కుప్పంలో చంద్రన్న జోరు.. బద్వేల్లో దొంగఓట్లు.. హుజురా-వార్.. టాప్‌న్యూస్ @1pm
posted on Oct 30, 2021 @ 12:58PM
1. టీడీపీ అధినేత చంద్రబాబు కుప్పం పర్యటన రెండో రోజు కొనసాగుతోంది. కుప్పం ముఖ్య నేతలతో సమావేశమయ్యారు. మునిసిపల్ ఎన్నికల విషయంపై చర్చించారు. మునిసిపల్ ఎన్నికల్లో టీడీపీ తరపున పోటీ చేసే అభ్యర్థుల ఎంపిక, గెలుపు వ్యూహాలపై చర్చించనున్నారు చంద్రబాబు. మున్సిపాలిటీ పరిధిలోని పలు వార్డుల్లో రోడ్డు షో నిర్వహించనున్నారు.
2. ఉప ఎన్నిక సందర్భంగా బద్వేలు పరిధిలో బీజేపీ ఏజెంట్లను ఇబ్బంది పెడుతున్నారని ఆ పార్టీ నేత సీఎం రమేష్ అన్నారు. ఉపఎన్నికల్లో దొంగలు, పోలీసులు ఒక్కటయ్యారని ఆరోపించారు. పోలింగ్ కేంద్రాల దగ్గర కేంద్ర బలగాలను కాకుండా స్థానిక పోలీసులను రక్షణగా ఉంచుతున్నారన్నారు. పోరుమామిళ్లలో బయటి వ్యక్తులను మోహరించారని సీఎం రమేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
3. బద్వేలు పరిధిలోని గోపవరం పోలింగ్ బూత్ దగ్గర వైసీపీ నేతలు దౌర్జన్యానికి పాల్పడ్డారు. బూత్ నుంచి ఇతర పార్టీల ఏజెంట్ల పట్ల వైసీపీ నేతలు బెదిరింపులకు తెగబడ్డారు. పోలీసులు ఒక పార్టీకి అనుకూలంగా పనిచేస్తున్నారని బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. అట్లూరు మండలం ఎస్ వెంకటాపురంలో దొంగ ఓట్లు వేసేందుకు ప్రయత్నించిన వారిని పట్టుకొని పోటీసులకు అప్పగించారు గ్రామస్తులు.
4. బద్దేల్‌లో ఉప ఎన్నిక ప్రశాంతంగా సాగుతోందని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి కె.విజయానంద్ అన్నారు. బద్వేల్ ఉపఎన్నిక ప్రక్రియను అమరావతి సచివాలయంలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ నుండి వెబ్ కాస్టింగ్ ద్వారా విజయానంద్ పరిశీలిస్తున్నారు. మూడు చోట్ల ఈవీఎంలు పని చేయకపోవడాన్ని గుర్తించి వెంటనే అధికారులు వాటిని మార్చినట్లు తెలిపారు. స్థానికంగా ఏమైనా చిన్న చిన్న సమస్యలు ఉంటే వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు.
5. హుజురాబాద్ ఉప ఎన్నిక సందర్భంగా ఉద్రిక్తతలు చెలరేగుతున్నాయి. వీణవంక మండలం గణుముక్కుల గ్రామంలో పోలింగ్ బూత్‌లో టీఆర్‌ఎస్ నేత కౌశిక్ రెడ్డిని స్థానికులు అడ్డుకున్నారు. పోలింగ్ బూత్‌లో ప్రచారం చేయడం ఏంటని గ్రామస్తులు కౌశిక్‌రెడ్డిని అడ్డగించి.. అక్కడి నుంచి వెళ్లగొట్టారు.
6. జమ్మికుంట పట్టణంలో టీఆర్ఎస్, బీజేపీ నేతలు ఘర్షణకు దిగారు. టీఆర్ఎస్ నేతలు డబ్బులు పంచుతున్నారని బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానికేతరుల ప్రచారాన్ని బీజేపీ నేతలు అడ్డుకున్నారు. అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. మరోవైపు, హుజురాబాద్ నియోజకవర్గం వ్యాప్తంగా భారీ ఎత్తున పోలింగ్ నమోదవుతోంది. మధ్యాహ్నానికే సుమారు 40శాతం ఓటింగ్ జరిగింది.
7. తెలంగాణలో రాక్షస పాలన నడుస్తుందని 11వ రోజు పాదయాత్రలో వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శించారు. ‘‘రెండుసార్లు అవకాశం ఇస్తే ఎవరు బాగుపడ్డారు. కేజీ టూ పీజీ అని చెప్పి విద్యార్థులను మోసం చేశారు. డబుల్ బెడ్ రూం ఇల్లు అని చెప్పి పేదలను మోసం చేశారు. పెన్షన్లు ఆపి వృద్ధులను మోసం చేశారు. ఇంటికి ఒక ఉద్యోగం అని చెప్పి యావత్ తెలంగాణను కేసీఆర్ మోసం చేశారు’’ అని కేసీఆర్‌పై షర్మిల మండిపడ్డారు.
8. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్ తన రాజకీయ భవిష్యత్ కోసం పోలీసుల కాపలాతో పాదయాత్ర చేశారని బీజేపీ నేత లంకా దినకర్ అన్నారు. అధికారంలోకి వచ్చాక రాష్ట్ర భవిష్యత్ కోసం అమరావతి రైతులు "న్యాయస్థానం నుండి దేవస్థానం" పాదయాత్ర చేస్తూంటే అడ్డుకోవడం అంటే జగన్ తనని తాను అవమానించుకోవడమే అని విమర్శించారు. న్యాయ స్థానం అనుమతితో " న్యాయస్థానం టూ దేవస్థానం" ఇక భద్రత, బాధ్యత పోలీసులదే అని లంకా దినకర్ చెప్పారు.
9. రాజమండ్రిలో పెంచిన విద్యుత్ చార్జీలకు నిరసనగా టీడీపీ నేతలు ఆందోళన చేపట్టారు. విసన కర్రలతో ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ నిరసన తెలిపారు. చేతకాని ముఖ్యమంత్రి ఏపీని పరిపాలిస్తున్నారని ఆమె మండిపడ్డారు. విద్యుత్ చార్జీలు తగ్గించేవరకు టీడీపీ పోరాటం కొనసాగుతుందని ఆదిరెడ్డి భవానీ తెలిపారు. మరోవైపు, విద్యారంగాన్నిసీఎం జగన్‌రెడ్డి భ్రష్టుపట్టిస్తున్నారని టీఎన్ఎస్ఎఫ్ నాయకులు మండిపడ్డారు. ఎయిడెడ్ విద్యా సంస్థలను ఎలా పటిష్ఠం చేయాలో తెలియకుండా, వాటిని మూసేయాలని ఏకపక్షంగా నిర్ణయించడం దారుణమన్నారు.
10. విశాఖ స్ట్రీల్‌ను అమ్మే హక్కు ఏ ప్రభుత్వానికి లేదని పర్యావరణ ఉద్యమకారిణి మేధాపాట్కర్ అన్నారు. స్ట్రీల్ ప్లాంటు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కూర్మన్నపాలెం దగ్గర కార్మికులు దీక్ష చేపట్టారు. ఈ దీక్షకు పర్యావరణ ఉద్యమకారిణి మేధాపాట్కర్, ఐఎఫ్‌టీయూ జాతీయ అధ్యక్షులు డాక్టర్ అపర్ణ సంఘీభావం పలికారు. ప్రభుత్వరంగ సంస్థల ప్రైవేటీకరణతో దేశం ఎలా అభివృద్ధి చెందుతుందని కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.