నాపై కేసీఆర్ పంతం.. ఈటల సంచలనం..
posted on Oct 30, 2021 @ 11:17AM
హుజురాబాద్‌లో పోలింగ్ పోటెత్తుతోంది. ఓటర్లు భారీగా తరలివచ్చారు. పెద్ద పెద్ద క్యూ లైన్లతో ఓపిగ్గా ఓటేస్తున్నారు. అర్థరాత్రి వరకూ చీకట్లో సైలెంట్‌గా డబ్బుల పందేరం సాగిందంటున్నారు. ఉదయం సైతం.. అక్కడక్కడా డబ్బుల కట్టలు పట్టుబడటం కలకలం రేపుతోంది. ఓ న్యూస్ ఛానెల్ ప్రతినిధి పైసలు పంచుతున్నారనే ఆరోపణలతో అతన్ని పోలీసులు పట్టుకున్నారు. రిపోర్టర్ల ముసుగులో ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తున్నారంటూ బీజేపీ శ్రేణులు మండిపడుతున్నాయి.
ఇక టీఆర్ఎస్ చీఫ్ ఎలక్షన్ ఏజెంట్‌గా ఉన్న కౌశిక్‌రెడ్డి ఓ పోలింగ్ బూత్‌లోకి వెళ్లగా.. అక్కడే ఉన్న ఈటల వర్గీయులు ఆయన్ను అడ్డుకున్నారు. బలవంతంగా అక్కడి నుంచి పంపించేశారు. నిబంధనల ప్రకారం తాను ఏ బూత్‌లోకైనా వెళ్లొచ్చిన కౌశిక్‌రెడ్డి చెప్పినా.. గుంపుగా ఎందుకొచ్చావ్? ఓటర్లను ఎందుకు ప్రభావితం చేస్తున్నావంటూ.. స్థానికులు కౌశిక్‌రెడ్డిని అక్కడి నుంచి తరిమికొట్టారు. పెద్దగా ఉద్రిక్తతలు లేకున్నా.. ఉద్రిక్త వాతావరణం మాత్రం కొనసాగుతోంది.
ఇక, ఉదయమే కమలాపూర్‌లో ఓటు వేశారు బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్. హుజూరాబాద్‌లో పోలీసులే స్వయంగా రక్షణ కల్పించి అధికార పార్టీ డబ్బులు పంచేలా చేశారని ఈటల ఆరోపించారు. నియోజకవర్గంలో మద్యం ఏరులైపారిందని.. రూ.వందలకోట్లు పంపిణీ చేశారని ఆయన ఆరోపించారు. ప్రజలే బహిరంగంగా తమకు డబ్బు అందలేదని చెప్పడం ప్రజాస్వామ్యానికి మాయని మచ్చని మండిపడ్డారు.
ఈటల రాజేందర్‌ను అసెంబ్లీలో చూడొద్దని సీఎం కేసీఆర్ పంతం పట్టినట్టున్నారని.. అందుకే అధికార యంత్రాంగం సాయంతో సర్వశక్తులూ ఒడ్డుతున్నారని ఆరోపించారు. ప్రజలంతా దీన్ని ఎదుర్కోకపోతే సమాజం బానిసత్వంలోకి వెళ్లిపోతుందని.. ఆత్మగౌరవరం, ధర్మాన్ని గెలిపించుకోవాలని ఈటల రాజేందర్ పిలుపిచ్చారు.