదారిని తలపించే వృత్త పద్యాలు, పద్య సౌందర్యాన్ని సవాలు చేసే గద్య సౌందర్యం వెరసి తెలుగు భాషను బంగారు పల్లకి పై ఊరేగించు ప్రబంధకావ్యం భారతవర్ష. స్నేహధర్మానికి, ప్రేమబంధాలకి పెద్ద పీటవేసి మానవసంబంధాలకు బ్రహ్మ రథం పడుతుంది ఈ ఆధ్యాత్మిక శృంగారకావ్యం.
భారతవర్ష ఇతివృత్తము:
గ్రాంధిక తెలుగున రచించిబడిన ఈ ఆధునిక శృంగార ప్రబంధ కావ్యమందు ప్రౌఢమైన, హృద్యమైన గద్యముతో పాటు తరళ, శార్దూల, మత్తేభ ఉత్పలమాల, చంపకమాల పద్యాలు చదువరులను అలరించు విధముగా ఉంటాయి. మంచిభాషమంచిజీవితానికినాంది. మంచిసాహిత్యం మంచి సమాజానికి నాంది. భారతవర్ష ఇతివృత్తము భారతీయసంస్కృతికి పెద్దపీట వేసి క్రోధము, కామము క్షణికావేశములు. ధనము జీవిత ప్రయోజనము కానీ ధర్మము జన్మాంతర ప్రయోజనము, అటువంటి ధర్మమునకు మూలము సంస్కృతి అని , ఆ సంస్కృతికి నాంది భాష అనే సత్యాన్ని తెలియజేస్తుంది.
అన్నిరకముల భాషాభూషణాలు శబ్ద అర్థాలంకారాలు గల భారతవర్షలో వేయికి పైగా ఉపమానాలు వాడబడ్డాయి. సర్వాలంకార భూషిత కావ్య కన్య భారతవర్ష త్వరలో విడుదలకు సిద్ధంగా ఉంది.