వరి వద్దంటే గంజాయి సాగు చేయాలా! బీజేపీ ఎంపీ కామెంట్ల కలకలం..
posted on Oct 29, 2021 @ 9:05PM
తెలంగాణలో అధికార టీఆర్ఎస్, బీజేపీ మధ్య డైలాగ్ వార్ ముదురుతోంది. హుజురాబాద్ ఉప ఎన్నిక పోలింగ్ కు ముందు హాట్ కామెంట్లతో కాక రాజేస్తున్నారు. సీఎం కేసీఆర్, కేటీఆర్‌లపై నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సీఎం కేసీఆర్, క్యాబినెట్ మంత్రులను గొర్రెలతో పోల్చాడు. కేటీఆర్ మగాడైతే ప్రజాక్షేత్రంలో తమతో పోరాడాలని సవాల్ విసిరారు. కేసీఆర్‌కు బానిసత్వం చేయటం కంటే.. మంత్రి నిరంజన్ రెడ్డి చావటం మేలని విమర్శించారు.
వ్యవసాయం, ధాన్యం కొనుగోలుపై లైవ్ డిబేట్‌కు రెడీ.... నిరంజన్ రెడ్డి ఇంటికి రావటానికీ సిద్ధమేనా? అని ధర్మపురి అర్వింద్ ప్రశ్నించారు. వరి విత్తనాలు బదులు.. గంజాయి విత్తనాలు అమ్మాలా? అని ప్రశ్నించారు. కేసీఆర్‌కు కాళ్ళు మొక్కినందుకే సిద్దిపేట కలెక్టర్ డ్యూటీలో ఉన్నాడన్నారు. పండించిన ప్రతి గింజను కొంటానన్న కేసీఆర్ ఎందుకు మాట్లాడటం లేదని నిలదీశారు ఎంపీ. తెలంగాణ బ్రాండ్‌తో బియ్యాన్ని మార్కెటింగ్ చేస్తామన్న కేసీఆర్ ఎక్కడ? అని ప్రశ్నించారు. సివిల్ సప్లయ్ మంత్రి గంగుల పంట కొంటానంటే.. హరీష్, జగదీష్ రెడ్డిలు కొనమంటున్నారని.. రైతులు ఎవరి మాటలు నమ్మాలన్నారు. కొత్త పరిశ్రమలు ఏర్పాటుకు 20 శాతం కమిషన్ డిమాండ్ చేస్తున్నారని ఆరోపించారు. బాయిల్డ్ రైస్‌కు కేంద్రం బోనస్ ఇస్తోందన్నారు.