మీడియా వాహనాలు, రిపోర్టర్ల ద్వారా డబ్బు పంపిణీ..
posted on Oct 30, 2021 @ 2:28PM
హుజూరాబాద్ లో డబ్బు పంపిణీ కొత్త పుంతలు తొక్కుతోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఓట్ల కొనుగోలులో కొత్త దారులు పోతున్నారు. ఎలాగైనా గెలిచి తీరాలన్న మొండి పట్టుదలతో అధికార పార్టీ అనూహ్యమైన ఎత్తుగడలు వేస్తోంది. పోలింగ్ ముందురోజు రాత్రి వరకూ ఓటర్లకు డబ్బు పంపిణీలో ఉన్న పార్టీలు, ముఖ్యంగా అధికార పార్టీ... పోలింగ్ జరుగుతున్న సమయంలో కూడా నోట్ల కట్టలతో రెడ్ హేండెడ్ గా పట్టుబడింది.
టీ-న్యూస్ ఫేక్ ఐడీ కార్డులతో కొందరు అధికార పార్టీ నాయకులు రిపోర్టర్లుగా బుకాయిస్తూ ఏకంగా బూత్ ల దగ్గరే డబ్బు పంపిణీ చేస్తుండడం ప్రజాస్వామ్యాన్ని, ఎన్నికల ప్రక్రియను నిరాశపరుస్తోంది. అయితే అధికార పార్టీ ఎక్కడెక్కడ, ఏ విధంగా అడ్డదార్లు తొక్కే అవకాశం ఉందో అంచనా వేసిన బీజేపీ నాయకులు ప్రతి బూత్ దగ్గర కూడా తమ కార్యకర్తలను, ఆయా గ్రామాల్లోని మహిళలను నిఘా కోసం పెట్టారు. వారంతా అధికార పార్టీ ఆగడాలు అడ్డుకునేందుకే పోలింగ్ బూత్ ల దగ్గర కాపలా కాస్తుండడం విశేషం. ఈ క్రమంలో ఓ స్థానికేతరుడు తాను టీ న్యాస్ రిపోర్టర్ని అంటూ బుకాయిస్తూ లోనికి వెళ్లేందుకు ప్రయత్నించడం, ఆ వ్యక్తిని అనుమానించిన స్థానికులు అడ్డుకోవడంతో ఆయన దగ్గర నోట్లు బయటపడ్డాయి.
ఇలా వీణవంక, ఘన్ముక్ల, కమలాపూర్.. ఎక్కడ చూసినా ఎన్నికల ప్రక్రియ ఉద్రిక్తంగా మారింది. అనేక చోట్ల టీఆర్ఎస్, బీజేపీ వర్గాలు ఘర్షణ పడ్డాయి. వారిని సముదాయించడం, శాంతింపజేయడం, ఆ తరువాత ఎన్నికల ప్రక్రియను ప్రశాంతంగా కొనసాగించడం పోలీసులకు సవాలుగా మారింది.
ఎన్నికల్లో ప్రలోభాల కోసం ప్రయత్నిస్తున్న కొందరు నాయకులు ఫేక్ ప్రెస్ ఐడీ కార్డులతో బయటకొచ్చే అవకాశం ఉందని, ఎవరైనా పేపర్ పేరు చెప్పి, మీడియా పేరు చెప్పి ప్రలోభపెడితే వారిని నమ్మరాదని, తమకు సమాచారం అందించాలని పోలీసు అధికారులు ముందురోజే హెచ్చరించడం విశేషం. వారు హెచ్చరించినట్టుగానే ఉదయం ఫేక్ టీ-న్యూస్ ఐడీ కార్డులతో బూత్ ల దగ్గర తచ్చాడిన వ్యక్తులు కనిపించడం గమనించాల్సిన అంశం. మరోవైపు ఓటర్లను, బీజేపీ కార్యకర్తలను, గతంలో టీఆర్ఎస్ లో ఉండి ఈ మధ్యే బీజేపీలో చేరిన పలువురిని అధికార పార్టీ నేతలు బెదిరించడం సంచలనంగా మారుతోంది.
తాము తల్చుకుంటే ఒకే ఒక్క నిమిషంలో మీ అందరినీ మాయం చేస్తామని బీజేపీ నాయకులకు వార్నింగ్స్ ఇస్తున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనిపై ఈటల రాజేందర్ తీవ్రమైన అసంతృప్తిని వ్యక్తం చేశారు. బహిరంగ బెదిరింపులు, బహిరంగ నోట్ల పంపిణీ జరుగుతున్నా ఈసీ అసమర్థంగా వ్యవహరిస్తోందని, అసలు ఈసీ కనుసన్నల్లోనే నోట్ల పంపిణీ జరుగుతుందా అన్న అనుమానం కలుగుతోందని ఆయన ఆరోపించారు.
టీఆర్ఎస్ నాయకుడు పాడి కౌశిక్ రెడ్డి చీఫ్ ఎలక్షన్ ఏజెంట్ గా వ్యవహరిస్తున్నా.. అతనికి అన్ని బూత్ లలోకి వెళ్లే అధికారం ఉన్నా.. ఆయన వస్తే ఓటర్లను ప్రలోభపెడతాడని, ఆయన బూత్ ల దగ్గరికి రావొద్దని ఓటర్లు అడ్డుకోవడం చెప్పుకోవాల్సిన అంశం. ఇందుకోసం మహిళలు పెద్దసంఖ్యలో ముందుండడం అధికార పార్టీని వణికిస్తోంది. నోట్లు పంచుతున్నారంటూ టీఆర్ఎస్ కౌన్సిలర్ దీప్తి, మార్కెట్ కమిటీ చైర్మన్ దగ్గరున్న నోట్లు కూడా స్వాధీనం చేసుకోవాలని బీజేపీ ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. దీన్నిబట్టి నోట్లు పంచే కార్యక్రమం ఎంత పకడ్బందీగా సాగుతుందోో అర్థం చేసుకోవచ్చు