ఉప ఎన్నికలతో కాంగ్రెస్ కు బూస్ట్.. అసెంబ్లీ సమరంలో కలిసొచ్చేనా?
posted on Nov 3, 2021 @ 8:36PM
హుజూరాబాద్ అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో బీజేపీ విజయం సాధించింది. కాంగ్రెస్ పార్టీ డిపాజిట్ కోల్పోయింది. కట్ చేస్తే, దేశంలో హుజూరాబాద్’ తో పాటుగా వివిధ రాష్ట్రాల్లోని మరో 29 అసెంబ్లీ, మూడు లోక్ సభ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికలలో బీజేపీ బొక్కబోర్లా పడింది. నిజమే కావచ్చును, వేర్వేరు రాష్టాల్లో జరిగిన 29 అసెంబ్లీ, మూడు లోక్ సభ ఉప ఎన్నికల ఫలితాల ఆధారంగా దేశం మొత్తంలో రాజకీయ పరిస్థితిని అంచనా వేయడం అంత సరైన పద్దతి కాకపోవచ్చును. కాకపోతే బీజేపీ పాలిత హిమాచల్ ప్రదేశ్, హర్యాణ, కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ, సిట్టింగ్ బీజేపీ సీట్లను ఎగరేసుకు పోవడం, అదే సమయంలో కాంగ్రెస్ పాలిత రాజస్థాన్’లో ఏకంగా మూడవ స్థానానికి పడిపోవడం, కమల నాదులను కలవర పెట్టే అంశమే.
ముఖ్యంగా ఉత్తర ప్రదేశ్ సహా ఐదు రాష్ట్రాలలో మరికొద్ది నెలలలో ఉప ఎన్నికలు జరగనున్న నేపధ్యంలో కేంద్ర ప్రభుత్వం తెచ్చిన సాగు చట్టాలకు వ్యతిరేకంగా సంవత్సరం పైగా సాగుతున్న ఆందోళన కలవర పెడుతున్న సమయంలో, రాష్ట్రాలలో ఫలితాలు తిరగబడటం, బీజేపీ నాయకత్వాన్ని ఆందోళనకు గురిచేస్తోంది. నిజానికి, ఇప్పటికే కమల నాధులు ప్రమాద ఘటికలను పసికట్టారు. అందుకే, 2019 ఎన్నికల తర్వాత తొలిసారిగా, పార్టీ కీలక నిర్ణాయక కమిటీ నేషనల్ ఎగ్జికూటీవ్ కమిటీ (ఎన్ ఈసీ) సమావేశం నవంబర్ 7వ తేదీ ఆదివారం జరుగుతోంది. ఈ సమావేశంలో ఉప ఎన్నికల ఫలితాలతో పాటుగా, ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల గురించి కూడా చర్చిస్తారని సమాచారం.
కాంగ్రెస్ పార్టీలో ఉప ఎన్నికల ఫలితాలు కొత్త ఉత్సాహాన్ని నింపాయి.ముఖ్యమంగా బీజేపీ పాలిత హిమాచల్ ప్రదేశ్లో మూడు అసెంబ్లీ, ఒక లోక్ సభ స్థాన్నాన్ని బీజేపీ నుంచి కైవసం చేస్కోవడంతో కాంగ్రెస్ నేతల్లో జోష్ పెరిగింది. హిమాచల్’ తో పాటుగా కర్ణాటక లోనూ కాంగ్రెస్ పార్టీ బీజేపీ సిట్టింగ్ సీటును సొంత చేసుకుంది. ముఖ్యమంత్రి బొమ్మై సొంత జిల్లాలో బీజీపీ సిట్టింగ్ సీటు హంగల్ సీటును కాంగ్రెస్ కైవాసం చేసుకుంది. అలాగే రాజస్థాన్ లో బీజేపీ ఏకంగా మూడవ స్థానలోకి నెట్టివేయబడింది. అయితే అస్సాం, మధ్య ప్రదేశ్,మేఘాలయలో కాంగ్రెస్ రాష్ట్రానికి రెండు వంతున ఆరు సిట్టింగ్ స్థానాల్లో ఓడి పోయింది. హుజూరాబాద్ సహా ఏడు స్థానాల్లో డిపాజిట్ కోల్పోయింది .. ఓవరాల్ ట్యాలీ చూసినా, పది నుంచి ఎనిమిదికి పడిపోయింది.
అయినా హిమాచల్, గెలుపుతో కాంగ్రెస్ లో జోష్ పెరిగింది. ముఖ్యంగా బీజేపీతో ముఖాముఖీ పోరు జరిగిన హిమాచల్, రాజస్థాన్, కర్ణాటక, మహారాష్ట్రలో సాధించిన విజయం కాంగ్రెస్ పార్టీ నాయకుల్లో విశ్వాసాన్ని పెంచింది. సాగు చట్టాలు,పెట్రోల్, డీజిల్, గ్యాస ధరల విషయంలో మోడీ ప్రభుత్వం అనిసరిస్తున్న మొండి వైఖరి కారణంగా ప్రభుత్వ వ్యతిరేకత పెరుగుతోంది అనేందుకు ఈ ఫలితాలు నిదర్శనమని కాంగ్రెస్ భావిస్తోంది. ముందు ముందు మోడీ ఇదే మోడీ వైఖరి కొనసాగిస్తే, అది తమకు మరింత మంచి చేస్తుందని కాంగ్రెస్ వర్గాలు భావిస్తున్నాయి.