ఉద్యమ నేతలను ఈటల ఏకం చేస్తారా? టీఆర్ఎస్ పార్టీని చీల్చబోతున్నారా?
posted on Nov 4, 2021 @ 12:47PM
ఒక పోరాటం ముగిసింది. హుజూరాబాద్ ఉపన్నికలలో ముఖ్యమంత్రి కేసీఆర్ తv మంత్రి వర్గం నుంచి వెలివేసిన మాజీమంత్రి, తెలంగాణ ఉద్యమ నాయకుడు ఈటల రాజేందర్ విజయ బావుటా ఎగరేశారు.ఒక విధంగా ఉద్యమ జెండాను మరోమారు ఎగరేశారు. అయితే ఇక్కడితోనే అంతా అయిపోయినట్లు కాదు అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.
ఇది ఇక్కడితో ఆగే పోరాటం కాదు. నిజానికి తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నది కూడా ఈటల గెలుపు మాత్రమే కాదు,.ముఖ్యంగా తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ తో కలిసి నడిచిన ఉద్యమకారులు, ప్రస్తుత తెరాస పాలనతో విసిగి పోయిన యువత, నిరుద్యోగులు, ఇతర ఉపేక్షిత వర్గాలు, తెరాస పాలనను ఉద్యమ ద్రోహుల పాలనగా భావిస్తున్న విభిన్న వర్గాలు ఆ పాలన నుంచి సంపూర్ణ విముక్తిని కోరుకుంటున్నారు. ఈటల గెలుపు ద్వారా అదే ఆకాంక్ష మరోమారు స్పష్టమైందనే అభిప్రాయం కూడా రాజకీయ, మీడియా చర్చల్లో వ్యక్తమవుతోంది.“ప్రాంతేతరుడు ద్రోహం చేస్తే పొలిమేర వరకు తరిమికొట్టాలి. ప్రాంతం వాడే ద్రోహం చేస్తే ఇక్కడే బొంద పెట్టాలి” అంటూ మహా కవి కాళోజీ ఎప్పుడో ఇచ్చిన పిలుపు ఇప్పుడు ఉద్యమ నేతల నోట పదే పదే వినిపిస్తోంది. అందుకోసంగా ఉద్యమ నాయకులు అందరూ ఏకం కావలన్న ఆకాంక్ష అటు ప్రజల్లో, ఇటు నాయకుల్లో వ్యక్త మవుతోంది. నిజానికి ఇందుకోసమే హుజూరాబాద్ ఉప ఎన్నికలో ఉద్యమ నాయకులు ప్రత్యక్షంగా, పరోక్షంగా కూడా ఈటలకు మద్దతు పలికారు.
హుజూరాబాద్ ఉప ఎన్నికలో కేసీఆర్ ను ఓడించిన ఈటల రాజేందర్ ఇప్పుడు తెరాస పాలనకు వ్యతిరేకంగా ఉద్యమ నాయకులను ఏకం చేస్తారా? అనే విషయంలో రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అయితే ఉద్యమ నాయకులు ఏకమై ఉమ్మడి పోరాటం చేయవలసిన అవసరాన్ని, గుర్తించిన నాయకులు కూడా, అది ఆశించినంత సులభంగా అయ్యే పని కాదని అంటున్నారు. ముఖ్యంగా ఉద్యమకాలంలో లేని రాజకీయ విబేధాలు ఇప్పుడు ఉద్యమ నాయకుల మధ్య దూరాన్ని పెంచుతున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. ఉద్యమ కాలంలో జేఏసీ చైర్మన్ గా బీజేపీతో కలిసి పనిచేసిన కోదండ రామ్ వంటి వారు ఈటల బీజేపీలో చేరడాన్ని ఇప్పటికీ జీర్ణించుకోలేక పోతున్నారు. ఉప ఎన్నికలకు ముందు ఈటల ఇండిపెండెంట్ గా పోటీ చేయాలన్న తమ అభిప్రాయం ఇప్పటికీ అదేనని కోదండ రామ్ తాజాగా చెప్పు కొచ్చారు.
తెరాసను ఓడించడమే లక్ష్యంగా ఉద్యమ నాయకులను ఏకం చేసి ఒక ప్రత్యాన్మాయ రాజకీయ వేదిక పార్టీ ఏర్పాటు చేయాలనే ఆలోచన చేస్తున్న చేవెళ్ళ మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర రెడ్డి హుజూరాబాద్ ఉప ఎన్నికలో ఈటలకు బహిరంగ మద్దతు ఇచ్చారు. మద్దతు ఇవ్వడమే కాకుండా, ఆన్ని విధాల సహాయ సహకారాలు అందించారు. అయితే, ఆయన కూడా, ఈటల ఎంచుకున్న రాజకీయ పంథాతో విభేదిస్తున్నారు. రాష్ట్రంలో ఉంటే రెండు జాతీయ పార్టీలు, లేదంటే రెండు ప్రాంతీయ పార్టీలు బలంగా ఉండాలని, అప్పుడే రాష్ట్రంలో పరిపాలన సక్రమంగా సాగుతుందనే అభిప్రాయం విశ్వేశ్వర రెడ్డి వ్యక్త పరుస్తున్నారు.
ఇక కాంగ్రెస్, వామపక్షాలలో ఉన్న ఉద్యమకారులు బీజేపే నేత ఈటల వెంట నడిచే అవకాశం లేదు. సో... ఎప్పుడైతే ఈటల బీజేపీ తీర్థం పుచ్చుకున్నారో అప్పుడే, ఆయన ఉద్యమ నేతలకు కొంత దూరమయ్యారు. అయితే ప్రత్యేక పరిస్థితులలో జరిగిన ఉప ఎన్నికలో తెరాస బహిష్కృత నేతగా ఈటలను సమర్ధించిన ఉద్యమ నాయకులు ఇప్పడు బీజేపీ ఎమ్మెల్యే ఈటలకు అదే విధంగా సమర్ధించక పోవచ్చని పరిశీలకులు భావిస్తున్నారు. కాబట్టి ఉద్యమ నాయకులను ఈటల ఏకం చేయడం భవిష్యత్ లో ఏమో కానీ, ఇప్పటికిప్పుడు మాత్రం అయ్యే పని కాదని విశేషకులు భావిస్తున్నారు.