వసూల్ రెడ్డి నిద్ర లేవరా.. పెట్రోల్, డీజిల్ పై వ్యాట్ తగ్గించరా!
posted on Nov 4, 2021 @ 7:30PM
దీపావళి కానుకగా వాహనదారులకు ఊరటనిస్తూ చమురు ధరలపై భారీగా ఎక్సైజ్ ట్యాక్స్ తగ్గించింది కేంద్ర ప్రభుత్వం. దీంతో లీటర్ పెట్రోల్ ధర 5 రూపాయలు, లీటర్ డీజిల్ ధర10 రూపాయలు తగ్గింది. ఎక్సైజ్ పన్ను తగ్గించడమే కాదు రాష్ట్రాలు కూడా తాము విధిస్తున్న వ్యాట్ ను తగ్గించాలని కేంద్రం సూచించింది. కేంద్రం ప్రకటనతో గుజరాత్ సహా పలు బీజేపీ పాలిత రాష్ట్రాలు చమురుపై కొంత వ్యాట్ తగ్గించాయి. దీంతో ఇతర రాష్ట్రాలపై ఒత్తిడి పెరుగుతోంది. ఏపీలో పక్క రాష్ట్రాలతో పోలిస్తే పెట్రోల్, డీజిల్ పై వ్యాట్ ఎక్కువగా ఉంది. దీంతో వ్యాట్ తగ్గించాలని వైసీపీ ప్రభుత్వాన్ని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.
వసూల్‌రెడ్డి నిద్రలేచేది ఎప్పుడని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ప్రశ్నించారు. పెట్రోల్, డీజిల్‌పై బాదుడు ఆపేది ఎప్పుడని ఆయన నిలదీశారు. కేంద్రప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతించి అన్ని రాష్ట్రాల సీఎంలు పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించడానికి చర్యలు తీసుకుంటున్నారన్నారు. హర్యానా, యూపీ ప్రభుత్వాలు పెట్రోల్, డీజిల్‌పై రూ.12 తగ్గించాయని చెప్పారు. అస్సోం, గోవా, త్రిపుర, మణిపూర్, కర్ణాటక పెట్రోల్, డీజిల్‌పై రూ.7 తగ్గించాయని గుర్తు చేశారు. ఢిల్లీ ప్రభుత్వం పెట్రోల్‌పై రూ.6.07, డీజిల్‌పై రూ.11.75 తగ్గించిందని అన్నారు నారా లోకేష్.
గుజరాత్ ప్రభుత్వం వ్యాట్ తగ్గించడానికి నిర్ణయించిందని లోకేష్ తెలిపారు. వసూల్‌రెడ్డికి మాత్రం పన్నుల భారం తగ్గించడానికి మనసు రావడంలేదని ఎద్దేవా చేశారు. పన్నుల బాదుడుతో జనజీవితాలు అగమ్యగోచరమయ్యాయని విమర్శించారు. దేశమంతా పెట్రోల్, డీజిల్‌పై పన్నులు తగ్గిస్తున్న నేపథ్యంలో ప్రజలపై వసూల్‌రెడ్డి కరుణ చూపాలని నారా లోకేష్ సూచించారు.